భూ నిర్వాసితుల కోసం త్వరలో 72 గంటల దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రైతులతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని బండరావిరాల, చిన్నరావిరాల సర్వే నెం.268లో భూమిని కోల్పోయిన రైతులు తమకు నష్టపరిహారం ఇవ్వాలని కొన్ని నెలలుగా చేస్తున్న పోరాటానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు.. గతంలో భూనిర్వాసితులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఆయన.. నేడు రైతు పోరాట సమితికి మద్దతుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు..
Read Also: Constable Rape: దారుణం.. అర్ధరాత్రి నడిరోడ్డుపై మెడికోపై పోలీస్ అత్యాచారం..?
రైతులకు మద్దతుగా త్వరలోనే 72 గంటల దీక్ష నిర్వహిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు ఎంపీ కోమటిరెడ్డి.. శాంతియుతంగా నేను పోరాటం చేస్తానన్నారు. తెలంగాణ కోసం ఆమరణ నిరాహారదీక్ష చేశా.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకోసం మరోసారి దీక్ష చేస్తా అన్నారు. రైతులు పోరాటాన్ని మధ్యలో ఆపొద్దు.. మీకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఆయన.. మీరు చెప్పిన మాటనే నిలబెట్టుకోవాలన్నారు.. ఇక, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదని మండిపడ్డ ఆయన.. భువనగిరి ప్రాంతంలో 32 లక్షల నష్టపరిహారం ఇస్తే ఇక్కడ మాత్రం రూ.7.15 లక్షలే ఇచ్చారన్నారు. మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులను నియోజవర్గంలో తిప్పటం కాదు ప్రజలకు న్యాయం చేయండి.. 15 రోజుల సమయం ఇస్తున్న రైతులకు న్యాయం చేయండి లేదంటే మేమే మీపై యుద్ధం చేస్తాం అని హెచ్చరించారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.