CERT-In Warning Tata Motors Apps: టాటా కార్ల వినియోగదారులకు ప్రభుత్వ సంస్థ నుంచి అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ అయింది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌కు చెందిన కనెక్టెడ్ వెహికల్ యాప్స్‌లో (Connected Vehicle Apps) తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గుర్తించింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు సులభంగా కార్లను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. టాటా కార్లలోని ‘iRA 2.0’, ‘iRA.ev’ కనెక్టెడ్ యాప్స్‌లోనే ఈ టెక్నికల్ లోపాలు బయటపడ్డాయి. పెట్రోల్, డీజిల్ కార్ల కోసం iRA 2.0 యాప్‌ను, ఎలక్ట్రిక్ కార్ల కోసం iRA.ev యాప్‌ను వినియోగిస్తున్నారు. iRA 2.0 విషయంలో వెర్షన్ 26.73, అలాగే iRA.ev విషయంలో వెర్షన్ 26.72, వాటికంటే దిగువ వెర్షన్లలో ఈ సెక్యూరిటీ లొసుగులు ఉన్నట్లు సర్ట్-ఇన్ వెల్లడించింది. దీనికి సంబంధించి అత్యున్నత స్థాయి హెచ్చరికలు జారీ చేసింది.
ఈ యాప్స్ స్మార్ట్‌ఫోన్‌ను ఒక రిమోట్‌లా మార్చేసి కారును పూర్తిగా నియంత్రించడానికి సహకరిస్తాయట. ఈ అప్లికేషన్ల ద్వారా యూజర్లు తమ కారు లైవ్ లొకేషన్ ట్రాక్ చేయడం, వెహికల్ హెల్త్ చెక్ చేయడం, ట్రిప్ వివరాలు చూసుకోవడం, ఫ్యూయల్ లేదా బ్యాటరీ స్టేటస్ తెలుసుకోవడం వంటి పనులు చేస్తుంటారు. అంతేకాదు, ఫోన్ నుంచే రిమోట్ కమాండ్స్ ఇచ్చి కారు డోర్లు లాక్ చేయడం లాంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. కానీ, ఈ యాప్స్‌లోని లోపాల కారణంగా హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత వివరాలు, సెన్సిటివ్ డేటాను తస్కరించే అవకాశం ఉందట. అంతేకాకుండా అప్లికేషన్ డేటాను తమకు అనుగుణంగా మార్చేయడం, కారుకు సంబంధించిన ముఖ్యమైన సర్వీసులు, క్రెడెన్షియల్స్ యాక్సెస్ చేయడం లాంటి సైబర్ దాడులకు పాల్పడవచ్చట. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే యూజర్లు వెంటనే తమ కారు యాప్స్‌ను, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం కనెక్టెడ్ కార్ల హ్యాకింగ్ ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. కొద్దికాలం క్రితం యూరప్‌లో ఒక సూపర్ మార్కెట్‌కు సంబంధించిన ఫ్రిజ్‌లను హ్యాక్ చేసి ఉద్దేశపూర్వకంగా ఉష్ణోగ్రత పెంచేయడంతో అందులోని సరుకంతా పాడైపోయిన ఘటన కలకలం రేపింది. ఆటోమొబైల్ రంగంలోనూ ఇలాంటి భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు, 2016లో దాదాపు 10 కోట్ల వోక్స్వ్యాగన్ కార్లను రిమోట్ ద్వారా అన్‌లాక్ చేయవచ్చని పరిశోధకులు వెల్లడించడం గమనార్హం. అందుకే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాహనాల సైబర్ సెక్యూరిటీపై మరింత అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం.

