Bandi Sanjay Challenges CM KCR Over Current Issue: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా సీఎం కేసీఆర్‌కు ఓ సవాల్ విసిరారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తేల్చి చెప్పారు. ఒకవేళ నిరూపించకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కేసీఆర్ సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నట్టు.. మోటార్లకు మీటర్లు పెడతామని బీజేపీ చెప్పలేదని, ఒకవేళ పెడితే దానికి తానే బాధ్యత తీసుకుంటానని అన్నారు. లేని పక్షంలో ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. రూ.60 వేల కోట్ల బకాయిలతో డిస్కంలను కేసీఆర్ సంక్షోభంలోకి నెట్టారని.. కరెంట్ ఛార్జీల పెంపుతో జనం నడ్డి విరుస్తున్నారని ఆరోపణలు చేశారు. మేకిన్ ఇండియాపై కేసీఆర్ వేసిన సెటైర్లకు.. మేకిన్ ఇండియా పేరుతో స్థానిక పరిశ్రమల నుండే చైనా బజార్లకు వస్తువులు వెళుతున్నాయని కౌంటర్ ఇచ్చారు.
Read Also: బండి సంజయ్‌కి సూటి ప్రశ్న.. ఆ నిధులు ఎందుకు ఆపారు?
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతే ఉరి వేసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే.. ఇప్పుడు ఎక్కడికి పోయాడు? అంటూ బండి సంజయ్ నిలదీశారు. లక్ష కోట్లతో దొంగ సారా దంగా చేస్తారు కానీ.. రూ. 250 కోట్ల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు మాత్రం డబ్బులివ్వరా? అని ప్రశ్నించారు. తానే కేంద్రాన్ని ఒప్పించి.. రూ. 250 కోట్లతో ఆ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించిన ఆయన.. గల్ఫ్ బాధితుల శవాలను కూడా తీసుకురాలేని అసమర్థులు అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వేములవాడ రాజన్న, బాసర సరస్వతి ఆలయాలకు వందల కోట్ల మంజూరు హామీ ఏమైందని.. మళ్లీ కొండగట్టు అంజన్న పేరుతో దేవుళ్లకే శఠగొపం పెడతున్నారని ఆరోపించారు. బీడీ కార్మికుల బాధల్ని పట్టించుకోవడం లేదని, పెన్షన్లకు కటాఫ్ డేట్ ఎత్తేయాలని కోరారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రమే ఇస్తోందని అన్నారు.
Read Also: క్రిప్టో కరెన్సీ కంటే వేగంగా పతనం.. భారత్‌పై సెహ్వాగ్ సెటైర్
అంతకుముందు.. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత భారీ దోపిడి చేసిందని, ఆమె జైలుకు వెళ్లటం ఖాయమని అన్నారు. సారాతో పాటు క్యాసినోలలోనూ కవిత పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిందని అన్నారు. సీఎం కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మటం లేదని.. గుజరాత్‌లో ఏ విధంగా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారో, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ అలాగే బీజేపీని గెలిపిస్తాని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. ఈసారి తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని జోస్యం చెప్పారు.