ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరంగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోంది. పరస్పర రాజకీయ ఆరోపణలు విషయాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. సాగు, తాగునీటి, విద్యుత్ ఉత్పత్తి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును డిజైన్ చేసినా.. అనుకోని విధంగా జరుగుతున్న ఆలస్యంతో.. ఎప్పటికప్పుడు కథ మొదటికి వస్తోంది.
పోలవరం ప్రాజెక్టుకు ఏపీకి వరం అనడంలో రెండో మాట లేదు. కానీ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నకు మాత్రం సమాధానాలు మారుతున్నాయి. ఇప్పటికీ చాలాసార్లు గడువులు మారాయి కానీ.. ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. ప్రాజెక్టు పూర్తై.. తమకు నీళ్లెప్పుడొస్తాయా అని లక్షలాది మంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టును 2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అప్పటికే 2013లో భూసేకరణ చట్టాన్ని సవరించి ఉండటంతో ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరిగిపోయింది. 2013-14లో అంచనా వ్యయం 20 వేల 398.61 కోట్లుగా ఉంటే.. 2017-18కి వచ్చే సరికి 55వేల 548.87కోట్లకు చేరుకుంది. 2016లో కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమో ప్రకారం 20వేల 398 కోట్లకే తమకు సంబంధమని చెప్పింది మోడీ సర్కార్. పైగా ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 2 వేల 234 కోట్లు రియంబర్స్ చేస్తే.. మరో 4వేల 13.65 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని కేంద్రం తెలిపింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 55 వేల 548.87 కోట్ల అంచనాలతో పనులు చేస్తోంది ఏపీ సర్కార్. వీటిల్లో భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు 33 వేల 198.23 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రం ఈ మధ్యకీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో కూడా కేంద్రం చెప్పింది. 2024 జులై నాటికే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి సాధ్యమని పార్లమెంటుకు తెలిపింది కేంద్రం.
పోలవరం స్పిల్ వే లో అమర్చిన 48 రేడియల్ గేట్ల ద్వారా 50 లక్షల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేసేలా డిజైన్ చేశారు. చైనాలోని త్రిగార్జెస్ డ్యాం 41 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసేవిధంగా ఉంటే..పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కులకు డిజైన్‌ను రూపొందించారు. గత వందేళ్ల చరిత్రను ఆధారంగా చేసుకుని పోలవరం స్పిల్ వేను, గేట్లను డిజైన్ చేశారు నిపుణులు. వందేళ్ళలో గోదావరికి 40లక్షలకుపైగా క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని చెబుతున్నారు. అందుకే మొదట్లో 36 లక్షల క్యూసెక్కుల డిశ్చారజ్ కెపాసిటీతో నిర్మించాలనుకున్న స్పిల్ వేను 50లక్షల క్యూసెక్కులకు పెంచేశారు. ప్రాజెక్టులోని ఒక్కో రేడియల్ గేటు 16మీటర్ల వెడల్పు, 20మీటర్ల పొడవు, 300 మెట్రిక్ టన్నుల బరువుతో రోజుకు 432 టిఎంసిలు వరద నీటిని దిగువకు విడుదల చేసే సామర్ద్యం తో పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్నా.. పోలవరం ప్రాజెక్టు అథార్టీ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నా.. కేంద్రం నుంచి అనుకున్నట్టుగా , కావల్సినంత వేగంగా నిధులు విడుదల కావడం లేదనే వాదన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు నిధులు ఖర్చు చేస్తేనే.. కేంద్రం తర్వాత ఆ డబ్బు రీయింబర్స్ చేస్తోంది. ఇది ప్రధాన అవరోధంగా మారింది. అయితే తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్రం కౌంటర్ ఇస్తోంది. పరస్పర విమర్శలతో పుణ్యకాలం పూర్తౌతుంది కానీ.. ప్రాజెక్టు పనులు మాత్రం అనుకున్నంతగా ముందుకు కదలడం లేదు. ప్రాజెక్టు ఆలస్యం అయ్యే కొద్దీ అంచనా వ్యయం పెరుగుతుందని తెలిసినా.. జాప్యం తప్పడం లేదు. దీనికి తోడు రాజకీయ కారణాలు, వరదలు, ముంపు సమస్య, కోర్టు కేసులు.. ఇలా ఏదో ఒక అంశం తెరపైకి వస్తూనే ఉంది.
పోలవరం ప్రాజెక్టు, ఏలూరు జిల్లా , పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొదట్లో, రామపాద సాగర్ గా పిలువబడిన ఈ పథకాన్ని, ప్రస్తుతం పోలవరం సాగునీటి ప్రాజెక్టు అని పేరుతో వ్యవహరిస్తున్నారు. పోలవరం జలాశయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో బాటు, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల లోకి కూడా విస్తరించి ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక, విశాఖ మహానగరం తాగునీటి అవసరాలు, విశాఖపట్నం చుట్టుపక్కలనున్న తీరప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు తీరతాయని అంచనా. విద్యుదుత్పత్తి, జలరవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి, చేపల పెంపకానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది.పోలవరం పూర్తైతే 86 టీఎంసీలు కృష్ణా నీళ్లు ఆదా అవుతాయి. ఆ నీటిని ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వినియోగించుకునేందుక వీలుగా ఎప్పుడో వాటాలు వేశారు. పోలవరం కుడి కాల్వ నుంచి కృష్ణా బ్యారేజ్ కు వచ్చే నీటిని కృష్ణా డెల్టాకు వాడుకుంటారు. అక్కడ 80 టీఎంసీల నీళ్లు. దానితో రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలు తీర్చవచ్చు. ఏదైనా ప్రాజెక్టు కడితే.. దాని దిగువన ఉండే ప్రాంతాలకు లబ్ది కలుగుతుంది. పోలవరం అలా కాదు. దాని పరీవాహక ప్రాంతంలో లేని చోట్లకు కూడా పరోక్షంగా అది ఉపయోగపడుతుంది. అదే ఈ ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన విషయం. పోలవరంతో కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలు, ఉభయగోదావరిలో 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారితమైంది. దేశంలో సగటు సాగుభూమి శాతం 22.2%, ఉత్తరప్రదేశ్ సాగుభూమి శాతం 22%, పంజాబ్ సాగుభూమి శాతం 35% తో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ సాగుభూమి శాతం 14% చాలా తక్కువ. కాలువలద్వారా నీటిలభ్యత ఉన్న కృష్ణా-గోదావరి డెల్టాలలో 22 లక్షల ఎకరాలలోనూ, నాగార్జునసాగర్ ద్వారా నీటి లభ్యత ఉన్న నల్లగొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని 20 లక్షలలో మాత్రమే సాగు జరుగుతుంది. గోదావరికి ఎడమవైపునున్న తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలలోని మెట్టప్రాంతాలు, కుడివైపునున్న పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు గోదావరి తప్ప మరో నమ్మకమైన నీటివనరు లేదు. వర్షాలు సరిగా కురవని సమయాలలో ఈ ప్రాంతాలు కరువుకి గురవుతూ ఉన్నాయి. ఈ ప్రాంతాలలో ప్రవహించే ఏర్లు, నదులు పూర్తిగా వర్షాధారాలు అయినందున ఆధారపడదగినవి కావు. అందువలన ఈ ప్రాంతాలలో సాగుని ఆధారపడదగిన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా పరిరక్షించాల్సి ఉంది. పోలవరం పథకం వలన మాత్రమే ఈ అనిశ్చిత పరిస్థితులు, ఈ ప్రాంతాల వెనుకబాటుతనం పోగలవు.
పోలవరాన్ని అంధ్రప్రదేశ్ కు జీవధారగా చెబుతారు. సర్ ఆర్థర్ కాటన్ భారతదేశపు నదుల అనుసంధానం గురించి ప్రాథమిక సూచనలు చేసినప్పటికీ, 1930-40 ల వరకూ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. 1941 లో, మద్రాసు రాష్ట్ర ప్రధాన ఇంజనీరు, దివాన్ బహుద్దూర్ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్, గోదావరి నది పైన పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించాడు. 1946-47లో ప్రఖ్యాత ఇంజనీరు కె.ఎల్ . రావు ఇచ్చిన నివేదికలో భద్రాద్రి రాముని పేరున రామపాద సాగరంగా పిలిచారు. అప్పటి డిజైన్ ప్రకారం.. 1300 మీ ల గరిష్ఠ ఎత్తు ఉన్న ఆనకట్ట, ఎడమ వైపు, విశాఖపట్నం ఓడరేవు వరకూ, 209 కి.మీల పొడవైన కాలువ. కుడి వైపు, కృష్ణా నది వపకూ 200 కి.మీ ల పొడవైన కాలువ. అటుపైన, గుండ్లకమ్మ నది వరకూ మరో 143 కి.మీ పొడవైన కాలువ,, 150 మెగా వాట్ల సామర్థ్యం గల విద్యుతుత్పత్తి కేంద్రం ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.
పోలవరం పనులు 2004లో ప్రారంభమయ్యాయి. 2015లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. 2017 జూన్ నాటికి రిజర్వాయర్ లో మట్టిపని 68%, కుడికాలవ పనిలో మట్టిపని 100%, లైనింగ్ 81%, ఎడమకాలవ పనిలో మట్టిపని 87%, లైనింగ్ 62% పూర్తయ్యాయి2021 మే నెల నాటికి 42.5 మీటర్ల ఎత్తులో ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేశారు.
పోలవరం పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది, అప్పటివరకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్రం ప్రభుత్వం సొంత నిధులతో పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలు చేపట్టింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం మండలంలోని పట్టిసం వద్ద పోలవరం కుడికాలవకు నీరు తరలించడానికి నిర్మించారు. 2015లో దీని నిర్మాణం రూ. 1299 కోట్లు ఖర్చుతో పూర్తయింది. రూ.1,638 కోట్ల అంచనా వ్యయంతో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం 2017 ఆగస్టులో తొలి విడత పూర్తి అయింది. దీని ద్వారా ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలించారు.
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి మీరంటే మీరే కారణమని అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
2019-2020లో ఎవరూ ఊహించని విధంగా వరద గోదావరికి పోటెత్తింది. ఈ వరద డయాఫ్రమ్ వాల్ నుంచి సెకనుకు మూడు మీటర్లు ప్రవహిస్తుందని భావించినా సెకనుకు 13 మీటర్ల వరద తాకిడి డయాఫ్రమ్ వాల్‌ను దాటుకుంటూ వెళ్లింది. దీంతో వాల్ కింది భాగంలో కోత ఏర్పడి డయాఫ్రమ్ వాల్ కుంగిపోయింది. కొన్నిచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. డయాఫ్రమ్ వాల్ పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మాణం చేపట్టాలా లేక మరమత్తులు చేస్తే సరిపోతుందా అనే అంశాలను పరిశీలించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు కమిటీ సభ్యులు.
ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పూర్తి కావాలంటే గోదావరికి అడ్డంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించాలి. దాన్ని నిర్మించాలంటే పునాదిగా ఉండే కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తిచేయాలి. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కు ముందు పునాదిగా వేసేదే డయాఫ్రమ్ వాల్. అద దెబ్బతింటే.. రిజర్వాయర్లో ఒక్క చుక్క నీరు రాదు. అదే ఇప్పుడు పొలిటికల్ ఫైట్ కు కారణమైంది.
తాము అధికారంలో ఉండి ఉంటే నష్టం జరిగేది కాదనేది టీడీపీ వాదనైతే… పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి టీడీపీ ప్రభుత్వం స్పిల్ వే ఛానల్ నిర్మాణంపై దృష్టి సారించకపోవడమే డయాప్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణమన్నది వైసీపీ ప్రభుత్వ వాదన. మరోపక్క జాతీయ ప్రాజెక్ట్ కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన నిర్వాసితులను నట్టేట ముంచేస్తున్నారన్న వాదన వినిసిస్తోంది. ఇప్పటి వరకు నిర్వాసితుల్లో 4 శాతం మందికి మాత్రమే పరిహారం.. పునరావాసం కల్పించినట్టు నివేదికలు చెప్తున్నాయి.
పోలవరం ప్రాజెక్టులో 1,06,006 మంది నిర్వాసితులకు గాను… 41.15 మీటర్ల కాంటూర్‌కు పరిధి వరకు.. 20,946 మంది నిర్వాసితులు వస్తారు. మిగిలిన 85,060 మంది నిర్వాసితులు 45.72 కాంటూర్ లెవల్ కిందకు వస్తారు. వీరిలో 41.15 కాంటూర్ లెవల్‌కు వచ్చే 14,110 నిర్వాసితులకు పునరావాసం పూర్తయింది. దీనికి అయిన ఖర్చు రూ.1960.95 కోట్లు. ఈ 14,110 మంది నిర్వాసితులలో 707 నిర్వాసితులకు 2014 కన్నా ముందే పునరావాసం కల్పించి.. రూ.44.77 కోట్లు ఖర్చు చేశారు. 2014-19 వరకు 3073 నిర్వాసితులకు పునరావాసం కోసం రూ.193 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 2019 నుంచి ఇప్పటివరకు 10,330 మంది నిర్వాసితుల కోసం రూ.1773 కోట్లు ఖర్చు చేశారు. పునరావాసపనులు 41.15 కాంటూర్ వరకు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబరు 2022 లోగా మిగిలిన 6836 నిర్వాసిత కుటుంబాలకు కూడా పునరావాసం పూర్తి చేయడానికి ప్రణాళిక ఉందంటోంది ఏపీ సర్కారు.
కాఫర్ డ్యాం అయిపోయింది. లోవర్ కాఫర్ డ్యాం 30.5 మీటర్లు ఎత్తు పెంచాల్సిన చోట.. వరద అనుకున్న దానికన్నా ఎక్కువగా రావడంతోపాటు, కేంద్రప్రభుత్వం ఇవ్వాల్సిన డిజైన్లు క్లియరెన్స్‌లో అనుకున్నదానికన్నా జాప్యం జరిగింది. దానివల్ల లోయర్ కాఫర్ డ్యాం అనుకున్న మేరకువేగంగా పని జరగలేదు. ఇది 30.5 మీటర్ల ఎత్తుకు కట్టాల్సి ఉండగా… 21 నుంచి 23 మీటర్ల ఎత్తువరకే కట్టగలిగారు. ఇక్కడ ఉన్న 680 మీటర్ల వెడల్పుతో ఒకటి, 120 మీటర్ల వెడల్పుతో మరొకటి ఇలా రెండు గ్యాప్‌లను కింద పునాదుల నుంచి వేసుకుని రావడం వల్ల ఆలస్యం అయింది. కొద్దిగా సమయం దొరికితే 30.5 మీటర్ల వరకు కూడా లోవర్ కాఫర్ డ్యాం పూర్తయ్యేది. వర్షాకాలంలో పనులు జరగని పరిస్థితి వచ్చింది. అక్టోబరులో వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే నవంబరులో పనులు మొదలవుతాయి. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు కూడా పూర్తి చేసేందుకు అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది.
2019కి ముందే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తైంది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం కోసం .. ఆ పనులకు వరద నీరు అడ్డం రాకుండా ఉండేందుకు డయాఫ్రమ్ వాల్ కు ఎగువన 2.1 కి.మీ పొడవున ఎగువ కాఫర్ డ్యామ్.. దిగువన మరో కాఫర్ డ్యామ్ నిర్మించాల్సి వచ్చింది. అయితే స్పిల్ వే పూర్తికాకపోవడం, తమకు పరిహారం కార్యరూపం దాల్చకుండానే.. కాఫర్ డ్యాంతో నదికి అడ్డుకట్ట వేస్తుండటంతో.. నిర్వాసితులు కోర్టుకు వెళ్లారు. వాళ్లకి పరిహారం ఇవ్వకుండా నీరు నిల్వ చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీంతో ఎగువ కాఫర్ డ్యామ్ కాఫర్ డ్యాంలో రెండు గ్యాపులు వదిలిపెట్టారు. ఎగువ కాఫర్ డ్యాంలో ఒకచోట 380 మీటర్ల గ్యాప్, మరోచోట 300 మీటర్ల గ్యాప్ వదిలిపెట్టారు. అంటే 2.1 కిలోమీటర్ల నుంచి పోవాల్సిన నీళ్లు ఈ రెండు గ్యాప్‌ల నుంచి పోయే పరిస్థితికి వచ్చేసరికి కోతకు గురైంది. దిగువ కాఫర్ డ్యాంలో ఒకవైపు 680 మీటర్లు, మరోవైపు 120 మీటర్ల గ్యాప్ వదిలారు. నీళ్లన్నీ ఈగ్యాప్‌ల నుంచి పోవాల్సిన పరిస్థితి. దీంతో కోత జరిగింది. ఇప్పుడు దాన్ని మరలా పునరుద్ధరించాల్సి వచ్చింది. డయాఫ్రమ్ కింద నుంచి కోతకు గురైంది. గుంతలు పడ్డాయి. దీంతో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఆగిపోయాయి. డయాఫ్రమ్ వాల్ సంగతి తేలితే కానీ పోలవరంలో కీలక ముందడుగు పడదు.
పోలవరం వద్ద 25 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుందని అంచనా వేసిన అధికారులు ముందుస్తు చర్యలు చేపట్టారు. ఎగువ కాఫర్ డ్యాం 28 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని తట్టుకునేలా నిర్మించారు. 30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి దిగువకు ప్రవహించే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలోపెట్టుకొని ఒక మీటరు మేర ఎగువ కాఫర్ డ్యాం పొడవునా 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచాలని నిర్ణయించారు. ఎగువ కాఫర్ డ్యాం ఎగువ భాగం మొత్తం 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ మొత్తం కాకుండా 2 మీటర్ల వెడల్పుతోనే ఎత్తు పెంచారు. నీరు ఎగువ కాఫర్ డ్యాం దాటి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పనులు చేశారు.
ప్రభుత్వం మార్కింగ్ వేసిన ప్రాంతాలను మించి వరద ప్రవాహం సాగడాన్ని చూస్తే తమకు ఏటా మూడు నెలలు వరద నీటిలో నానాల్సిన దుస్థితి తప్పకపోవచ్చని ముంపు ప్రాంతాల వాసులంటున్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర 41.5 అడుగుల వద్ద మొదటి కాంటూరుగా ప్రభుత్వం ప్రకటించింది. కాఫర్ డ్యామ్ వద్ద ఆ స్థాయిలో నీటిమట్టం ఉంటే ఎంత వరకూ ముంపు బారిన పడుతుందనే అంచనాలు వేసింది. దానికి తగ్గట్టుగా మార్కింగ్ వేసి పునరావాసం, పరిహారం తొలుత వారికి అందిస్తామని ప్రకటించింది. మొదటి కాంటూరు పరిధిలో ఉన్న వారికి ప్యాకేజీ అందించడమే ప్రధానమని చెప్పింది. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా ఉంది. పోలవరం బ్యాక్ వాటర్ తాకిడికి తొలుత ప్రభావితమయ్యే మండలాల్లో దేవీపట్నం కూడా ఒకటి. కానీ అక్కడ కూడా నిర్వాసితులకు పరిహారం పంపిణీ పూర్తికాలేదు. దాంతో భారీ వరద ప్రవాహంతో గ్రామాలకు గ్రామాలు గోదావరి వరద నీటిలో నానుతున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు కొండలపై తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాల్లో గడుపుతున్నారు.
పోలవరంపై ప్రభుత్వాలు చెబుతున్న దానికీ.. క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన కుదరడం లేదు. ఎప్పటికప్పుడు డెడ్ లైన్లు పెడుతున్న ప్రభుత్వాలు.. వాటిని అందుకోలకే చేతులెత్తేస్తున్నాయి. ఇప్పుడు కూడా 2024 జులై నాటికి పోలవరం పూర్తవుతుందని కేంద్రం చెప్పినా.. అనుమానాలైతే అలాగే ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని తేలితే.. అది నిర్మించడానికే రెండేళ్లు పడుతుందని నిపుణుల అంచనా. ఇక ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టడానికి మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే.. హెడ్ వర్క్స్ పనులు పూర్తైతే ప్రాజెక్టు అయిపోయినట్టు కాదు. బ్రాంచ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు, మేజర్, మైనర్ పంట కాలువల నిర్మాణం పూర్తైతేనే.. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఈ పనులన్నీ అనుకున్న గడువులోగా చేయాలంటే.. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాల్సి ఉంది.
పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేస్తే రాష్ట్రం మొత్తానికీ ఉపయోగం. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు ఆడుతున్న గేమ్.. ప్రజలకు జరగాల్సిన లబ్ధిని ఆలస్యం చేస్తోంది. పోలవరం ఏపీకి జీవనాడి కాబట్టి.. ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా పని జరాగలనే వాదన ఉంది.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 90లో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. జాతీయ ప్రాజెక్టుగా పగిరణించాలని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాలని. నిర్మాణం చేపట్టాలంటే ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించి, నిర్వాసితులకు అవసరమైన పునరావాస పనులు పూర్తి చేయాలి. కేంద్రం అందుకు భిన్నంగా రాష్ట్రం కోరిందన్న సాకుతో నిర్మాణ బాధ్యతల నుండి తప్పుకుంది. నిర్వాసితుల పునరావాస బాధ్యత తనది కాదంటోంది. అదే సమయంలో నిధుల విడుదల లోనూ పెద్దఎత్తున కోత పెట్టింది. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి 55,656 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఈ అంచనాలను 2017, 18 సంవత్సరాల్లోనే రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీలతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్ధపడటం లేదు. 2013-14 నాటి అంచనా 28,919 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేస్తామంటోంది. నిజానికి 2014 మే 29న జరిగిన క్యాబినెట్ సమావేశంలో భవిష్యత్‌లో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినా కేంద్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. 2017 మే 8న కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ప్రాజెక్టు వ్యయం మొత్తం కేంద్రమే భరిస్తుందని పేర్కొన్నారు. వీటి ప్రకారం చూసినా పెరిగిన మొత్తాన్ని కేంద్రమే భరించాలి. కానీ కేంద్రం వీటన్నింటిని తిరస్కరిస్తోంది.
ముంపు గ్రామాల లెక్కల్లోనూ గందరగోళం నెలకొంది. అధికారులు రూపొందించిన కాంటూరు లెక్కల ప్రకారం 45.72 మీటర్ల మేర ప్రాజెక్టులో నీటిని నిలువ చేస్తే ఉమ్మడి పశ్చిమగోదావరిలో 57 గ్రామాలు, ఉమ్మడి తూర్పుగోదావరిలో 165 గ్రామాలు కలిపి మొత్తం 222 పంచాయతీల్లోని 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ప్రస్తుతం 41.15 మీటర్ల మేర నీటిని నిలువ చేస్తే ముంపునకు గురయ్యే గ్రామాల వరకే పునరావాస పనులు చేపట్టారు. ఈ పనులు కూడా పూర్తి కాలేదు. ఇటీవల గోదావరికి వచ్చిన భారీ వరదలతో ఈ లెక్కలు తప్పుల తడకలని తేలింది 41.15 మీటర్ల (కాంటూరు) ఎత్తుకు చేరిన వరద నీరే మొత్తం 373 గ్రామాలను ముంచెత్తింది. మరికొన్ని అదనపు గ్రామాల్లోకి వరద ప్రవేశించింది. దీంతో పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్ల మేర నీటిని నిలువ చేస్తే పరిస్థితి ఏమిటన్నది ఆందోళనకరంగా మారింది. నిర్వాసితుల కోసం భూ సేకరణ, ఆర్‌ఆండ్ ఆర్ ప్యాకేజి, ఇళ్ల నిర్మాణం కోసం 33,470 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వ అంచనా!ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 5 శాతం మందికి కూడా పునరావాసం పూర్తి కాలేదు.
ముంపు ప్రాంతాలకు సంబంధించి పలు అభ్యంతరాలను, సందేహాలను లెవనెత్తుతూ ఒడిశా, ఛత్తీస్‌గడ్, తెలంగాణ రాష్ట్రాలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణ నిర్వహించిన సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆదేశించింది. ప్రభావిత రాష్ట్రాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని, అవసరమైతే ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోనూ సమావేశం నిర్వహించాలని సూచించింది. పునరావాస ప్యాకేజీ విషయంలో కేంద్రానికి లేఖలు రాయడం, ప్రధానికి విజ్ఞప్తులు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సరిపెడుతోంది. అన్ని పార్టీలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని, ఢిల్లీకి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకువెళ్లాలన్న డిమాండ్లను పట్టించుకోవడం లేదు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న సమస్యల్ని పరిష్కరించకుండానే.. కేంద్రం కొత్త డేట్ ప్రకటించింది. 2024 జులై నాటికి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం సాధ్యం అవుతుందని ఇటీవల పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. అదే సమయంలో ఈ ప్రాజెక్టు పనుల విషయంలో ఆలస్యానికి ఏపీ సర్కారుదే బాధ్యత అని తప్పించుకునే ప్రయత్నం చేసింది.
కాంట్రాక్టర్ సంస్థ, జలవనరుల శాఖ ప్రణాళికలను సరిగా అమలు చేయకపోవడం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం అవుతోందని.. ఇబ్బందులు తలెత్తుతున్నాయని పీపీఏ వెల్లడించింది. ప్రాజెక్టు నిర్మాణంలో తమ సూచనలను గానీ.. కేంద్ర జలవనరుల శాఖ, జలసంఘం మార్గదర్శకాలను కానీ పట్టించుకోలేదని ఆరోపించింది.
2021 జులై నాటికే లోయర్ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా.. 2020 నాటి వరదల కారణంగా భారీ గుంతలు ఏర్పడటంతో.. గడువును 2022 జులై చివరి నాటికి సవరించారు. పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణం సకాలంలో పూర్తిచేయాలంటేు లోయర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కావడం ముఖ్యం. కానీ లోయర్ కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయడంలో ఆలస్యం జరిగింది. లోయర్ కాఫర్ డ్యామ్ నిర్మాణం నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోవడంతో… వరద నీరు కాఫర్ డ్యామ్ మీదుగా వెనక్కి వచ్చింది. దీంతో మెయిన్ డ్యామ్ ప్రాంతం మొత్తం జలమయమైందని తేలింది. ఇప్పటికైనా అసలేం జరిగింది.. మరోసారి పొరపాట్లు పునరావృతం కాకుండా ఏం చేయాలో శాస్త్రీయ అధ్యయనం చేసి.. ముందుకెళ్తేనే.. పోలవరం వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పోలవరం విషయంలో ప్రభుత్వాలు, పార్టీలు.. పంతాలు, పట్టింపులు పక్కనపెట్టి.. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాల్సి ఉంది. అప్పుడే పోలవరం కల సాకారమై ఏపీ మొత్తానికీ మేలు జరుగుతుంది.