NTV Telugu Site icon

Amnesia Pub Case: మనుషులా.? రాక్షసులా.?.. బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay 11

Bandi Sanjay 11

ఆమ్నేషియా పబ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి చేసిన కేసులో పెద్దపెద్ద వ్యక్తుల కుమారులు ఉన్నట్లుగా బీజేపీ ఆరోపిస్తోంది. ఏకంగా హోంమంత్రి మనవడు కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ కు సంబంధించిన పెద్ద వ్యక్తి కుమారుడు, ఓల్డ్ సిటీకి సంబంధించిన ఓ పత్రికా ఎండీ కుమారుడు కూడా ఈ కేసులో ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మరోవైపు రాజాసింగ్ కేసును పోలీసులు కావాలనే నీరుగారుస్తున్నారని.. ఈ కేసులో ప్రధాన నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మే 28న ఫిర్యాదు అందితే 31 వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని.. మూడు రోజుల పాటు ఎందుకు ఆలస్యం చేశారని రాజా సింగ్ ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసులపై ప్రెజర్ ఉందని ఆరోపించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆమ్నేషియా పబ్, అమ్మాయి అత్యాచారం కేసుపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మీరు మనుషులా.? రాక్షసులా.? మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే కనీసం స్పందించరా.? అంటూ ప్రశ్నించారు. 5 రోజులైనా నిందితులను అరెస్ట్ చేయకుండా కేసు నీరుగారుస్తారా.? చంచల్ గూడ జైల్లో ఉండాల్సినోళ్లను సేఫ్ ప్లేస్ లో పెడతారా.? అంటూ ప్రశ్నించారు. హత్యలు, అఘాయిత్యాలు జరుగుతుంటే సీఎం ఫిడేల్ వాయిస్తున్నారా.? అంటూ మండిపడ్డారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోతోందని విమర్శించారు.

ఎంఐఎం, టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఉద్యమ ధాటికి తట్టుకోలేరని హెచ్చరించారు. అత్యాచార ఘటనలో నిందితులపై చర్యలు తీసుకునేందుకు ఓవైసీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారా.? అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతంలో మహిళలకు రక్షణ లేదని.. చెప్పకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. నిందితులను గుర్తించలేదని విధంగా ఉన్న సీసీ కెమెరాలతో ప్రయోజనం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.