Baby girl for sale: ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి అని పెద్దలు అంటుంటారు. కానీ అమ్మాయి అంటే సమాజంలో ఇప్పటికీ ఓ చిన్నచూపే ! మగ పిల్లాడు పుడితే సంబురాలు చేసుకుంటూ.. ఆడపిల్ల పుడితే భారంగా భావించే వాళ్లు చాలామందే ఉన్నారు. ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో అనే వారు.. కానీ ఇప్పుడు మారుతున్న సమాజంలో ఇంకా వెనకటితరంలోనే మగ్గిపోతున్నారు. పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే వద్దనుకుంటున్నారు. పురిటిలోనే వదిలేసి వెళ్లిపోతున్న పరిస్థితి. మరికొందరు తమకు ఆడబిడ్డ వద్దు అంటూ కన్న తల్లిదండ్రులే వేరే వాళ్లకు విక్రయిస్తున్నారు. మరి కొందరు పుట్టిన బిడ్డను అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిని ఆడశిశువును కన్నవారే అమ్మకానికి పెట్టడంతో.. మరొకరు ఆడ శిశువు జన్మించిందని అక్కడే వదిలేసి వెళ్లిన సంఘటనలు సంచలనంగా మారింది.
రామారెడ్డి మండలం స్కూల్ తండాకు చెందిన ఓ గర్భిణీ అన్నారం పీ.హెచ్.సీలో ప్రసవించింది. అయితే ఆ తల్లి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆశిశువు వారికి భారంగా మారిందో ఏమో లేక మగ సంతానం కావాలనుకున్నారో ఆడపిల్ల పుట్టిన వెంటనే తల్లిదండ్రులు శిశువును అమ్మకానికి పెట్టారు. మరో తల్లి ఆబిడ్డను హక్కున చేర్చుకుంది. దీంతో ఆ తల్లిదండ్రులు ఆమె వద్దనుంచి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికంగా కలకలం రేపిన ఈఘటనపై పీహెచ్‌సీ సిబ్బంది పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఐసీడీఎస్ అధికారులు వెంటనే స్కూల్ తండాలో బాలింత ఇంటికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఆడశిశువును వారు ఎందుకు వేరే వారికి అప్పగించారు అనే విషయమై ఆరా తీస్తున్నారు. అయితే బతుకు భారం కావడంతోనే శిశువు అమ్మాకానికి పెట్టినట్లు బాధితులు తెలిపినట్లు సమచారం.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న BDL భానురు పోలీసులు ఆశిశువును తీసుకుని ICDS అధికారులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో శిశువుకు ప్రథమ చికిత్స చేసి శిశువిహర్ కి తరలించారు. శిశువును ఎవరు అక్కడ వదిలి వెళ్లారో దర్యాప్తు చేస్తున్నారు.