చేనేత కార్మికుల సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీదృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలంటూ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్ కార్డును కూడా రాశారు కేటీఆర్.. చేనేత కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన కేటీఆర్, ప్రధానంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. చేనేతపై 5 శాతం జీఎస్టీ పెంచాలన్నది కేటీఆరేనని ఆరోపించారు.. జీఎస్టీపై కేటీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు.. చేనేత కార్మికులకు బతుకమ్మ చీరెలను నేసే అవకాశం ఎందుకు ఇవ్వలేదు కేటీఆర్ అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ప్రధానికి పోస్ట్ కార్డు రాయడంపై మండి పడ్డ బండి.. చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కేటీఆర్ కోరారు.. ‘ఇదిగో వీడియో… ట్విట్టర్ టిల్లు దీనికేం సమాధానం చెబుతావ్? జీఎస్టీ సమావేశంలో పాల్గొన్నదెవరు? అక్కడ ఏం చెప్పావు? అని మండిపడ్డారు..
Read Also: Surprise in Flight: విమానం గాల్లో ఉండగా గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్.. ఆమె ఏం చేసిందంటే..?
చేనేతపై 5 శాతం జీఎస్టీ వేయాలని కేంద్రాన్ని కోరింది నువ్వే కదా? అని కేటీఆర్‌ను ప్రశ్నించిన బండి సంజయ్.. మరి రద్దు చేయాలని ఎందుకుచెప్పలేదు? అని నిలదీశారు.. చేనేత వస్త్రాలకు అద్దే రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం… ఎందుకు ఆ హామీని నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు, గోల్డ్ బిస్కెట్లు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఆరోపించారు.. కాగా.. చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, అవి చాలవన్నట్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తుల పై పన్ను వేసిందని కేటీఆర్ విమర్శించిన విషయం తెలిసిందే.. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అత్యంత కీలక ఉద్యమ సాధనంగా జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైన పన్ను వేసిన తొలి ప్రధాని మోడీనే అని ధ్వజమెత్తిన కేటీఆర్.. ఒకవైపు స్వదేశీ మంత్రం, ఆత్మనిర్బర్ భారత్, గాంధీ మహాత్ముని సూత్రాలను వల్లే వేసే కేంద్ర ప్రభుత్వం.. తన విధానాల్లో మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తుందని మండిపడ్డ విషయం విదితమే.