కర్నూలు జిల్లా ఆలూరు పీఎస్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మందుబాబు పోలీసు జీపును దర్జాగా ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలూరులో బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పెద్దహోతూరు యువరాజు పట్టుబడ్డాడు. తన బైక్ ఇవ్వాలని, ఇంటికి వెళ్లి వస్తానని పోలీసులతో చెప్పాడు. బైక్ ఇవ్వకపోవడంతో వేరే బైక్ తీసుకుని వెళ్లాడు. ఇవాళ ఉదయం మళ్లీ బైక్ తీసుకువచ్చాడు. తన బైక్ ఇస్తే వెళ్లిపోతానని, లేకుంటే పోలీస్ జీపు తీసుకువెళ్తానని యువరాజు అధికారులతో చెప్పాడు.
యువరాజు మద్యం మత్తులో ఆలా మాట్లాడుతున్నాడని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. చెప్పినట్టుగానే సీఐ జీప్ తీసుకొని యువరాజు పెద్దహోతూరు వెళ్లిపోయాడు. మద్యం మత్తులో మాట్లాడలేని స్థితిలో ఇంట్లో పడిపోయాడు. కాసేపటికి పోలీస్ జీపును తెచ్చినట్టు గుర్తించి.. వెంటనే జీపు తీసుకొని యువరాజు సోదరుడు అంజి పీఎస్‌కు వెళ్ళాడు. ఈ విషయం కాస్త అందరి నోళ్లలో పడింది. అయితే అలాంటిదీమే జరగలేదని సీఐ రవిశంకర్ అంటున్నారు.