ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) పరిధిలో జరిగిన ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బి.ఎస్.సి అగ్రికల్చర్ మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి జరిగిన ఈ అక్రమం, ఒక సాధారణ కాపీయింగ్ కేసుతో మొదలై భారీ నెట్‌వర్క్‌ను బయటపెట్టింది. జగిత్యాల వ్యవసాయ కళాశాలలో పరీక్ష జరుగుతున్న సమయంలో, వ్యవసాయ శాఖలో ఏఈఓగా (AEO) పనిచేస్తూ ఇన్-సర్వీస్ విద్యార్థిగా చేరిన ఒక అభ్యర్థి కాపీ కొడుతూ పట్టుబడటంతో ఈ లీకేజీ గుట్టురట్టయింది. సదరు అభ్యర్థిని లోతుగా విచారించిన అధికారులు, అతనికి ముందే ప్రశ్నపత్రం అందినట్లు గుర్తించడంతో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జానయ్య రంగంలోకి దిగి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
Mamata Banerjee: అమిత్ షా “పెన్‌డ్రైవ్” నా దగ్గర ఉంది.. అది బయటకు తెస్తే..
ఈ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. వరంగల్ వ్యవసాయ కళాశాల ఈ లీకేజీకి ప్రధాన కేంద్రంగా పనిచేసినట్లు అధికారులు నిర్ధారించారు. వరంగల్‌లో పనిచేసే ఒక నాన్-టీచింగ్ సిబ్బంది (క్లర్క్), అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాన్ని తన దుస్తుల కింద దాచుకుని కెమెరాతో ఫోటోలు తీసి, వాటిని ఒక ఇన్-సర్వీస్ విద్యార్థినికి పంపినట్లు తేలింది. అక్కడి నుండి ఈ పేపర్ వాట్సాప్ ద్వారా జగిత్యాల, అశ్వరావుపేట , సిరిసిల్ల ప్రాంతాల్లో ఉన్న సుమారు 35 మంది ఇన్-సర్వీస్ విద్యార్థులకు చేరింది. ఈ ప్రశ్నపత్రం కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10,000 నుంచి రూ. 20,000 వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈ అక్రమాలకు పాల్పడిన విద్యార్థులకు అత్యంత కఠినమైన సబ్జెక్టులలో కూడా 95 శాతానికి పైగా మార్కులు రావడం అధికారులకు బలంగా అనుమానం కలిగించింది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, విద్యార్థులు పరీక్ష మొదలైన మొదటి 15 నిమిషాలు ఏమీ రాయకుండా ఉండి, చివరి 10 నిమిషాల్లో ఓఎంఆర్ షీట్లలో సమాధానాలను వేగంగా గుర్తించడం ద్వారా తమ వద్ద ముందే సమాధానాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విశ్వవిద్యాలయ యంత్రాంగం, లీకేజీకి బాధ్యులైన నలుగురు సిబ్బందిని (ఒక ఉన్నతాధికారితో సహా) తక్షణమే సస్పెండ్ చేసింది. లీకేజీలో ప్రమేయం ఉందని తేలిన 35 మంది ఇన్-సర్వీస్ విద్యార్థులపై కఠిన చర్యలకు సిద్ధమైంది. కేవలం విద్యార్థుల వరకే కాకుండా, ఈ వెనుక ఉన్న సాంకేతిక నెట్‌వర్క్‌ను , ఆర్థిక లావాదేవీలను ఛేదించడానికి కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగిస్తున్నట్లు వి.సి జానయ్య ప్రకటించారు. హైటెక్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా విద్యార్థులు ఇటువంటి అక్రమాలకు పాల్పడటం పట్ల వర్సిటీ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. రాబోయే రోజుల్లో పరీక్షా నిర్వహణలో మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తామని, అర్హులైన విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వమని యాజమాన్యం భరోసా ఇచ్చింది.
Sankranti Ideas : మీ ఇంటికి పండుగ కళ రావాలా..? ఈ సింపుల్ అలంకరణ చిట్కాలు పాటించండి.!