ఇరాన్ యుద్ధాన్ని దూకుడుగా మొదలుపెట్టిన అమెరికా.. చివరకు వెనకడుగు వేసింది. అల్టిమేటం ఇచ్చిన 24 గంటల వ్యవధిలో.. ట్రంప్ ఎందుకు వాయిదా పద్ధతిని ఎంచుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు పనిచేశాయా..? సొంత దేశంలో వ్యతిరేకత భయపెట్టిందా..? ఇప్పుడు ఇరాన్ ఎందుకు మొండికేస్తోంది..? ఇరాన్‌కు బేషరతుగా లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని హుంకరించిన ట్రంప్.. చివరకు దాడులకు విరామం ఇచ్చారు. హర్మూజ్‌ను 48 గంటల్లో తెరవాలని డెడ్‌లైన్ పెట్టి.. ఆ గడువు ముగియక ముందే.. అబౌట్ టర్న్ తీసుకున్నారు. అసలు ఈ 24 గంటల్లో ఏం జరిగింది..? అసలు ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ మొదట్నుంచీ అస్పష్టంగానే ఉన్నారు. ఎందుకు యుద్ధం చేస్తున్నారో సూటిగా చెప్పలేక.. లక్షా తొంభై కారణాలు చెప్పి.. చివరకు ఒక్క దానికీ ఆధారాలు చూపలేక.. అమెరికా కాంగ్రెస్‌లో భంగపడ్డారు. మొదట అమెరికాకు శక్తివంతమైన సైన్యం ఉందని ఆర్భాటం చేసిన ట్రంప్.. తర్వాత తీవ్ర ప్రతిఘటనతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. చివరకు గౌరవప్రదంగా యుద్ధం ముగించటం బెటరనే నిర్ణయానికి వచ్చారు. అందుకోసం అంతర్జాతీయంగా యుద్ధం ముగించాలనే ఒత్తిళ్లు వచ్చినప్పుడే వెనకడుగు వేయడం బెటరనుకున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి.
ఇరాన్ యుద్ధం ఎక్కువరోజులు సాగుతుందని మొదట్లో ప్రపంచ దేశాలు అనుకోలేదు. గత ఏడాది ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి కొన్ని రోజుల యుద్ధం చేసి ముగించాయి. ఇప్పుడూ అలాగే చేస్తాయని అనుకున్నారు. కానీ తొలిరోజే ఖమేనీ మరణంతో.. అమెరికా ప్లాన్ ఈసారి పెద్దదే అని తేలిపోయింది. దీంతో అప్పట్నుంచీ ప్రపంచంలో అలజడి మొదలైంది. ఇక రెండోరోజు నుంచీ గల్ఫ్‌పై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో.. ఆ దేశాలు యుద్ధం ఆపాలని అమెరికాపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. చివరకు ఇరాన్ నుంచి యూరప్ కూడా సేఫ్ కాదని తేలిపోయాక.. అమెరికా కూడా పునరాలోచనలో పడింది. అనుకున్నట్టుగా లక్ష్యాలు ఛేదించలేకపోతుండటం.. ఆయుధాలు కూడా త్వరగా తరిగిపోతుండటం, యుద్ధ క్షేత్రం నుంచి పెంటగన్‌కు వస్తున్న సమాచారం.. ట్రంప్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిందనడంలో సందేహం లేదు. దీనికి తోడు అమెరికా ఆప్త మిత్రులైన గల్ఫ్ దేశాల్ని కాపాడలేకపోవడం.. అంకుల్ శామ్ అహంకారంపై తిరుగులేని దెబ్బ కొట్టింది. దీంతో ఇకపై అమెరికాను నమ్ముకుంటే నిండా మునుగుతామనే సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్లాయి. అప్పటికే ట్రంప్ తెంపరితనంతో విసిగిపోయిన నాటో, ఈయూ దేశాలు కూడా ట్రంప్‌తో యుద్ధానికి కలిసిరావటానికి నో చెప్పాయి. పైగా అమెరికా కోసం తమ దేశభద్రతను పణంగా పెట్టలేమనితేల్చిచెప్పాయి. ఊహించని ఈ పరిణామంతో ట్రంప్ బిత్తరపోయారు.
యుద్ధం రెండో వారంలో చమురు షాక్ కొట్టగా.. నాలుగో వారంలోకి అడుగుపెట్టేసరికి ఇంధన సంక్షోభం వచ్చి ప్రపంచమంతా చమురు మంటలు అంటుకున్నాయి. అటు గ్యాస్ సంక్షోభం కూడా తరుముకొచ్చింది. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా అన్నింటికీ ఇరాన్ యుద్ధం సెగ తగిలింది. దీనికి తోడు హర్మూజ్ దిగ్బంధం.. సరఫరా గొలుసుల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ ప్రభావంతో దేశాలకు దేశాలు ఇరుకునపడ్డాయి. దేశానికో సమస్య రావడంతో.. అందరూ అమెరికానే అనుకోని సంక్షోభానికా కారణమైందని గుర్రుగా ఉన్నాయి. అప్పట్నుంచి ప్రతి దేశం అమెరికాను యుద్ధం ఆపాలని ఒత్తిడిని తీవ్రతరం చేశాయి. మరోవైపు ఇరాన్.. తనకు యుద్ధం చేయడం తప్ప మరో మార్గం లేకుండా అమెరికా చేసిందనే వాదన వినిపించడంతో.. ట్రంప్ మరింత చిక్కుల్లో పడ్డారు.
అసలు యుద్ధం మొదలుపెట్టడానికి సరైన కారణాలు చెప్పలేకపోవడంతో.. ట్రంప్ మొదటే డిఫెన్స్‌లో పడ్డారు. యుద్ధం విషయంలో అడ్డగోలు బుకాయింపులు తప్ప.. సరైన ఆధారాలు, కార్యాచరణ లేని అమెరికాకు.. భంగపాటు తప్పదేమోననే భయం కూడా కలిగిన మాట వాస్తవం. మొన్నటిదాకా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా కష్టపడుతుంటే.. ఆనందపడ్డ అమెరికా.. చివరకు తనకూ అదే అనుభవం ఎదురౌతుందనే ఆలోచన రావడంతో పునరాలోచనలో పడింది. యుద్ధం తొలి రెండు వారాల్లో అమెరికా దాడులు ఒకలా ఉంటే.. మూడో వారం నుంచి వేరేలా ఉన్నాయి. అసలు అమెరికా యుద్ధం ఆపేస్తుందేమోననే భయంతోనే ఇజ్రాయెల్.. ఉన్నట్టుండి ఇరాన్ గ్యాస్ క్షేత్రంపై దాడులు చేసి.. యుద్ధాన్ని ఉధృతం చేసిందనే చర్చ జరిగింది. దీనికి ప్రతిగా ఏకంగా డిగో గార్సియా స్థావరంపై ఇరాన్ చేసిన దాడి.. మొత్తం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీంతో గల్ఫ్ దేశాల ఒత్తిడికి యూరప్ దేశాల ఒత్తిడి కూడ తోడైంది. మీ యుద్ధంతో మా పుట్టి ముంచొద్దంటూ యూరప్ దేశాలు ట్రంప్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. చివరకు జపాన్ కూడా ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని అమెరికాకు హితవు చెప్పింది. రష్యా, చైనా లాంటి దేశాలు మొదట్నుంచీ అమెరికాను తప్పుబడుతున్నాయి. భారత్ కూడా తటస్థంగా ఉంటూనే.. చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తూ వచ్చింది. ఇప్పటికే హర్మూజ్ దగ్గర రవాణా సాఫీగా లేక ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచ దేశాలు.. హర్మూజ్ మూసేస్తామన్న ఇరాన్ హెచ్చరికతో అలర్ట్ అయ్యాయి. ట్రంప్ అనవసరంగా ఇరాన్‌ను రెచ్చగొట్టారని ఫిక్సైన ప్రపంచం.. యుద్ధంలో విరామం ప్రకటించాల్సిన బాధ్యత అమెరికాదేనని గట్టిగా చెప్పడంతో.. ట్రంప్ వెనక్కితగ్గి ఉంటారనే చర్చ జరుగుతోంది.
ఏదేమైనా ట్రంప్ నుంచి విరామ ప్రకటన రావడానికి గత 24 గంటల్లో జరిగిన పరిణామాలే కీలకమనే విషయంలో సందేహం లేదు. హర్మూజ్‌ను తెరవటానికి గతంలో విఫలయత్నాలు చేసిన అమెరికా.. చివరకు అల్టిమేటం ఇచ్చి.. అనవసరంగా ఉద్రిక్తతలు పెరిగేందుకు కారణమైందని ప్రపంచ దేశాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పుడు ఇరాన్ మరింత రెచ్చిపోయి హర్మూజ్‌ను పూర్తిగా బిగపడితే.. ఇక కొన్ని దేశాలు కుప్పకూలటం మొదలవుతుంది. అదో చైన్ రియాక్షన్‌లాగా ప్రపంచం మొత్తాన్నీ ముంచేస్తుందని అవి భావించాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ వెనక్కితగ్గాలని దేశాధినేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చి ఉంటారని, బహుశా వైట్ హౌస్ హాట్ లైన్.. కొన్ని గంటల పాటు బిజీగానే ఉండి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఆధిపత్యం కొనసాగినన్నాళ్లూ.. పరిస్థితి ఫర్వాలేదు. కానీ ఎప్పుడైతే ట్రంప్ పబ్లిక్‌గా అయోమయంలో పడ్డారా.. ఇక ప్రపంచానికి టెన్షన్ మొదలైంది. ట్రంప్ తన తెంపరితనంతో అమెరికాతో పాటు అందర్నీ ముంచేస్తారని.. మిగతా దేశాలన్నీ వెంటనే మేలుకున్నాయి. చివరకు అన్ని దేశాల నుంచి విపరీతమైన ఒత్తిడి రావడం.. వివిధ దేశాల్లోని అమెరిక దౌత్యవేత్తలకు వస్తున్న నిరసన.. ఏ దేశంలోనూ అమెరికా సిబ్బంది సురక్షితం కాదనే హెచ్చరికలు ట్రంప్‌ను తప్పనిసరిగా వెనకడుగు వేసేలా చేశాయి.
ఇరాన్ యుద్ధం విషయంలో స్వదేశంలోనూ ట్రంప్‌పై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. అమెరికా సైనిక వ్యూహకర్తలు, సెనేటర్లు, చివరకు అధికారుల నుంచి కూడా ట్రంప్‌కు మద్దతు దొరకలేదు. సాక్షాత్తు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా యుద్ధం విషయంలో భిన్నాభిప్రాయంతో ఉండటం.. ట్రంప్‌ను ఒంటరిని చేసింది. అమెరికాలో కేవలం అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకుంటే చాలదు. అందుకు యంత్రాంగమూ కలిసిరావాలి. అసలు ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ తొలినుంచీ ఒంటెత్తు పోకడలతోనే ఇక్కడిదాకా తెచ్చుకున్నారు. అమెరికాకు యుద్ధాలు కొత్త కాదు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి మొన్నటి అఫ్గానిస్తాన్ యుద్ధం దాకా.. అమెరికా ప్రత్యేక వ్యూహరచన చేసింది. అమెరికా ఎప్పుడూ నేరుగా తన సైన్యాన్ని శత్రువులకు ఎదురుగా నుంచోపెట్టదు. మొదటి తాము దాడి చేసిన దేశంలో తిరుగుబాటుదారుల్ని నిలబెడుతుంది. ఆ తర్వాత రెండో వరుసలో నాటో బలగాలుంటాయి. చివరిగా అమెరికా బలగాలు ఉంటాయి. తిరుగుబాటుదారులతోనే సగం యుద్ధం పూర్తిచేసే అమెరికా.. మిగతా సగం నాటో బలగాలు, తన ఎయిర్‌ఫోర్స్ దూకుడుతో చేస్తుంది. అంతేకానీ అమెరికా సైన్యానికి ప్రాణనష్టం కలిగే చిన్న రిస్క్ ఉన్న ఆపరేషన్లు కూడా సాధ్యమైనంత వరకు చేయదు. అసలు అమెరికా యుద్ధానికి దిగిందంటే.. అందుకు కచ్చితంగా నిర్దిష్టమైన కసరత్తు ఉంటుంది. ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీ కూడా ఉంటుంది. కానీ ట్రంప్ మాత్రం ప్లాన్‌ఏనే లేకుండా ఇరాన్‌పై దూకుడుగా ముందుకెళ్లారు.
ఇరాన్ యుద్ధంలో తొలిరోజే గల్ఫ్‌లో అమెరికా స్థావరాల గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. అప్పట్నుంచీ గల్ఫ్‌లో ఉన్న అమెరికా సైన్యానికి కనీస రక్షణ లేకుండా పోయింది. ఓవైపు ఇరాన్ దాడులు.. మరోవైపు గల్ఫ్ దేశాల ప్రజల్లో వ్యతిరేకతతో వారు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక అమెరికా నేవీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది . కనీసం టాయిలెట్లు కూడా లేకుండా నేవీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంది. ఓ దశలో నేవీలో రాజీనామాల గురించి కూడా చర్చ జరిగింది. గల్ఫ్‌లో అమెరికా సెంట్రల్ కమాండ్ నుంచి వస్తున్న క్షేత్రస్థాయి సమాచారం అమెరికా మిలటరీ హెడ్‌క్వార్టర్స్ పెంటగన్‌లో అలజడి రేపింది. చివరకు సైనిక కమాండర్లు కూడా ఇరాన్‌నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలని ట్రంప్‌కు చెబుతూ వచ్చారు. ఆయన సలహాదారులు కూడా ఏదో ఒక సాకుతో ఇజ్రాయెల్‌ను వదిలేసి అమెరికా వెనక్కిరావాలని కోరారు. కానీ మొదట ససేమిరా అన్న ట్రంప్.. చివరకు యుద్ధంలో పరిస్థితులు చూసి వెనక్కితగ్గాల్సి వచ్చింది. ఇంకా తెగేదాకా లాగితే.. అమెరికా సైన్యంలోనూ తిరుగుబాటు వస్తుందనే చర్చ ట్రంప్‌ను భయపెట్టింది.
ట్రంప్ ఏం చేసినా గుడ్డిగా సమర్థిస్తూ వచ్చిన సొంత పార్టీ రిపబ్లికన్ సభ్యులు కూడా ఇరాన్ యుద్ధంతో విసుగెత్తిపోయారు. అమెరికా సైనికుల ప్రాణాలు పణంగా పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఏదో ఒకటి చేసి.. యుద్ధం ముగించాలని గట్టిగా ఒత్తిడి తెచ్చారు. ఇక అధికార వర్గం సరేసరి. యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అమెరికాలో అత్యున్నత అధికారి ఒకరు రాజీనామా చేశారు. ఇక ఇరాన్ నుంచి అణుముప్పు ఏమీ లేదని సాక్షాత్తు అమెరికన్ ఇంటెలిజెన్స్ డైరక్టర్ అమెరికా కాంగ్రెస్‌కు వాంగ్మూలం ఇచ్చారు. దీనికి తోడు ఈ ఏడాది చివర్లో ఉన్న మధ్యంతర ఎన్నికలు ట్రంప్‌కు బీపీ పెరిగేలా చేశాయి. సర్వేల్లో పెరుగుతున్న వ్యతిరేకత.. సొంత పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లు.. ట్రంప్‌ను 24 గంటలూ యుద్ధ విరమణ ఎలా చేయాలా అని ఆలోచించేలా చేశాయనడంలో సందేహం లేదు.
మొన్నటిదాకా మాజీ అధ్యక్షుల కంటే సమర్థుడినంటూ విర్రవీగిన ట్రంప్.. తన కథ ఇరాన్‌లో ముగిసిపోతుందేమోనని పీడకలలు కన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే.. అఫ్గాన్లో మాదిరిగా, గతంలో వియత్నాంలో మాదిరిగా.. ఇరాన్ నుంచి ఆఖరికి గల్ఫ్ నుంచి కూడా అమెరికా పలాయనం చిత్తగించాల్సి వస్తుందనే భయం కూడా ట్రంప్ కు నిద్ర పట్టకుండా చేసింది. దీంతో పైకి అంతర్జాతీయ ఒత్తిళ్లు కారణంగా చూపినా.. అంతర్గతంగా సొంత దేశంలో ఈగల మోతను భరించటం ఇక కుదిరే పని కాదని ట్రంప్ డిసైడయ్యారు. అందుకే సైలంట్గా ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టేసి సైలంటైపోయారు.
ఇక ఇరాన్ యుద్ధంలో గెలుపోటముల గురించి ట్రంప్ మాట్లాడకపోవచ్చు. ఆయనకు ఏదోలా ఎగ్జిట్ దొరకటమే కావాలని అమెరికా వర్గాలు అంటున్నాయి. అందుకోసం రెండువారాలుగా ఎదురుచూసిన ట్రంప్.. ఇప్పుడు అదను చూసి వెనకడుగు వేశారనే చర్చ జరుగుతోంది. ఎవరేమనుకున్నా.. అమెరికా ఒంటరిగా ఇరాన్‌ను ఓడించగలదనే నమ్మకం ఆ దేశానికి లేదు. కీలక సమయంలో నాటో దేశాలు హ్యాండివ్వడంతో.. ట్రంప్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే చాలా వరకు చేతులు కాలిపోయాయి. ఇంకా ముందుకెళ్తే.. హర్మూజ్‌ను తెరిపించలేక మరింత భంగపాటు తప్పదని ట్రంప్ ఎట్టకేలకు సరైన అంచనాకు వచ్చారు. దీనికి తోడు అమెరికా చరిత్రలో ఎప్పుడూ ఏ అధ్యక్షుడు యుద్ధ సమయంలో ఎదుర్కోనంత ఒంటరితనాన్ని ట్రంప్ ఎదుర్కున్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. అమెరికాలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునే అధికార వర్గం ట్రంప్ ఆలోచనను బహిష్కరించినంత పని చేసింది. దీంతో ప్రెసిడెంట్ అయిన దగ్గర్నుంచీ తన మాటే శాసనంగా అమలు చేసిన ట్రంప్.. ఈ దుస్థితిని తట్టుకోలేక వెనక్కితగ్గారు. ఇప్పుడు విరామ ప్రకటన చేస్తే.. కనీసం కాస్త గౌరవం అయినా ఉంటుందని, లేకపోతే ప్రపంచం ముందు ట్రంపే కాదు.. మొత్తం అమెరికానే దోషిగా నిలబడాల్సి వస్తుందన్న అధికారుల హెచ్చరికలు ట్రంప్‌పై గట్టిగానే పనిచేశాయి. తేడావస్తే.. ఎటూ కాకుండా పోతాననే తెలివి ఆలస్యంగా తెచ్చుకున్న ట్రంప్.. ఇరాన్‌తో చర్చలు కూడా జరుగుతున్నాయంటూ ప్రకటన చేసేశారు. ఈ స్థితిని అడ్వాంటేజ్ తీసుకున్న ఇరాన్.. అసలు చర్చలే జరగటం లేదని తేల్చేసి.. ట్రంప్‌కు ఝలక్ ఇచ్చింది. ఇదే అదనుగా అమెరికాను దారికి తేవాలనేది ఇరాన్ వ్యూహమై ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.
ఎట్టకేలకు అమెరికా నుంచి దాడులకు విరామ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనను ఇరాన్ అయితే పూర్తిగా నమ్మడం లేదని తేలిపోయింది. ఇక ఇప్పుడు అంతర్జాతీయ సమాజం తన వంతు పాత్ర పోషించాల్సిన సమయం వచ్చేసింది. మంచో, చెడో ట్రంప్ స్వరం తగ్గించారు. ఇదే అదనుగా యుద్ధాన్ని ముగింపు దిశగా తీసుకెళ్లటానికి ప్రపంచ దేశాలు చొరవ తీసుకోవాలి. యుద్ధం అమెరికా మొదలుపెట్టి ఉండొచ్చు. ముగించేది మాత్రం మేమే అని ఇరాన్ తొలిరోజే చెప్పేసింది. ఇప్పుడు ట్రంప్ ప్రకటన తర్వాత ఆ దేశ స్పందన చూస్తే.. అదే వైఖరికి కట్టుబడ్డట్టుగా కనిపిస్తోంది. యుద్ధం మొదలుపెట్టడం, ముగించటం అంతా మీ ఇష్టమేనా అంటూ ఇరాన్ అడ్డం తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భారీ ప్రాణనష్టంతో పాటు రాజధాని టెహ్రాన్ రూపురేఖల్లేకుండా పోవటాన్ని, ఖమేనీ హత్యను ఇరాన్ అంత త్వరగా మర్చిపోయే అవకాశం లేదు. అందుకే అమెరికా జుట్టు చేతికి దొరికినప్పుడే ఆడించాలనే ఉద్దేశంతో.. తమ మూడు షరతుల్ని మళ్లీ ముందుకు తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో గల్ఫ్‌లో అమెరికా ఉనికి ఉండొద్దని, ఇరాన్‌కు నష్టపరిహారం ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి దుందుడుకు దాడులు ఉండవనే హామీలివ్వాలని కోరింది. ఇప్పుడు ఆ డిమాండ్లపై అమెరికా స్పందన కోరిదంటే.. అప్పుడు ట్రంప్ ఏం చేస్తారనేది ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ట్రంప్ విరామాన్నే ప్రకటించారు . అంతేకానీ విరమణ అని ఎక్కడా చెప్పలేదు.
ఇప్పుడు ఇరాన్ ఏం ఆలోచిస్తుందనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పటికే నాలుగు వారాల యుద్ధంలో ఎవరికీ అంతుచిక్కని ఇరాన్ వ్యూహం.. ఇప్పుడు కూడా అంత తేలికగా అర్థమయ్యే అవకాశం లేదు. సరే యుద్ధంలో ఏదో ఒక పక్షం కాస్త తగ్గినప్పుడు మూడో పక్షం చొరవ తీసుకుని.. యుద్ధాన్ని ముగించాలి. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చి.. అమెరికా, ఇరాన్‌ను మళ్లీ చర్చల టేబుల్ దగ్గరకు తేవాల్సి ఉంటుంది. ఆ చర్చల్లో ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన షరతులు కూడా తీసుకొచ్చి.. ఇద్దర్నీ నయానో భయానో లొంగదీయకపోతే.. ప్రపంచం మొత్తం పెను సంక్షోభంలో కూరుకుపోక తప్పదు.
ఇప్పుడు గల్ఫ్ దేశాలు, ముస్లిం ప్రపంచంతో పాటు రష్యా, చైనా లాంటి దేశాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అమెరికాను ఎలాగూ నాటో, ఈయూ దేశాలు దాదాపుగా కట్టడి చేసినట్టే. ఇక ఇరాన్ వైపు నుంచి కూడా సానుకూల ప్రకటన వచ్చేలా చేస్తే.. యుద్ధం త్వరగా ముగిసిపోతుందనడంలో సందేహం లేదు. అయితే అందుకోసం ఇరాన్ షరతులకు పూర్తిస్థాయిలో కాకపోయినా పాక్షికంగా అయినా ట్రంప్‌ను ఒప్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తిస్థాయిలో సాధ్యం కాకపోయినా.. కనీసం బలగాల తగ్గింపు దగ్గర అంగీకారం కుదరొచ్చు. అలాగే నష్టపరిహారం విషయంలో ఏదో ఒక ఫిగర్ దగ్గర ఓకే చెప్పొచ్చు. ఇక భవిష్యత్తు దాడులుండవనే హామీ సంగతి చూస్తే.. అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా ఎంతోకొంత నిర్దిష్టమైన కట్టుబాటు చాటక తప్పదు. ఈ ఐదు రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఇరాన్ యుద్ధం భవితవ్యాన్ని తేల్చనుంది.
గతంలో చాలా యుద్ధాలు సంప్రదింపులు, చర్చలతోనే ఆగాయి. కానీ ఈ యుద్ధంలో చర్చలు జరపడం కూడా కత్తి మీద సామే. ఏ మాత్రం అటూ ఇటూ అయినా యుద్ధం మళ్లీ మొదలై.. మరింత తీవ్రస్థాయిలో జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరి యుద్ధం ముగింపు దిశగా సాగుతుందా.. కొనసాగుతుందా అనేది అమెరికా, ఇరాన్ తీసుకునే కార్యాచరణ మీదే ఆధారపడి ఉంది. కాకాపోతే ఇప్పుడు ట్రంప్ ప్రకటన ప్రపంచానికి ఓ మంచి అవకాశం అనడంలో సందేహం లేదు. ఇప్పటిదాకా ఇది అమెరికా తెచ్చిన యుద్ధం అని వాదిస్తున్న ఇరాన్‌కు… ఇప్పుడు యుద్ధం కొనసాగిస్తే.. ఆ దేశం అసలు రంగు ఇదే అనే చెడ్డపేరు తప్పదు. మరి ఇప్పుడున్న స్థితిలో ఇరాన్ అలాంటి పనికి సాహసిస్తుందా.. లేదా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇరాన్ కూడా సమస్యలతో సతమతమౌతోంది. ద్రవ్యోల్బణంబాగా పెరిగింది. కరెన్సీ విలువ ఘోరంగా తగ్గిపోయింది. ఇరానియన్లు దిక్కుతోచని స్థితిలో పక్కదేశాలకు తరలిపోతున్నారు. ఇప్పటికైనా యుద్ధ విరామానికి సహకరిస్తే.. తన దేశాన్ని పునర్నిర్మించుకోవటానికి ఇరాన్‌కు మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే అంతర్జాతీయ సమాజం అమెరికా నుంచి సముచిత పరిహారం ఇప్పించే ఛాన్స్ ఉంటుంది. కాదూ కూడదని మొండికేస్తే.. తర్వాత అసలేమీ దక్కకుండా పోయ్ ప్రమాదం ఉంది. కాకపోతే ఇక్కడ మరో కీలకం ఉంది. అదేంటంటే.. ట్రంప్ మొదట యుద్ధ విరమణ ప్రకటన చేస్తే.. అప్పుడు తాము కూడా సానుకూలంగా స్పందిస్తామని ఇరాన్ మెలిక పెట్టొచ్చు. దానికి ప్రపంచ దేశాలు కూడా కాదనే పరిస్థితి ఉండదు. అప్పుడు ట్రంప్ మరో ప్రకటన చేయాల్సిరావచ్చు. కానీ ఒక్కసారి యుుద్ధం ముగించాలని ఫిక్సయ్యాక.. ఓ ప్రకటనకు ట్రంప్ పెద్దగా ఆలోచించకపోవచ్చు. లేకపోతే అమెరికా నుంచి మంత్రులో, అధికారులో విరమణ ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాదు అధ్యక్షుడిగా గౌరవం కాపాడుకోవాలనుకుంటే.. చెప్పినట్టుగా ప్రకటన చేయాలని వైట్‌హౌసే ట్రంప్ మెడపై కత్తి పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మొత్తం మీద భారత్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసిన ఇరాన్ యుద్ధంలో ప్రస్తుత పరిణామాలు మనకు ఆశాజనకంగానే ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులు కొనసాగేలా భారత్ కూడా చొరవ తీసుకుంటుందనడంలో సందేహం లేదు. ఇది యుద్ధాల కాలం కాదని ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ మోడీ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా గల్ఫ్, ఈయూ ద్వారా అమెరికాపై, రష్యా ద్వారా ఇరాన్‌పై ఒత్తిడి పెంచటానికి భారత్ సంకోచించకపోవచ్చు. పైగా యుద్ధం తటస్థ దేశాల కొంప ముంచుతోందనే వాదనకు పలు దేశాల మద్దతు కూడగడితే.. రెండు పక్షాల చేతులూ కట్టేసినట్టవుతుంది. ఆ దిశగా భారత్ కూడా ముందడుగు వేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ విన్నాం.. ఇక మేం చెప్పేది వినాల్సిందనంటూ.. భారత్ అమెరికా, ఇరాన్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తేవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికైతే ప్రపంచమంతా యుద్ధం ఆగుతుందనే ఆశాభావంతోనే ఉంది. కానీ తలతిక్క ట్రంప్ ఎప్పుడేం చేస్తారు..? ఇరాన్ జగమొండి వైఖరి తీసుకుంటుందా..? ఇజ్రాయెల్ మరోసారి తుంటరి పని చేస్తుందా..? లాంటి ప్రశ్నలు అందర్నీ సందిగ్ధంలోకి నెట్టేస్తున్నాయి. యుద్ధం కొనసాగే ప్రతి పరిణామాన్నీ జాగ్రత్తగా కాచుకుంటూ.. యుద్ధానికి ఉన్న అన్ని మార్గాలూ మూసేసే ఉద్దేశంతోనే ప్రపంచం ఉంది. ఎలాగైనా యుద్ధాన్ని ముగించటానికి ఇరుపక్షాల్నీ ప్రేరేపించాలనే కృతనిశ్చయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది.