నేడు తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆందోళన పేరుతో కాంగ్రెస్ విధ్వంసం సృష్టించిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కు ఎందుకు చేపట్టిందో అర్ధం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించిందని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదని బండి సంజయ్ విమర్శించారు.
స్వతంత్ర సమర యోధులు ఏర్పాటు చేసిన దాన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా అప్పనంగా దోచుకున్నారని, అప్పనంగా దొబ్బిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా.. ఈడీ విచారణ చేయొద్దా.. అని ఆయన ప్రశ్నించారు. అక్రమాలు బయటకు వస్తూ కాంగ్రెస్ ను ప్రజలు సమాధి చేస్తారని భయంతోనే ఇదంతా చేస్తున్నారని, మోడీ, అమిత్ షా ల కూడా విచారణను ఎదుర్కొన్నారు నిజాయితీని నిరూపించుకొని బయటకు వచ్చారన్నారు. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి వాస్తవాలను బయటకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈడీ విచారణ ఎందుకో ప్రజలకు వివరిస్తామని, సీఎం కను సన్నల్లైనే ఇదంతా జరిగిందని ఆయన మండిపడ్డారు.