5K Run On The Occasion Of Independence Diamond Jubilee: స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో 5కే రన్ నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఈ 5కే రన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హోమ్ మంత్రి మెహమూద్ అలీ, మంత్రి తలసాని యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, సీపి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందని, మహాత్మా గాంధీతో పాటు మన తాతల తరాల వారు స్వాతంత్ర్యం కోసం పోరాడారని, ఈ వేడుకలు ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగుతాయని సీపీ ఆనంద్ తెలిపారు.
అలాగే మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగం వల్లే స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే.. అది వారి త్యాగాల ఫలమేనన్నారు. చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం యువతకు ఉందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో 5కే రన్ నిర్వహించడం ఆనందంగా ఉందని, 8వ తేదీ నుండి 22 వరకు ఈ వేడుకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని మనం కొనసాగించాలని పిలుపునిచ్చారు.