Hyderabad: ఉప్పల్ లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారి కంట్లో నలక పడిందని ఆసుపత్రికి వెళితే ప్రాణం తీసిన ఘటన నగరంలో కలకలం రేపింది. హన్విక కుటుంబ సభ్యులు బీరంగూడ లో నివాసం ఉంటున్నారు. ఇంటిముందు ఆడుకుంటుండగా కంట్లో కర్ర ముక్క గుచ్చుకుంది. దీంతో హన్విక తల్లిదండ్రులు వెంటనే చందనగర్ లోని ఆనంద్ ఐ హాస్పిటల్ తీసుకెళ్ళారు. హన్వికకు ఐ డ్రాప్స్ వేసి ఆనంద్ ఐ హాస్పిటల్ సిబ్బంది ఇంటికి పంపారు. కాసేపటికి చందానగర్ హాస్పిటల్ సిబ్బంది హన్విక తల్లిదండ్రులకు కాల్ చేసి.. హబ్సిగూడ లో ఉన్న తమ మెయిన్ బ్రాంచ్ కి వెంటనే పాప ను తీసుకెళ్ళాలని సూచించారు. దీంతో కంగారు పడ్డ హన్విక తల్లిదండ్రులు హుడాహుడిగా.. హబ్సిగూడ ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్లారు. హన్వికకు సర్జరీ చేయాలని ముక్కు ద్వారా అనస్థీషియా ఇచ్చారు. డోస్ ఎక్కువవడంతో హన్విక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో హన్వికకు ఆనంద్ హాస్పిటల్ సిబ్బంది మళ్లీ హుటాహుటిన ఎల్బీ నగర్ రెయిన్ బో కి తరలించారు.
Read also: Pimple: మొటిమలు గిల్లితే ఇన్ఫెక్షన్ అవుతుందా..?
అయితే హన్విక ఆరోగ్య పరిస్థితిపై ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ సిబ్బందికి విచారించగా.. రెయిన్ బో ఆసుపత్రికి తరలించారని తెలిపారు. కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా పాపను ఎలా వేరే ఆసుపత్రికి తరలిస్తారని ప్రశ్నించగా ఎటువంటి సమాధానం రాలేదు. ఇక హన్విక కుటుంబ సభ్యులు వెంటనే రెయిన్ బో హాస్పిటల్ వద్దకు వెళ్లి హన్విక ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. రెయిన్ బో ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. వారివద్దకు రాక ముందే పాప హన్విక మృతి చెందిందని తెలిపారు. దీంతో హన్విక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కంట్లో నలక పడిందని వస్తే సర్జరీ చేయాలని చెప్పి ఇప్పుడు పాప మృతదేహాన్ని అప్పగిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్విక మృతదేహాన్ని తీసుకుని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Bhatti Vikramarka: మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవ సభ.. రాజధానిలో కార్నివాల్, లేజర్ షో