అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటివరకు 14 మంది మృతి చెందినట్లు తెలిసింది. మరో 25 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు.