తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 91,147 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని ఈరోజు నుంచే నోటిఫై చేస్తున్నామన్నారు. అందులో 80,039 ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచే శాఖల వారీగా నోటిఫికేషన్లు వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 95శాతం ఉద్యోగాలు స్థానికులే పొందుతారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కాగా పోలీస్ శాఖలో 18,334, విద్యాశాఖలో 13,086, ఉన్నత విద్యాశాఖలో 7,878, రెవెన్యూ శాఖలో 3,560, వైద్య ఆరోగ్యశాఖలో 12,755, బీసీ సంక్షేమ శాఖలో 4,311, సాగునీటి శాఖలో 2,692, ఎస్సీ సంక్షేమ శాఖలో 2,879, ట్రైబల్ వేల్ఫేర్‌లో 2,399 ఖాళీలు ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జనరల్ అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచగా.. SC/ST/BC అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు వయో పరిమితిగా ఉంటుందని కేసీఆర్ చెప్పారు.