తాండూరులో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై గిరిజన బాలికల వసతి గృహ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో తన కూతురు తీవ్ర అస్వస్థతకు గురై ఇబ్బందికరంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని గిరిజన బాలికల వసతి గృహ విద్యార్థిని తండ్రి రాములు నాయక్ ఆరోపించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ నగర పరిధిలోని వెంకటాపురం తండకు చెందిన రాములు నాయక్ తన ఇద్దరు కూతుర్లు అమృత, లోకేశ్వరిలను గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో చదివిస్తున్నాడు. అయితే గత నెల 26వ తేదీన అమృత అనారోగ్యానికి గురైంది. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతోందని తండ్రికి హాస్టల్ సిబ్బంది సమాచారం అందించారు. ఇక, విషయం తెలుసుకున్న రాములయ్య వెళ్లడంతో అప్పటికే బాలిక స్పృహ కోల్పోయి ఉండడంతో.. వికారాబాద్ లోని మహావీర్ హాస్పిటల్ కు చికిత్సకై తరలించారు. ఈ క్రమంలో విద్యార్థిని అమృత చికిత్స పొందుతోంది.
Read Also: Intresting Traditions: గోమూత్రంతో తలస్నానం, పేడతో పండ్లు తోమడం.. ఇలా ఎన్నో.. ఎక్కడో తెలుసా..?
ఈ విషయమై విద్యార్థిని తండ్రి రాములు నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థినీల ఆరోగ్య సంరక్షణ పట్ల వసతి గృహ సిబ్బంది, అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిన తర్వాత సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం అప్పు చేసి 70 వేల రూపాయల వరకు ఖర్చు చేసి చికిత్స అందించాల్సి వస్తుందని పేర్కొన్నారు. తాము మరింత ఆలస్యం చేస్తే తమ కూతురు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల నిర్వహణ బృందంతో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన బిడ్డ ఒక అమ్మాయి గురించే కాకుండా వసతి గృహంలోని మరి కొంత మంది సైతం ఇబ్బందులు పడుతున్నారని వారి తమ ఆవేదనను బహిర్గతం చేయలేకపోతున్న పరిస్థితి నెలకొందని రాములు నాయక్ ఆరోపించారు.