Bank of Baroda Data Leak: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు సంబంధించిన భారీ డేటా లీక్ జరిగినట్లు సోషల్ మీడియాలో, పలు సైబర్ సెక్యూరిటీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బ్యాంకుకు చెందిన సుమారు 1TB డేటా ఇంటర్నెట్, డార్క్ వెబ్‌లోకి లీక్ అయిందని ఆరోపణలు వెలువడటం కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పలు నివేదికల ప్రకారం.. బ్యాంక్ సర్వర్లను హ్యాక్ చేసినట్లు చెప్పుకుంటున్న ఓ సైబర్ మోసగాడు భారీ మొత్తంలో డేటాను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే అతడి వాదనలు నిజమేనా? లీక్ అయిందని చెబుతున్న డేటా అసలుదా? అనే విషయాలు ఇప్పటికీ అధికారికంగా నిర్ధారణ కాలేదు.
లీకైన డేటాలో కస్టమర్ల వ్యక్తిగత వివరాలు, మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, ఆధార్ నంబర్లు, బ్యాంక్ ఖాతా సమాచారం, నెట్ బ్యాంకింగ్ రికార్డులు, రుణాలకు సంబంధించిన పత్రాలు, కార్పొరేట్ బ్యాంకింగ్ డేటాతో పాటు కొన్ని అంతర్గత ఫైళ్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, ఆరోపిత హ్యాకర్ కొంత డేటాకు సంబంధించిన నమూనాలు, డౌన్‌లోడ్ లింకులను కూడా పంచుకున్నట్లు సమాచారం. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, హ్యాకర్‌గా చెప్పుకుంటున్న వ్యక్తి లీక్ అయిన డేటా లీక్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను “శ్రీకాంత్” అనే పేరుతో ఉన్న X (ట్విటర్) ఖాతా నుంచి పోస్టు చేశాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా డంప్ తన వద్ద ఉందని పేర్కొంటూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సహా పలువురు అధికారులను ట్యాగ్ చేశాడు. ఈ ఆరోపణలు నిజమని తేలితే, సైబర్ నేరగాళ్లు ఫిషింగ్, నకిలీ బ్యాంక్ కాల్స్, కేవైసీ అప్‌డేట్ పేరుతో మోసాలు, గుర్తింపు దొంగతనం వంటి సైబర్ నేరాలకు ఈ సమాచారాన్ని ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే డేటా లీక్ జరిగిందనే కారణంతోనే ఖాతాదారులు తమ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు ఆటోమేటిక్‌గా మాయమవుతుందని భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కానీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంక్ అధికారులమంటూ వచ్చే కాల్స్, అనుమానాస్పద లింకులు, OTP లేదా UPI PIN కోరే వ్యక్తుల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం అని హెచ్చరిస్తున్నారు. ఈ డేటా లీక్‌పై ఇప్పటివరకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్, మీడియా విడుదలల్లో కూడా దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. కాబట్టి ప్రస్తుతం ఈ వ్యవహారం ఆరోపణల దశలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను మార్చడం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA)ను ఎనేబుల్ చేయడం, ఖాతా లావాదేవీలను తరచూ పరిశీలించడం మంచిదని చెబుతున్నారు. అలాగే అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వడంతో పాటు 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం 1TB డేటా లీక్ జరిగిందనే ప్రచారం ఉన్నప్పటికీ, అది అధికారికంగా ధృవీకరించబడలేదు. బ్యాంక్, సంబంధిత సైబర్ సెక్యూరిటీ సంస్థలు లేదా ప్రభుత్వ దర్యాప్తు సంస్థల విచారణ అనంతరం మాత్రమే ఈ ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Root folder of the data dump of @bankofbaroda #Databreach by threat actor. More verification links in the thread. The link is live.
This is SOS @Cyberdost @RBI
cc @latha_venkatesh @dugalira @nit_set @suchetadalal https://t.co/6HZ2c6V6S5 pic.twitter.com/tWFCKJWv8Q
— Srikanth.CashlessConsumer | ஸ்ரீகாந்த் (@logic) July 26, 2026

