హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 జరుగుతోంది. ఈ ఫుట్ బాల్ టోర్నమెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో ఇండియా, మారిషస్, సిరియా దేశాలు పాల్గొంటున్నాయి.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడు షేక్ ముగ్దమ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద పోటెత్తడంతో కందకుర్తి వద్ద అంతరాష్ట్ర బ్రిడ్జికి ఆనుకుని గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు రుణమాఫీ చేశామని.. 22 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇంకా మరి కొంతమంది రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సంతోష సమయంలో వరదల రూపంలో ఉపద్రవం వచ్చి పడిందని ఆయన పేర్కొన్నారు.
రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి రాజీనామా చేశారు. గత పదేళ్లుగా ఆర్ అండ్ బీ ఈఎన్సీగా పని చేసిన గణపతి రెడ్డి.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు తెలిపారు.
వరద ప్రమాద ప్రాంతాలు, ప్రమాదానికి కారణాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై బ్లూబుక్ను తయారు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వాటిని కలెక్టరేట్లలో ఉంచాలన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఖమ్మంలోని బీకే నగర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హరీష్ రావు పర్యటన సందర్భంగా బీకే నగర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ నేతల కార్లు ధ్వంసమయ్యాయి.