Additional CP Srinivas : ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐ-బొమ్మ’ నిర్వాహకుడు రవిని పట్టుకోవడంలో హైదరాబాద్ పోలీసులు ఎదుర్కొన్న సవాళ్లు, సాంకేతిక అంశాలపై అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కీలక విషయాలను ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు సందర్భంగా తమకు ఎదురైన ఆసక్తికర అంశాలను, నిందితుడు డేటాను సేకరించిన పద్ధతిని ఆయన వివరించారు.
ఈ కేసు దర్యాప్తు మొదలైనప్పుడు, నిందితుడు మన రాష్ట్రమా లేదా దేశం దాటి ఉన్నాడనే ఆలోచన తమకు లేదని, స్థానికంగా ఉన్న వ్యక్తులే ఈ పని చేస్తున్నారని మొదట భావించామని అదనపు సీపీ శ్రీనివాస్ తెలిపారు. మొదట్లో ఎటువంటి పక్కా క్లూ దొరకలేదని, అయితే అనుమానాన్ని విస్తరించి, రాష్ట్రం దాటి తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలపై దృష్టి సారించామని పేర్కొన్నారు. చివరకు, తమ ఆఫీసర్లలో ఒకరు పట్టుకున్న ఒక చిన్న క్లూ ఈ కేసును ఛేదించడంలో కీలకంగా మారింది. ఈ దర్యాప్తును సీపీ ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షించారని ఆయన వెల్లడించారు.
గతంలో ఈ కేసు అప్పటి సీపీకి ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారిందని, తాము పట్టుకోలేమని నిందితుడు పత్రికల్లో వార్తలు వచ్చేలా సవాలు విసిరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఐ-బొమ్మ రవి కేసులో బయటపడిన అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, నిందితుడు ఏకంగా 50 లక్షల మంది ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించడం. ఈ డేటాను సేకరించడానికి రవి ఉపయోగించిన పద్ధతి చాలా ఆశ్చర్యకరం.
పైరసీ సైట్లు (ఐ-బొమ్మ లేదా బప్పం వంటివి) ఓపెన్ చేయగానే, యూజర్‌ను ముందుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ (నిబంధనలు, షరతులు)కి అంగీకరించమని అడుగుతారు. ఈ షరతులు చాలా పెద్దవిగా, సంక్లిష్టంగా ఉండటంతో ఎవరూ చదవకుండానే ‘ఐ అగ్రీ’ అని కొట్టేస్తారు. అయితే, ఈ ‘ఐ అగ్రీ’ బటన్ నొక్కడం ద్వారా, యూజర్ తన ఫోన్‌లోని కెమెరా, కాంటాక్ట్స్, ఫోటోలు, వీడియోలు, SMS వంటి వ్యక్తిగత డేటాను స్వచ్ఛందంగా ఉపయోగించడానికి వారికి అనుమతి ఇస్తున్నట్లుగా అంగీకరిస్తున్నారని సీపీ వివరించారు. ఈ విధంగా, యూజర్లు తమకు తెలియకుండానే తమ వ్యక్తిగత సమాచారాన్ని ఆ సైట్‌కు అప్పగించేస్తున్నారని హెచ్చరించారు.
ఐ-బొమ్మ రవికి ఆదాయం సినిమా పైరసీ ద్వారా నేరుగా రాదని, ఇతర మార్గాల ద్వారా వస్తుందని ఆయన తెలిపారు. యూజర్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయి, షరతులను అంగీకరించిన వెంటనే, ఆ సైట్ వెంటనే ఓపెన్ కాకుండా, యూజర్‌ను గేమ్స్, బెట్టింగ్ యాప్స్, అఫిలియేటెడ్ మార్కెటింగ్ వంటి ప్రకటనల వైపు మళ్లిస్తుంది. పైరసీ సైట్ ద్వారా భారీగా ట్రాఫిక్‌ను సృష్టించి, ఆ ట్రాఫిక్‌ను ఈ బెట్టింగ్, గేమింగ్ కంపెనీలకు మళ్లించడం ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయమే ఐ-బొమ్మ రవికి ప్రధాన ఆదాయ వనరు అని ఆయన వివరించారు.