Public Charging: రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!

Public Charging

Public Charging

Public Charging: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ప్రయాణాల సమయంలో ఫోన్ బ్యాటరీ – లో అయితే వెంటనే ఛార్జింగ్ కోసం చాలా మంది విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, కేఫ్‌లలో అందుబాటులో ఉండే పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో హ్యాకర్లు తమ పరికరాలను అమర్చే అవకాశం ఉంటుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు మీ ఫోన్‌ను అలాంటి ఛార్జింగ్ పోర్ట్‌కు కనెక్ట్ చేసినప్పుడు, మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు లేదా ఇతర సున్నితమైన డేటాను దొంగిలించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఫోన్‌లోకి వైరస్‌లు పంపించి హ్యాకింగ్ లేదా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయని పేర్కొంటున్నారు.

సాధారణంగా మనం ఉపయోగించే USB కేబుల్ కేవలం బ్యాటరీ ఛార్జింగ్‌కే కాకుండా డేటా బదిలీకి కూడా ఉపయోగపడుతుంది. దీంతో పబ్లిక్ USB పోర్ట్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు మీ ఫోన్‌లోని సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీనినే “జ్యూస్ జాకింగ్” (Juice Jacking) అనే సైబర్ మోసంగా పిలుస్తారని వెల్లడించారు. మీరు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లో ఫోన్ పెట్టిన తర్వాత “ఈ పరికరాన్ని అనుమతించాలా?” లేదా డేటా యాక్సెస్‌కు సంబంధించిన ఏదైనా పాప్‌అప్ కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. తెలియని పరికరాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. అలా చేయడం వల్ల మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు. మీ ట్రావెలింగ్ టైంలో మొబైల్ ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం అని అంటున్నారు. ఎప్పుడూ మీ సొంత ఛార్జర్, USB కేబుల్‌ను వెంట తీసుకెళ్లడం మంచిదని, వీలైనంత వరకు నేరుగా ఛార్జింగ్ చేసుకోవడం మంచి పద్ధతని అంటున్నారు. అలాగే ముందుగానే పవర్ బ్యాంక్‌ను ఛార్జ్ చేసి వెంట తీసుకెళ్లడం ద్వారా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా డేటా దొంగతనం, బ్యాంక్ మోసాలు వంటి ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.