OpenAI: చాట్‌జీపీటీని ఉచితంగా ఉపయోగిస్తున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. త్వరలో చాట్‌జీపీటీలో యాడ్స్ ప్రత్యేక్షం కానున్నాయి. ఈ విషయాన్ని ఓపెన్‌ఏఐ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ప్రకటనలు ప్రారంభం కాలేదని, వచ్చే కొన్ని వారాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు చేపడతామని సంస్థ తెలిపింది. వినియోగదారుల నుంచి ఆదాయం పొందేందుకు ఇది మరో ప్రయత్నంగా భావిస్తున్నారు. ప్రస్తుతం చాట్‌జీపీటీకి 80 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఉచితంగానే సేవలను వినియోగిస్తున్నారు. కంపెనీ విలువ 500 బిలియన్ డాలర్లకు చేరినా, ఖర్చులు ఎక్కువగా ఉండటంతో లాభాలు ఆర్జించలేకపోతోంది. అందుకే కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
READ MORE: PM Modi: ఎన్నికల ముంగిట నేడు బెంగాల్‌కు మోడీ.. వందే భారత్ స్లీపర్‌ను ప్రారంభించనున్న ప్రధాని
ఇక నుంచి చాట్‌జీపీటీ సమాధానాలు ఇచ్చే ముందు ప్రకటనలు ప్రత్యేక్షమవుతాయని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది. ఈ అంశంపై కంపెనీ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో మాట్లాడుతూ.. యూజర్లకు వచ్చే సమాధానాలు యథాతథంగానే ఉంటాయని చెప్పారు. ఎవరైనా అడిగే ప్రశ్నలకు అనుగుణంగా వారికి కావాల్సిన ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించిన ప్రకటనలు చూయిస్తామని.. అది కూడా చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానాల కింది భాగంలో యాడ్స్ వస్తాయన్నారు. కాగా.. డిజిటల్ ప్రకటనల రంగంలో ఇప్పటికే గూగుల్, మెటా వంటి సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. తమ ఏఐ సేవల్లో ఇప్పటికే ప్రకటనలను భాగంగా చేసుకున్నాయి. మొదట ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏఐని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఓపెన్‌ఏఐ, గత ఏడాది తన వ్యాపార నిర్మాణాన్ని మార్చుకుని పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్‌గా మారింది. అయితే ఈ నిర్ణయంపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత అవసరాలు, సలహాల కోసం చాట్‌బాట్‌లను ఉపయోగించే వినియోగదారుల నమ్మకాన్ని ప్రకటనల కోసం వాడుకోవడం ప్రమాదకర మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలు గతంలో ఇదే దారిలో వెళ్లాయని, దాని ప్రభావాలు అందరికీ తెలిసినవేనని వారు అంటున్నారు.