హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో టీఆర్‌ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి. 2 దశబ్దాలు కలిగిన టీఆర్‌ఎస్ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అయితే ప్లీనరీ సమావేశాల్లో భాగంగా.. బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వెనుబడిన జాతి దళిత జాతి అని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్యాయానికి గురైన జాతి దళిత జాతి అన ఆయన అన్నారు. ఈ దళిత జాతికి సంబంధించి గుర్రం జాషువా గబ్బిలం కావ్యంలో ‘భారతావని దళితజాతికి బాకీ పడిందని’ అంటూ స్పష్టంగా రాశారని గుర్తు చేశారు. దాన్ని పూర్తిస్థాయిలో గుర్తించిన మహానుభావుడు కేసీఆర్ మాత్రమేనని బాల్క సుమన్ కొనియాడారు.
దళితజాతికి భారతావని బాకీ పడ్డదని కేసీఆర్ గుర్తించి దళితబంధు లాంటి పథకం దళితజాతి కోసం తీసుకొచ్చారన్నారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం భారతజాతి అంబానీ, అదానీకి బాకీ పడ్డదని చెప్పి దేశానికి సంబంధించిన లక్షల కోట్ల సంపదను వారికి అప్పజెప్పుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిద్దిపేటలో ఒక దళితుడిని మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసి అప్పుడే అందరి దృష్టిని ఆయన మార్చకున్న నేత కేసీఆర్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.