తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ నారాయణ పేట జిల్లా నుంచి పలువురు బీజేపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జాతీయ రాజకీయాలు అంటూ తిరుగుతున్న సీఎం కేసీఆర్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. చర్చల్లో ఉండటానికి ఢిల్లీ, జార్ఖండ్ వెళ్లారన్న ఆయన.. ప్లీజ్ నన్ను కలవండని బ్రతిమిలాడుకుంటున్నారు అంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు..
Read Also: KCR: ఆ బాధ్యత ప్రతీ భారతీయుడిపై ఉంది..
ఇక, ఇంట్లో లొల్లి అయినప్పుడల్లా కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తా అంటారు అని వ్యాఖ్యానించారు బండి సంజయ్.. హత్య కుట్రలు అంటూ బీజేపీని కేసీఆర్ బద్నాం చేసే ప్రయత్నం చేవారన్న ఆయన.. అవినీతి మంత్రిని కాపాడేందుకు బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.. సీఎం కుట్రను ప్రజలందరూ గ్రహించారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే టీఆర్ఎస్‌కి వేసినట్టే అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. నాడు ఉద్యమంలో ఆత్మహత్యలు… నేడు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని మండిపడ్డారు.. అడ్డదారిలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని.. రెట్టింపు ఉత్సహంతో బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.