మిచౌంగ్ తీవ్ర తుఫాన్‌తో ఉప్పెన ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. మీటర్ అంతకు మించిన ఎత్తున సముద్రపు అలలు విరుచుకుపడి.. ఐదు కిలోమీటర్ల ముందుకు సముద్రపు నీరు చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నెల్లూరుకు 170కి.మీ దూరంలో కొనసాగుతున్న మిచౌంగ్.. రేపు ఉదయం బాపట్ల-దివిసీమ మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది.
టీడీపీ కార్యకర్తలు, నేతలు తుఫాను బాధితులకు అండగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. పలు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. టీడీపీ శ్రేణులు బాధిత వర్గాలకు అండగా ఉండాలి.. చేతనైన సాయం చేయాలన్నారు.
తుఫాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌గా పరిస్థితిని సీఎం జగన్ సమీక్షిస్తున్నారు.
దక్షిణ కోస్తాపై మిచౌంగ్ తీవ్ర తుఫాన్ దూసుకు వస్తోంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. రేపు మధ్యాహ్నం కంటే ముందు తీవ్ర తుఫానుగానే తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రేపటికి తుఫాన్‌గా మారనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.