Telangana BJP Chief Bandi Sanjay Clarify About Singareni Privatization.
సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నట్లు టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని, అది రాష్ట్ర ప్రభుత్వం చేతులో ఉందని బండి సంజయ్ ఉద్ఘాటించారు. అంతేకాకుండా సింగరేణి ఎన్నికలు వస్తుండటంతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఆడే అబద్దాలకు అంతూపొంతు లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు…అన్నట్లుగా సిగ్గులేకుండా పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని ఆయన విమర్శించారు. అందుకే సింగరేణిని ప్రైవేటీకరించాలనే ప్రచారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు నేను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశానని ఆయన పేర్కొన్నారు.
నా లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సింగరేణి విషయంలో స్పష్టమైన వివరణ ఇచ్చారని ఆయన వెల్లడించారు. సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని, అది అసాధ్యం కూడా అని కేంద్రమంత్రి తేల్చారని ఆయన తెలిపారు. సింగరేణి సంస్థలో అత్యధికంగా 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర వాటా 49 శాతం మాత్రమనని ఆయన అన్నారు. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడం అసాధ్యం. ఆ మాటే ఉత్పన్నం కాదని తేల్చేశారని బండి సంజయ్ తెలిపారు.