RBI launches UPI 123Pay for instant digital payments using feature phones.
దేశంలో రోజురోజుకు డిజిటలైజేషన్ పెరిగిపోతోంది. చిన్నచిన్న లావాదేవీలకు కూడా డిజిటల్‌గా చెల్లిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. డిజిటలిజం ఎంతగా అందరికీ అలవాటైందో. అయితే ఈ డిజిటలైజేషన్‌ను గ్రామస్థాయిలో కూడా డెవలప్ చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపుల వ్యాప్తిని పెంచే లక్ష్యంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీచర్ ఫోన్‌ల కోసం UPI ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్బీఐ నాన్-స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం యూపీఐ(UPI)ని ప్రారంభించింది. దీంతో దేశంలో రిటైల్ చెల్లింపుల వ్యవస్థను మరింత అందుబాటులోకి రానుంది.
అంతేకాకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపుల నెట్‌వర్క్‌ను మరింతగా పెంచుతుందని భావిస్తున్నారు. యూపీఐ 123పే (UPI 123Pay) అని పిలువబడే ఆర్బీఐ కొత్త సేవ ఫీచర్ ఫోన్ వినియోగదారులను తక్షణ డిజిటల్ చెల్లింపులను చేయడానికి ఉపయోగపడుతుంది. ఫీచర్ ఫోన్‌ల కోసం యూపీఐ గేమ్‌చేంజర్‌గా ఉంటుందని, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న చెల్లింపు వ్యవస్థను గ్లోబల్ మ్యాప్‌లో ఉంచడం ఖాయమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రబీ శంకర్ అన్నారు.