భారతదేశపు సొంత మ్యాపింగ్ సర్వీస్ MapmyIndia (Mappls) తన వినియోగదారుల కోసం ఒక భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం వ్యక్తిగత వాహనాల నావిగేషన్ కోసం ఎక్కువగా ఉపయోగపడే ఈ యాప్, ఇప్పుడు ‘పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్’ (ప్రజా రవాణా) రంగాన్ని కూడా తన గొడుగు కిందకు తెచ్చుకుంది. ఇకపై మెట్రో, బస్సులు , రైళ్ల సమాచారం కోసం వేర్వేరు యాప్‌లను వెతకాల్సిన అవసరం లేకుండా, అంతా ఒకే చోట లభించనుంది.
ఏమిటీ కొత్త ఫీచర్? : వినియోగదారులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి బస్సులు, మెట్రోలు , లోకల్ రైళ్ల రూట్లను ఈ యాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.
మల్టీమోడల్ రవాణా: ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లడానికి మీరు ఏ బస్సు ఎక్కాలి? ఎక్కడ మెట్రో మారాలి? ఏ ప్లాట్‌ఫారమ్ మీదకు రావాలి? వంటి పూర్తి వివరాలను మ్యాప్స్ అందిస్తుంది.
రియల్ టైమ్ డేటా: రైళ్లు లేదా బస్సులు ఏ సమయానికి వస్తాయి, ప్రయాణ సమయం ఎంత పడుతుంది అనే వివరాలను అత్యంత ఖచ్చితత్వంతో చూపిస్తుంది.
హైదరాబాద్‌తో పాటు 18 ప్రధాన నగరాల్లో సేవల ప్రారంభం
ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే 18 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. వాటిలో ముఖ్యమైనవి.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ & ముంబై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్, చండీగఢ్, జైపూర్, లక్నో, ఇండోర్, భోపాల్, పాట్నా వంటి నగరాలు ఉన్నాయి.
సొంత వాహనాల కంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రోత్సహించడమే ఈ అప్‌డేట్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం అని MapmyIndia సీఈఓ రోహన్ వర్మ తెలిపారు. దీనివల్ల ఎక్కువ మంది మెట్రో, బస్సులను వాడటం వల్ల రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గి ఉద్గారాలు తగ్గుతాయి. ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకోకుండా మెట్రో మార్గాలను ఎంచుకోవడం సులభమవుతుంది.
Mappls యాప్‌లో ఇప్పటికే కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి, ఇవి గూగుల్ మ్యాప్స్‌లో కూడా లభించవు..3D జంక్షన్ వ్యూ.. క్లిష్టమైన ఫ్లైఓవర్లు, జంక్షన్ల వద్ద ఏ వైపు వెళ్లాలో 3D రూపంలో చూపిస్తుంది.
రోడ్డుపై ఉండే స్పీడ్ బ్రేకర్లు లేదా ప్రమాదకరమైన మలుపుల గురించి ముందే హెచ్చరిస్తుంది. మహిళలు లేదా ఒంటరి ప్రయాణికులు తమ లైవ్ లొకేషన్‌ను కుటుంబ సభ్యులతో పంచుకునే సౌకర్యం ఉంది.
ప్రస్తుతానికి ఈ అప్‌డేట్ iOS (iPhone) , Web వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. మీ ఫోన్‌లోని యాప్ స్టోర్ నుండి ‘Mappls’ యాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఈ కొత్త ఫీచర్లను పొందవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అతి త్వరలోనే ఈ అప్‌డేట్ రానుంది.
“మేక్ ఇన్ ఇండియా” స్ఫూర్తితో రూపొందిన ఈ యాప్, టెక్నాలజీ పరంగా గ్లోబల్ జెయింట్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. మీరు కూడా మెట్రో లేదా బస్సులో ప్రయాణించే వారైతే, ఒకసారి ఈ స్వదేశీ యాప్‌ను ట్రై చేయండి.!