ప్రపంచ కుభేరుడు, టెస్లా అధినేత అయిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న తర్వాత వరుసగా కీలక నిర్ణయాలతో దూకుడు చూపిస్తున్నారు.. ట్విట్టర్ బాస్ రోజుకో ట్విస్టున్నాడు. కఠిన నిర్ణయాలతో దూకుడు పెంచిన ఎలాన్ మస్క్.. ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే వెరిఫైడ్ వినియోగదారులకు మాత్రమే నెలకు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించిన మస్క్… ఇప్పుడు ట్విట్టర్ యూజర్లందరికి ఛార్జ్ వసూలు చేయాలని భావిస్తున్నాడు. ఇందుకు సంబంధించి సంస్థ కీలక ఉద్యోగులతో మస్క్ చర్చించినట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకున్న తర్వాత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉద్యోగుల సంఖ్యను దాదాపు 50శాతానికి తగ్గించారు. వెరిఫైడ్ యూజర్లకు నెలకు 8 అమెరికన్ డాలర్లు వసూలు చేసేందుకు అడుగులు ముందుకు వేశారు. ఇప్పుడు అందరి నుంచి ఫీజు వసూలు చేయాలన్న మస్క్ నిర్ణయం.. ట్విటర్ యూజర్లందరిపైనా తీవ్ర ప్రభావం చూపించనుంది.
Read Also: Most Polluted Cities: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కాలుష్య నగరాలు ఇవే.. టాప్‌లో వైజాగ్..
నెలలో కొన్ని రోజులు ఉచితంగా సర్వీసు అందించి… ఆ తర్వాత వినియోగానికి ఫీజు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై ఏక్షణంలోనైనా మస్క్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. అయితే కొత్త సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ అభివృద్ధి కోసం ఎలాన్ మస్క్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఓ కొలిక్కి వచ్చేంత వరకు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ అంశంపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోకపోవచ్చు అనే చర్చ కూడా సాగుతోంది.. అయితే మస్క్ బుర్రకు తట్టిందంటే.. దానిని విడిచిపెట్టడని.. ఇప్పటికే బ్లూటిక్ వెరిఫైడ్ అకౌంట్ కోసం యూజర్ల నుంచి చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించిన ఆయన.. త్వరలోనే ట్విట్టర్ యూజర్లు అందరి నుంచి కూడా డబ్బులు వసూలు చేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు.. అయితే, మస్క్ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా చాలా విమర్శలు రాగా.. ఆయన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.. ఎలాన్ మస్క్ చేతికి పాపులర్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‍ఫామ్ వచ్చిన తర్వాత అందులో మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. సీఈవో పరాగ్ అగర్వాల్ ఉద్వాసన నుంచి కంపెనీలో 50శాతం మంది ఉద్యోగులను తొలగించడం వరకు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు మస్క్. వెరిఫైడ్ అకౌంట్లకు ఉండే బ్లూటిక్ కోసం యూజర్ల నుంచి చార్జీలను వసూలు చేయాలన్న నిర్ణయం అందులో కీలకమైనదిగా ఉంది.
అయితే, ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు రావడంపై స్పందించిన మస్క్.. “రోజంతా నన్ను తిట్టండి. కానీ, దానికి మాత్రం కచ్చితంగా 8డాలర్లు ఖర్చవుతుంది” అంటూ ఓ ట్వీట్ చేశాడు.. అంటే ఎందరు, ఎంత విమర్శించినా తన నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని కుండ బద్దలు కొట్టేసిన ఎలాన్ మస్క్.. ఇప్పుడు ఎవ్వరినీ వదలకుండా ట్విట్టర్ యూజర్లు అందరినీ నుంచి డబ్బులు వసూలు చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది.. మరి ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన చేస్తారు? నెలకు ఎంత మేర వసూలు చేసే అవకాశం ఉంది..? అనే విషయాలపై మస్క్ చెబితే తప్ప క్లారిటీ రాదు.