ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!

  • అది కేవలం గిఫ్ట్ కాదు..
  • చావు అంచుల్లో ఉన్న తండ్రిని కాపాడిన ఆపిల్ వాచ్
Apple Watch

Apple Watch

Apple Watch: టెక్నాలజీ ప్రాణాలను కాపాడగలదని నిరూపించిన ఘటన ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. కూతురు బహుమతిగా ఇచ్చిన Apple Watch మరణం అంచున ఉన్న ఓ తండ్రి ప్రాణాలను కాపాడింది. వాచ్‌లోని ఫాల్ డిటెక్షన్ (Fall Detection) ఫీచర్ సమయానికి స్పందించి ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం అందించడంతో అతడికి వెంటనే వైద్యం అందింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, సిన్సినాటికి చెందిన మొహమ్మద్ ఇస్లాం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట చెత్త వేయడానికి వెళ్లిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చినప్పటికీ లేవడానికి కూడా శక్తి లేక నేలపైనే పడిపోయారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ” ఆ సమయంలో లేవాలని ప్రయత్నించాను.. కానీ కాలేదు. కొద్దిసేపటికే బయట అంబులెన్స్ సైరన్ వినిపించింది” అని ఆయన స్థానిక మీడియాకు తెలిపారు. వాస్తవానికి, ఇస్లాం స్పృహ కోల్పోయిన వెంటనే ఆయన పెట్టుకున్న Apple Watch ఫాల్ డిటెక్షన్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసింది. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వాచ్ ఆటోమెటిక్‌గా ఎమర్జెన్సీ సేవలకు కాల్ చేయడంతో పాటు, ఎమర్జెన్సీ కాంటాక్టులకు కూడా సమాచారం పంపింది. దీంతో పారామెడిక్స్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆయనను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనకు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్లు (Blood Clots in the Lungs) గుర్తించారు. సరైన సమయంలో ఆస్పత్రికి చేరుకోవడంతోనే ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనకు ముందు నుంచే తనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు సమస్యలు, నడవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపించాయని, అయితే అసలు కారణం మాత్రం తెలియలేదని ఇస్లాం చెప్పినట్లు వెల్లడించింది. ఇక తన కూతురు ప్రేమతో గిఫ్ట్‌గా ఇచ్చిన Apple Watch తన ప్రాణాలను కాపాడిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన కుమార్తె కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తాను ఇచ్చిన గిఫ్ట్ తండ్రి ప్రాణాలను కాపాడిందని తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటనతో స్మార్ట్‌వాచ్‌లలో ఉండే భద్రతా ఫీచర్లు అత్యవసర పరిస్థితుల్లో ఎంత కీలక పాత్ర పోషించగలవో మరోసారి స్పష్టమైంది.