iPhone 15: ఆపిల్ ఐఫోన్ల లవర్స్ ఎప్పటి నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. మంగళవారం రోజున ఆపిల్ తన ప్రతిష్టాత్మక ఐఫోన్ 15ని ‘వండర్‌లస్ట్’ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఐఫోన్ లవర్స్ దీన్ని కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ తర్వాత దాని క్రితం మోడళ్లు అన్నీ కూడా భారత మార్కెట్ నుంచి కనుమరుగు కానున్నాయి. మార్కెట్ లో ఐఫోన్ 15కి మరింత స్పేస్ ఇచ్చేందుకు ఆపిల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపిల్ సరికొత్తగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐ ఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 మ్యాక్స్ వేరియంట్లను తీసుకువస్తోంది.
ఐఫోన్ 12, ఐఫోన్ 13 మిని, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ మోడళ్లను డిస్ కంటిన్యూ చేయనుంది. గతేడాది ఆపిల్ తన ఐఫోన్ 14 సిరీస్ ను ‘ఫార్ అవుట్’ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఈ ఫోన్‌కి చాలా పెద్ద మద్దతు లభించింది. ప్రస్తుతం ఐఫోన్ 14 మ్యాక్స్ టాప్ ఎండ్ మోడల్ ధర మార్కెట్ లో రూ. 1,39,900 ఉంది. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ తర్వాత ఆ సంస్థ వెబ్‌సైట్ నుంచి దీని క్రితం మోడళ్లు ఇక కనిపించబోవు.
Read Also: China: తైవాన్ ని చుట్టుముడుతున్న చైనా.. 24 గంటల్లో 22 యుద్ధవిమానాలు, 20 యుద్ధనౌకలు
అయితే కేవలం ఐఫోన్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేసే వారికి మాత్రమే ఐఫోన్ 14, ఐఫోన్ 13 మిని లాంటి మోడళ్లు అందుబాటులో ఉండవు. కానీ థర్డ్-పార్టీ రిటైలర్‌లు, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సైట్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 రాకతో ఐఫోన్ 14 సిరీస్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా రిటైలర్ షాపుల్లో, ఈకామర్స్ సైట్లలో మిగిలిన ఉన్న స్టాక్ ను అమ్మేసుకునేందుకు తక్కువ ధర, ఆఫర్లను ప్రకటించనున్నాయి.
ఇండియాలో ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900 కాగా ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900గా ఉంది. ఐఫోన్ 15 ప్రో ధర ప్రారంభ ధర రూ. 1,34,900, iPhone 15 Pro Max ప్రారంభ ధర రూ. 1,59,900గా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఫ్రీ ఆర్డర్ల కోసం సిద్ధంగా ఉన్నాయి. వీటి అమ్మకాలు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతాయి.