Congress Party : కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. రోజుకొక పరిణామం ఆ పార్టీ నాయకత్వానికి కునుకులేకుండా చేస్తోంది. సీనియర్ నేతలు బాధ్యతలు మాకొద్దు బాబో అని తప్పుకుంటున్నారు. అలాగని జూనియర్లు కూడా ఉండటం లేదు. అసలు కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి..? అధికారం సంగతి తర్వాత పార్టీ మనుగడే కష్టమా..?
2019 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. అప్పటి నుంచి ఆ పార్టీలో నాయకత్వ లేమి కనిపిస్తోంది. సోనియాగాంధీ పార్టీని నడిపిస్తున్నప్పటికీ గత ఎనిమిదేళ్ళుగా ఆమె అంతగా యాక్టివ్‌గా వుండలేకపోతున్నారు.
కాంగ్రెస్ కు వరుసగా సీనియర్ల రాజీనామాలు షాకిస్తున్నాయి. ఇప్పటికే కపిల్ సిబాల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పగా.. ఇప్పుడు పార్టీతో 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నట్టు ఆజాద్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఆజాద్ ముఖ్యంగా రాహుల్ వ్యవహారశైలిని తప్పుబట్టడం చర్చనీయాంశంగా మారింది. వారసత్వ బాధ్యతల్లో భాగంగా గతంలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షులయ్యారు. అయితే, ఆయన బాధ్యతలు చేపట్టిన వేళావిశేషం బాగా లేదనే చెప్పాలి. రంగంలోకి దిగిన తొలి ఎన్నికల నుంచి ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగిన విజయం సాధించిందే లేదు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పరాజయాల పరంపరను దశాబ్ధకాలానికిపైగా కొనసాగించిన ఘనత రాహుల్ గాంధీదే అని చెప్పాలి. తాను తొలిసారి పూర్తి బాధ్యతలు తీసుకున్న 2012 యుపీ అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పార్టీ పరాజయాల పరంపర పదేళ్ళుగా కొనసాగుతూనే వుంది. మొన్నటి యుపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండంటే రెండు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. దాంతో పార్టీకి అసలు పునర్వైభవం సాధ్యమేనా అన్న సందేహం పార్టీవర్గాల్లోనే ప్రబలంగా వినిపిస్తోంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు పలువురు నేతలు.
2019 ఎన్నికల ఫలితాల తర్వాత అధ్యక్ష పదవి నుంచి రాహుల్ తప్పుకోవడంతో.. అధ్యక్షుడ్ని ఎన్నుకోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా తయారైంది. మొన్నటికి మొన్న అశోక్ గెహ్లాట్ కు బాధ్యతలు ఖాయమనే ప్రచారం జరిగినా.. రాజస్థాన్ సీఎం పదవి వదులుకోవడానికి ఆయన సుముఖంగా లేకపోవడంతో పరిస్థితి మొదటికొచ్చింది. ఓవైపు రాహుల్ విముఖత.. మరోవైపు ఎవర్ని అధ్యక్షుడ్ని చేయాలో తెలియని అయోమయం కలిసి.. కౌన్ బనేగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనే చర్చకు తెరతీశాయి. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షున్ని ఎన్నుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఇపుడు తలెత్తింది. ఈక్రమంలోనే గత వారం రోజుల వ్యవధిలో పలువురు సీనియర్ నేతలు రాహుల్ గాంధీనే పార్టీ పగ్గాలు చేపడితే బావుంటుందన్న అభిప్రాయంతో ఆయన్ను కలుస్తూ వస్తున్నారు. అయితే ఈ సీనియర్ల అభ్యర్థనలను రాహుల్ తోసిపుచ్చుతున్నారని చెబుతున్నారు. రాహుల్ కాకపోతే మరి ఇంకెవరు ? అసలు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు ఎందుకు విముఖత ప్రదర్శిస్తున్నారు ? ఇలాంటి చర్చలు సహజంగానే ఊపందుకున్నాయి.
నిజానికి ఆరు నెలల క్రితం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను కాంగ్రెస్ పార్టీ హయిర్ చేసిందన్న కథనాలు వచ్చాయి. వాటికి అనుగుణంగానే ప్రశాంత్ కిశోర్.. పదిహేను రోజుల వ్యవధిలో పలుమార్లు అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. పార్టీ పరిస్థితి మెరుగు పరిచేందుకు, అధికారంలోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రశాంత్ కిశోర్ ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి సోనియాకు వివరించారు. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన పీపీఏపై సోనియా గాంధీ సీరియస్‌గా సమాలోచనలు జరుపుతున్నారంటూ కథనాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయింది. కానీ అందుకు భిన్నమైన పరిణామాలు కేవలం పక్షం రోజుల వ్యవధిలోనే చోటుచేసుకున్నాయి. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని, పార్టీ ఇచ్చిన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నానని స్వయంగా పీకే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా సైతం పీకే ఇచ్చిన ప్రజంటేషన్ అంశాలను పక్కన పెట్టేశారు. పార్టీ నాయకత్వంలో మార్పులు చేయాలన్న పీకే సిఫారసులను సోనియా పక్కన పెట్టేశారు. ఈ తంతు కొనసాగుతున్న తరుణంలోనే రాహుల్ గాంధీ ఉన్నట్లుండి విదేశీ పర్యటనకు వెళ్ళారు. దాంతో పార్టీ పగ్గాలను ప్రియాంక కు అప్పగించాలన్న పీకే సిఫారసు నచ్చకనే రాహుల్ గాంధీ సమాలోచనల్లో పాల్గొనకుండా విదేశీ పర్యటనకు వెళ్ళారంటూ ఊహాగానాలు వచ్చాయి. అన్నా చెల్లెళ్ళు రాహుల్, ప్రియాంక మధ్య విభేదాలున్నాయనే పుకార్లు కూడా వినిపించాయి.
వివిధ రాష్ట్రాలలో రాజకీయాలు ఎలా వున్నా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నేతలకు వచ్చే సార్వత్రిక ఎన్నికలే కీలకం. 2024 ఫిబ్రవరి-మే మధ్యకాలంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈలోగా దేశంలో గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ , మధ్యప్రదేశ్, రాజస్థాన్ , చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతోపాటు మరిన్ని అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. వీటిలో ఒకట్రెండు చోట్ల మినహా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆశల్లేవనే చెప్పాలి. ఈక్రమంలో ఇపుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆయా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటముల పర్వం కొనసాగితే అది రాహుల్ గాంధీకి వ్యక్తిగతంగా మనోస్థైర్యాన్ని దెబ్బతీసే అంశంగా మారుతుంది. అదేసందర్భంలో పార్టీశ్రేణుల్లో సైతం రాహుల్ సారథ్యంలో పార్టీకి పునర్వైభవం సాధ్యమేనా అన్న సందేహాలు పెరుగుతాయి. ఇదంతా ఆలోచించడం వల్లనే దూరదృష్టితో రాహుల్ అధ్యక్ష బాధ్యతలు ఇపుడే చేపట్టేందుకు సుముఖంగా లేరని కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
రాహుల్ గాంధీ విముఖతకు కారణాలను విశ్లేషించుకునే క్రమంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా తెరమీదికి వస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ సారథ్యం చేపట్టకపోతే ఎవరికి అవకాశం దక్కుతుందన్నది తేలడానికి ఎన్ని రోజులు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రియాంక సైతం 2022 యుపీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 403 అసెంబ్లీ సీట్లున్న యుపీలో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారు. దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద పీట వేస్తున్న అమేథీ, రాయ్‌బరేలీ వంటి లోక్ సభ సీట్ల పరిధిలోను, ముస్లింలు అధికంగా వుండే పశ్చిమ యూపీ వంటి ఏరియాల్లోను కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. 2019లో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమిపాలయ్యారు. ఆయన ఇందిర బాటలోనే ఉత్తరాదిన ఓటమిపాలై దక్షిణాది బాట పట్టారు. ఇందిర 1980లో ఆనాటి ఉమ్మడి ఏపీలోని మెదక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందినట్లే రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిపాలై కేరళ వయనాడ్ లో విజయం సాధించారు. ఇప్పటి నుంచి లెక్కేస్తే మరో 20 నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ దఫా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వేరొకరికి ఇచ్చేసి.. 2022 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితికి పార్టీని చేరిస్తే అప్పుడు పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీ చేపట్టే అవకాశం వుంది. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే.. ఇదంతా జరిగే సంకేతాలు సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. దేశంలో ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటున్నాయి. కేవలం బీజేపీ అధికారంలో వున్న రాష్ట్రాలలోనే కాదు.. బీజూ జనతాదళ్ , తృణమూల్ కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్, డిఎంకే వంటి పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాలలోను కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే వుంది. పార్టీ పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతుండటం, కష్టకాలంలో కీలక నేతల నిష్క్రమణ.. క్యాడర్లో నిరాశ పెంచుతున్నాయి.
సిపాయిల తిరుగుబాటు తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వంపై అసంతృప్తిని బుజ్జగించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందంటారు. కానీ భారత నేతలు దాన్ని స్వాతంత్య్రోద్యమ వ్యాప్తికి వేదికగా మార్చుకున్నారు. ఫలితంగా కాంగ్రెస్ దేశాన్ని ఆరు దశాబ్దాలు ఏలగలిగింది. చాలా కారణాలు పార్టీ వైభవాన్ని దెబ్బకొట్టాయి. ప్రతి వ్యవస్థా ఐదు దశల పరిణామానికి గురవుతూంటుందని అంటారు. విజయం ద్వారా వచ్చిన గర్వం తొలి దశ. క్రమశిక్షణ రాహిత్యం రెండోది. ప్రమాద హెచ్చరికలను తోసిరాజనడం మూడోది. నాలుగో దశ నిర్వాణాన్ని అంగీకరించడమైతే, చివరిది ఎవరికీ పట్టని దశ. కాంగ్రెస్‌ది ఏ దశ?
2014 నాటి ఎన్నికలు దేశ రాజ కీయాల్లో ప్రస్ఫుటమైన సైద్ధాంతిక మార్పునకు శ్రీకారం చుట్టాయి. భారతీయ జనతా పార్టీ చేతిలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. సరికొత్త రాజకీయ పార్టీ వ్యవస్థ ప్రాబల్యానికి రంగం సిద్ధమైంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 282 దక్కించుకుని బీజేపీ తొలిసారి సొంతంగా మెజారిటీ సాధించింది. అనూహ్యమైన ఈ అపజయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిగమిస్తుందనీ, మళ్లీ పుంజుకుంటుం దనీ చాలామంది ఊహించారు. కానీ 2019 ఎన్నికల్లో మరోసారి భంగపాటుకు గురవడంతో పార్టీలోనే ఆందోళన మొదలైంది. ఆత్మ పరిశీలన, చేసిన తప్పులు దిద్దుకునే ప్రయత్నం కొంతవరకూ ఫలితా లిచ్చినా… అవన్నీ తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే నెరవేర్చ గలిగాయి. ఒక్కటొక్కటిగా రాష్ట్రాలు హస్తం చేజారిపోయాయి. … చివరకు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లో మాత్రమే అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. నేతల వలసలు, అంతర్గత కుమ్ములాటలు, ప్రదేశ్ కాంగ్రెస్‌లలో వర్గ రాజకీయాలు, జాతీయ స్థాయిలో 23 మంది అగ్రనేతల అసమ్మతి కుంపటి పరిస్థితులను మరింత దిగజార్చాయి.
జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర భారత దేశపు తొలి ఎన్నికలను 1952లో ఎదుర్కొంది. లోక్‌సభకు ఉన్న 401 స్థానాల్లో 364 గెలుచుకుని అధికారం చేపట్టింది. ఆ తరువాత వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయాలు నమోదు చేసింది. ఇలా ఒకే పార్టీ దేశ రాజకీయాలను శాసించే పరిస్థితి ఏర్పడింది. ఇందిరాగాంధీ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ వ్యవస్థాగత నిర్మాణం, పని సంస్కృతుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి.ఎమర్జెన్సీ ప్రకటన ప్రజలను వర్గాలుగా చీల్చివేయగా.. పెత్తందారీతనాన్ని పోషించిన కారణంగా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరింత పలుచన చేసింది. ఫలితంగా వేర్వేరు సైద్ధాంతిక అభిప్రాయాలు కలిగిన పార్టీలు కూడా జనతా పార్టీ ఛత్రం కింద ఏకమయ్యేందుకు అవకాశం ఏర్పడింది. 1977 నాటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొ నేందుకు జనతా పార్టీ కారణమైంది. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నంత కాలం ద్వితీయశ్రేణి నాయకులు ఎవరికీ అంతగా ప్రాధాన్యం దక్క లేదు. ప్రాంతీయంగా ఎదుగుతున్న నేతల్ని కూడా ఎప్పటికప్పుడు మార్చేసే పరిస్థితి ఉండేది. పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ మార్పులు జరిగి నిర్ణయాధికారం మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయింది. లోటుపాట్లను దిగువ స్థాయి నుంచి పరో క్షంగా ప్రజల నుంచి తెలుసుకునే, దిద్దుకునే అవకాశాలు మూసుకు పోయాయి. దేశాన్ని పాలించే సమర్థత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్న అపోహలు ఇక్కడితో తొలగిపోయాయి.
ఇందిరాగాంధీ మరణం తరువాత కాంగ్రెస్ ఒక పార్టీగా కాకుండా… ఇతరులతో జట్టు కట్టి మరీ అధికారం నిలుపుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. చిన్న చిన్న పార్టీల భాగస్వామ్యంతో 1996 వరకూ అధికారంలో కొనసాగినా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి చేతిలో పరాజయం పాలైంది. 1997 నుంచి 2004 వరకూ ఎన్డీయే పాలన కొనసాగింది. 2004లో వామపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) మరోసారి విజయం సాధించింది. అయితే ఆ తరువాతి కాలంలో పార్టీలో అధి కారం ఒకరి చేతుల్లోనే ఉండిపోకుండా మన్మోహన్ సింగ్, సోనియా, రాహుల్ గాంధీల చుట్టూ తిరిగింది. ఈ కొత్త హై కమాండ్ కాంగ్రెస్ 2009లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు దోహద పడింది. కానీ యూపీఏ రెండో విడత పాలనాకాలంలో బయటపడ్డ స్కాములు, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య, విధానపరమైన స్తబ్ధతలు అప్పటి వరకూ పార్టీ సాధించిన రాజకీయ లబ్ధిని తగ్గి పోయేలా చేశాయి. 2014 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్రలో కనివినీ ఎరుగని అత్యల్ప స్థాయికి దిగజారి పోయింది. కేవలం 44 స్థానాలను మాత్రమే మూటకట్టుకోగలిగింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక ల్లోనూ పరాజయం పాలైంది. 2019లోనూ ఇదే రకమైన ఫలితాలు చవిచూసినా… ఇప్పటికీ ప్రతి పదిమంది ఓటర్లలో ఇద్దరు కాంగ్రెస్‌కు ఓటేస్తామని చెబుతున్నారు.
ఏతావాతా కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి చేరేందుకు గల కార ణాలను విశ్లేషిస్తే… వారసత్వ రాజకీ యాలు, సోనియా కుటుంబంలో రెండు తరాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ, కాంగ్రెస్ వ్యవస్థ పతనం, సంస్థాగతంగా మార్పులకు పార్టీ సిద్ధంగా లేకపోవడం, ఈ తరం ఓటర్ల ఆశలు ఆకాంక్షలకు అను గుణంగా తనను తాను మార్చు కోలేకపోవడం వంటివి కనిపిస్తాయి. జిమ్ కోలిన్స్ పుస్తకం హౌ ద మైటీ ఫాల్‌లో వ్యక్తం చేసిన ఫైవ్ స్టేజెస్ ఆఫ్ డిక్‌లైన్ భావనకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అతికినట్లు సరిపోతుంది. ప్రతి వ్యవస్థా ఐదు దశల పరిణామానికి గురవు తూంటుందని ఈ పుస్తకంలో వివరించారు. ఇందులో విజయం ద్వారా వచ్చిన గర్వం తొలి దశ అయితే, క్రమశిక్షణ రాహిత్యంతో మరింత కావాలని ఆశపడటం రెండోది. మూడో దశలో ప్రమాదం ఉందన్న హెచ్చరికలను తోసి రాజనడం ఉంటుందని చెబుతుంది. నాలుగో దశ నిర్వాణాన్ని అంగీకరించడమైతే, చివరిది ఎవరికీ పట్టని దశకు చేరుకోవడం అని వివరించారు. కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఏ దశలో ఉందో ఆ పార్టీకే తెలియాలి.
కాంగ్రెస్ పార్టీ భవిష్య్తతు ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రాహుల్ భారత్ జోడో యాత్రతో పార్టీ పుంజుకుంటుందని క్యాడర్ ఆశపడుతున్న తరుణంలో.. మొదట కాంగ్రెస్ జోడో చేయాలంటూ వస్తున్న విమర్శలు పార్టీని ఇబ్బందిపెడుతున్నాయి.
ఆటల్లో అండర్ డాగ్స్ను అభిమానించడం వేరు. గెలిచే అవకాశాలు లేవనుకుని రంగంలోకి దిగినా, పోరాడే ఆటగాళ్లు అప్పుడప్పుడు అద్భుతాలు సృష్టిస్తారు. సమాజంలో అభాగ్యులు, అంచుల్లో ఉండేవారిని ప్రేమించడం వేరు. నిస్సహా యులు, నివురు గప్పిన నిప్పులు. కానీ, చేతగాక, చేవచచ్చి, ముడుచుకుపోయి మూలుగుతూ ఉండే వారి మీద ఇంకా ఆశపెట్టుకుని ఉండడం కష్టం. కాంగ్రెస్ అంతులేని పతనగతిలోఉంది. దాన్ని చూస్తే జాలి వేసే మాట నిజమే కానీ, ఆశ కలగడం కష్టం.
కాంగ్రెస్ ప్రాభవం వెలిగిపోతున్న రోజులలో దాని రాజకీయాలను తీవ్రంగా విమర్శించి, ఒక్కసారి కూడా ఓటు వేయనివారు కూడా, ఇప్పుడు దాని దీనత్వాన్ని చూసి కలత చెందుతున్నారు.
అనేక రాష్ట్రాలలో ఉనికిలో ఉన్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థి హోదాలో ఇప్పటికీ కొనసాగుతున్నది. ఆ పార్టీ తనను తాను కాపాడుకోవాలి. దయనీయమైన, నిరాశజనక పరిస్థితి నుంచి తనను తాను ఉద్ధరించుకోవాలి. స్వతంత్ర భారతం మూడు పాతికలు దాటబోతున్న సందర్భంగా, విశేష విలువలేవీ మిగలకున్నా, జాతీయోద్యమ అవశేషంగానైనా ఆ పార్టీ మిగలాలని, అంతరించి పోకూడదని కోరుకోవలసి వస్తున్నది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అధికారపక్షంతో పాటు, ప్రతిపక్షాన్ని కూడా కలిగి ఉండే హక్కు ఉన్నది. ప్రత్యామ్నాయాన్ని నిలుపుకునే హక్కు ఉన్నది. మన్ను తిన్న పాములాగా ఉండకండి, ప్రయత్నించి అధికారం అందుకోండి అని జనమే చెప్పవలసి రావడం విషాదం.
పాత తరం నేతల్లో వ్యతిరేకత.. కొత్త ఓటర్లు దూరం కావడం కూడా కాంగ్రెస్ పుట్టి ముంచుతోంది. కొత్తతరం ఓటర్లను ఆకట్టుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమవుతోందని ఆ పార్టీకి ఎన్నికల్లో లభిస్తున్న ఓట్ల శాతాన్నిబట్టి తెలుస్తోంది. ఒక రీసెర్చి సంస్థతో కలసి లైవ్‌మింట్ నిర్వహించిన మిలీనియల్ సర్వే ప్రకారం 50 శాతం కొత్తతరం ఓటర్లు మోడీని, బీజేపీని ఇష్టపడుతుంటే రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఇష్టపడుతున్న వారి శాతం 20 కూడా లేదు. కాంగ్రెస్ కు కొత్త ఓటర్లకు మధ్య జనరేషన్ గ్యాప్ వచ్చింది. స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర గురించి, స్వాతంత్ర్యానంతరం దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి ప్రస్తుత తరానికి తెలియదు. ప్రస్తుతం ఓటర్లు సోషల్ మీడియా, వాట్సాప్‌ల ద్వారా కూడా ప్రభావితం అవుతున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో కాంగ్రెస్ బాగా వెనుకబడి ఉండటం కూడా మైనస్ గా మారుతోంది.
సిద్దాంత పరమైన రాజకీయాలతో పాటు ప్రజల రోజువారీ జీవనంలో భాగంగా ఎదుర్కొనే సమస్యలపైన కూడా పోరాటం చేస్తూ, ప్రజలకు అండదండగా ఉండకపోతే మాత్రం లెఫ్ట్ పార్టీల్లాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజాబలం తగ్గిపోతుందని ఆ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది బీజేపీ నినాదం అయినప్పటికీ.. పార్టీ ఘోర వైఫల్యంతోనే అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ స్థాయిని అధిష్ఠానమే పనిగట్టుకుని తగ్గిస్తోంది. ప్రధానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నుంచి కాకుండా వేరే పార్టీల నుంచి వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యానికి పూర్తిగా గాంధీ కుటుంబమే కారణమని చెప్పక తప్పదు. ఇప్పటికైనా రాహుల్ దీటైన కార్యాచరణ తీసుకోకపోతే.. వందేళ్ల పార్టీని ముంచేసిన అపప్రథను మూటగట్టుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
వయోభారంతో ఉన్న అధ్యక్షురాలు, స్పష్టమైన వ్యూహంలేని యువనేతలు, అసంతృప్తిగా ఉన్న సీనియర్లు.. ఇలా ఎన్నో కారణాలు కాంగ్రెస్‌ను ఈ స్థితికి తీసుకొచ్చాయి. పార్టీ అధినాయకత్వంలో నిర్ణయాలు తీసుకొనే సత్తా లోపించడం, ప్రత్యర్థుల ఎత్తుగడలను అంచనావేసి, వాటిని ఎదుర్కొనే వ్యూహాలను రచించే సామర్థ్యాలు లేకపోవడం ఆ పార్టీకి శరాఘాతమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వంపై అనేక మంది నాయకులు, కార్యకర్తలు నమ్మకాన్ని కోల్పోయారు. నేటితరం యువతకు గాంధీ కుటుంబ నేపథ్యం గురించి తెలియదని, అందువల్ల ఇదే తరహాలోనే రాజకీయాలు చేస్తూ పోతే కాంగ్రెస్ ఓటర్లు పెరిగే అవకాశం లేదని పేర్కొంటున్నారు.
కాంగ్రెస్‌లో ప్రజాకర్షక నాయకులు కరవయ్యారు. ఏళ్ల తరబడి కొందరు నాయకులమీదే ఆ పార్టీ ఆధారపడుతోంది. ఈ పార్టీలో ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న సీనియర్ నేతలు బయటికెళ్లి ప్రచారం చేయలేని పరిస్థితి ఉంది. పార్టీ నిర్ణయాధికారాలపై ప్రభావం చూపగలిగే మల్లికార్జున ఖర్గే, చిదంబరం, ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్ లాంటివారంతా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నవారే. వీరు పార్లమెంటులో కానీ, బయట కానీ బీజేపీని ఇరుకునపెట్టేంత వ్యూహ చతురతతో వ్యవహరించకపోవడంవల్ల కాంగ్రెస్ ప్రభావవంతమైన పార్టీ అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించలేకపోతోంది. గతంలో మాదిరిగా ఇప్పటికీ ఎస్సీ ఓటుబ్యాంకును నమ్ముకుని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది. దేశంలో 2014 తర్వాత బీజేపీ సరికొత్త సామాజిక ఇంజినీరింగ్ ను తెరపైకి తెచ్చింది. దానికి అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడంలో కాంగ్రెస్ ఫెయిలైంది. కాంగ్రెస్ ఇప్పటికా పాత చింతకాయ పచ్చడి లాండి వ్యూహాలను పట్టుకుని వేలాడుతోంది. గతంలో మాదిరిగా ఓ వర్గానికి చెందిన ప్రముఖ నేతను ముందు నిలబెడితే.. ఆ వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా పడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఈ విషయం తెలుసుకోకుండా.. ఇప్పటికీ పడికట్టు పాలిటిక్స్ చేస్తూ.. తన గొయ్యి తానే తవ్వుకుంటోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన సొంత ఎజెండాను సృష్టించడానికి బదులు ఎవరో సృష్టించిన ఎజెండా ప్రకారం వెళ్లిపోతోంది. దీనికి కూడా పూర్తి బాధ్యత రాహుల్ గాంధీనే తీసుకోవాల్సి ఉంటోంది. ప్రచారం, ప్రణాళికలపై స్పష్టమైన దృక్పథం లేకపోవడం, నిర్వహణ శక్తి సామర్థ్యాలను కోల్పోవడం పార్టీకి శాపాలుగా మారాయి. మున్ముందు ఆర్థిక వనరుల సమీకరణ కూడా కష్టం కావొచ్చుఎన్నికల రంగంలో విజయమే కీలకం అని నమ్మినప్పుడు దానికి అవసరమైన వ్యూహమేదో అనుసరించాలి. ప్రత్యర్థి బలపడడానికి ఉపయోగపడకుండా వేయగలిగే అడుగులు, ఎత్తుగడలేవో అన్వేషించాలి.
వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ తన ప్రస్థానంలో ఎన్నో సంక్షోభాలను చవిచూసింది. అయినప్పటికీ శతాబ్దం తర్వాత కూడా బలమైన పార్టీగానే కొనసాగుతోంది. ఇందుకు పార్టీలో దిగ్గజ నేతలతో కూడిన వ్యూహాత్మక బృందానిది కీలక పాత్ర అనే చెప్పచ్చు. పార్టీలో అంతర్గత విభేదాలు, ఆయా రాష్ట్రాల్లో సంక్షోభాలు, పార్లమెంటులో వ్యవహారాలు, కీలక ఎన్నికల సమయంలో ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించే బాధ్యత నిర్వహిస్తూ ఉంటుంది. కానీ, రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటినుంచి వ్యూహాలన్నీ పూర్తిగా మారిపోయాయి. 2014లో మొదలైన ప్రతికూల పరిస్థితుల ప్రభావం 2019 నాటికి మరింత తీవ్రమయ్యింది. దీంతో సీనియర్ నేతలే పార్టీని వీడాల్సి వస్తోందంటే.. పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.