Another Woman Died After Family Planning Operation In Old City: ఇబ్రహీంపట్నం ఘటన రాష్ట్రంలో ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆపరేషన్లు చేయాలని.. 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయగా, నలుగురు మృతి చెందారు. మిగతా మహిళల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, వెంటనే ఇతర ఆసుపత్రులకు తరలించి వారికి మెరుగైన చికిత్స అందించారు. ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా.. వైద్యుల్లో మార్పు రానట్టు కనిపిస్తోంది. నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మరో మహిళ ఈ కు. ని. ఆపరేషన్ కారణంగా మృతి చెందింది.
పాత బస్తీలోని పెట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రిలో ఓ మహిళకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ చేసిన తర్వాత మొదట్లో ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. కానీ, మర్నాడు నుంచి ఆమెకు జ్వరం, వాంతులు, వీరోచనాలు రావడం మొదలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆమెను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యం అందించారు. సమస్య తెలుసుకొని, పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందింది. ఈమె మృతి వెనుక కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం.