ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన 5జీ సేవల్ని దేశమంతటా విస్తరించే పనిలో శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు నగరాల్లో 5జీ సేవలు తీసుకొచ్చిన జియో.. తాజాగా దేశంలోని మరో 50 సిటీల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. కొత్తగా సర్వీస్‌లు ప్రారంభించిన నగరాల పరిధిలోని యూజర్లు జియో వెల్‌కమ్ ఆఫర్‌ను యూజ్ చేసుకోవాలని కోరింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే 1జీబీపీఎస్ కంటే ఎక్కువ వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చని చెప్పింది. ఈ కొత్త నగరాలతో మొత్తం దేశ వ్యాప్తంగా 184 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లైందని ఈ టెలికాం సంస్థ పేర్కొంది.
Disney Plus Hotstar: వారికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ..బంపరాఫర్
“మొత్తం 17 రాష్ట్రాల పరిధిలో మరో 50 నగరాలకు 5జీ సేవల్ని విస్తరించడం ఆనందంగా ఉంది. 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక ఒకేసారి ఇన్ని నగరాలకు విస్తరించడం ఇదే తొలిసారి” అని రిలయన్స్ జియో ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, హర్యానా, జార్ఘండ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల పరిధిలోని కొన్ని నగరాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తాజాగా 5జీ సేవలను ప్రారంభించినట్లు జియో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, ఒంగోలు, కడప, అస్సాంలోని నాగాన్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్, కోర్బా, గోవా రాజధాని పనాజీ, హర్యానాలోని అంబాలా,హిస్సార్, కర్నాల్, పానిపట్, రోహ్‌తక్, కర్ణాటకలోని హసన్, మాండ్యా నగరాల్లో కొత్తగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో 5జీ సేవల్ని విస్తరించగా.. ఇటీవల ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు నగరాల్లో ఈ సేవలను విస్తరించిన విషయం తెలిసిందే.