ACB Court Gives Green Signal To Police Custody On Moinabad Episode: తెలంగాణలో సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాజాగా మరో మలుపు చోటు చేసుకుంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేయగా.. మరోవైపు ముగ్గురు నిందితుల పోలీసుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌లను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన ఏసీబీ కోర్టు.. నిందితుల్ని రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే రేపు నిందితుల్ని చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్‌లో.. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, డీసీపీ కల్‌మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిలను సభ్యులుగా ఉన్నారు.
కాగా.. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల కోసం ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌లను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే! మొయినాబాద్ ఫాంహౌస్‌లో వందల కోట్ల డబ్బులతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు అధికార పార్టీకి చెందినవారని టీఆర్ఎస్ చెప్పడంతో.. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. అనంతరం.. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన రోజే సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించి, ఫాంహౌస్ ఎపిసోడ్‌కి సంబంధించిన వీడియో రికార్డులను రిలీజ్ చేశారు.