లిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటుకు, మీవారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతికోసం వేసిన స్కెచ్ కాదా అంటూ అడిగారు
నూతన ఎక్సైజ్ పాలసీ 2024ని అత్యంత పారదర్శకంగా అమలు చేసిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కానూరులోని ఏపీఎండీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా పూర్తి పారదర్శకంగా పాలసీని అమలు చేసి చూపించామన్నారు. అత్యంత పకడ్బందీగా షాపుల కేటాయింపు జరిగిందన్న ఆయన.. గత ప్రభుత్వం ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో చేసిన దుర్మార్గాలకు, స్కాములకు నేటితో తెరదించామన్నారు.
ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు ప్రశాంతంగా ముగిసింది. లాటరీ విధానం ద్వారా దరఖాస్తుదారులకు షాపుల కేటాయింపు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3396 దుకాణాల లాటరీ ద్వారా కేటాయింపు మొత్తం 89, 882 దరఖాస్తులు రాగా.. లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
ఉదయం నుంచి నిరాటంకంగా జరిగి లాటరీ విధానాన్ని మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి అయింది. కాగా లాటరీ కొందరి పంట పండింది. వేసిన లాటరీల్లో చాలా మందికి షాపులు రాగా.. వారు ప్రస్తుతం నగదు సమీకరణ పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. మద్యం దుకాణాల లాటరీలో బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పంట పండింది. ఆయన ఏకంగా ఐదు దుకాణాలను దక్కించుకున్నారు.