Story Board: హెచ్1బీ వీసాదారులకు.. అమెరికా వరుసగా షాకులు ఇస్తోంది. ఇప్పటికే హెచ్1బీ వీసాలు ఫీజులను పెంచిన అమెరికా…తాజాగా వీసా ఇంటర్వ్యూలను రద్దు చేసింది. క్రిస్మస్ హాలిడేస్ కారణమని ట్రంప్ సర్కార్ చెబుతుంటే…సోషల్ వెట్టింగ్ వల్లేనని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.
Read Also: Jagapathi Babu : పెళ్లి వీడియో తో షాక్ ఇచ్చిన జగపతి బాబు.. వీడియో వైరల్
అమెరికాకు వెళ్లాలి.. అక్కడే విద్యనభ్యసించాలి. అక్కడే సెట్ అయిపోవాలి. జీవితాన్ని హాయిగా గడపాలి. ఇది ఎంతో మంది విదేశీ విద్యార్థుల కల. అందుకు అనేక సవాళ్లు సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. కానీ, అమెరికా ప్రయాణానికి ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్కలా మారిపోయింది పరిస్థితి. కారణం.. అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు. అంతకు మించి ఆయన టెంపరితనం. వలసదారులంటేనే ఆగ్రహం వ్యక్తం చేసే ట్రంప్.. ఇప్పుడు అమెరికాలో అడుగు పెట్టాలంటేనే వణుకుపుట్టేలా వ్యవహరిస్తున్నారు.
Read Also: Mamitha : ప్రేమలు నుండి పాన్ ఇండియా హీరోయిన్ గా మమిత
అమెరికా వెళ్లే విదేశీయులు, ఉద్యోగులు, విద్యార్థులకు…అగ్రరాజ్యం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. మరోసారి ఆ దేశానికి వెళ్లాలంటే వణికిపోయేలా చేస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తలతిక్క నిర్ణయాలు తీసుకుంటూ…విదేశీయులను భయపెడుతున్నారు. అమెరికాలో అడుగుపెట్టకుండా బెదరగొడుతున్నారు. శత్రు దేశం…మిత్ర దేశం అన్న తేడా లేదు. అంతా మా ఇష్టం అన్నట్లు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును భారీగా పెంచేసిన ట్రంప్…ఆ తర్వాత సోషల్ వెట్టింగ్‌తో విద్యార్థులు, ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా హెచ్1బీ వీసాల పునరుద్ధరణ వీసాల అపాయింట్‌మెంట్లను రద్దు చేసి…ఝలక్ ఇచ్చారు.
Read Also: Delhi: ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత.. హిందూ సంఘాల నిరసన
అమెరికన్ వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ కోసం భారత్కు తిరిగొచ్చిన హెచ్-1బీ వీసాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా కాన్సులర్ కార్యాలయాల్లో వారి అపాయింట్‌మెంట్లు హఠాత్తుగా రీషెడ్యూల్ చేయడంతో చాలా మంది భారత్‌లోని చిక్కుకుపోయారు. డిసెంబర్ 15-26 మధ్య అపాయింట్‌మెంట్లను వాయిదా వేసింది. ఈ సమయంలో అమెరికాలో హాలిడే సీజన్ కావడం కూడా ఓ కారణం. అయితే అమెరికా విదేశాంగశాఖ మాత్రం ట్రంప్ కార్యవర్గం మొదలుపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్లే జాప్యం జరుగుతోంది. విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్ వీసాదారులకు సంబంధించి ఎఫ్, ఎం, జే కేటగిరీ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తోందని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఇందులోనే ఇప్పుడు హెచ్-1బీ, హెచ్-4 దరఖాస్తుదారులను కూడా చేర్చినట్లు తెలిపింది. గతంలో తాము వేగంగా ప్రాసెస్ చేసి, నిరీక్షణ సమయాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టే వాళ్లమని అమెరికా విదేశాంగశాఖ చెప్పింది. ప్రస్తుతం భారత్ సహా అన్ని దౌత్య కార్యాలయాల్లో ప్రతి కేసును ప్రత్యేకంగా పరిశీలించి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.
హెచ్-1బీ ఇంటర్వ్యూలు అకస్మాత్తుగా వాయిదా వేయడంతో…వేల మంది భారతీయ నిపుణుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఈ నెల 15 నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది చివరకు, మరికొన్నింటిని ఏకంగా 2027 సంవత్సరానికి బదిలీ చేసింది. దీంతో దరఖాస్తుదారులు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వర్క్ వీసాలను పునరుద్ధరించుకోవడానికి స్లాట్లను బుక్ చేసుకొని అమెరికా నుంచి భారత్‌కు వచ్చినవారు ఇక్కడే చిక్కుకుపోయారు. తమ కుటుంబాలను అమెరికాలో వదిలి వచ్చిన వీరంతా ఇప్పుడు ప్రయాణాలు రద్దు కావడంతో పాటు ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.
పాత తేదీల ప్రకారం ఇంటర్వ్యూలకు వచ్చినవారిని కాన్సులేట్‌లోకి అనుమతించబోమని…అమెరికన్ కాన్సులేట్ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇంటర్వ్యూల నిర్వహణలో జరుగుతున్న జాప్యం చాలామంది కెరీర్లను దెబ్బతీస్తోందని, ఇది ఎన్నో కుటుంబాలను విడదీసిందని ఇమిగ్రేషన్ న్యాయవాదులు అంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలు మానుకోవాలని హెచ్-1బీ, హెచ్-4, ఎఫ్, జే వీసాలపై ఉన్న సిబ్బందికి గూగుల్, యాపిల్ కంపెనీలు సూచించాయి.
డిసెంబరు 15 నుంచి హెచ్1బీ, హెచ్4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్‌ను ప్రారంభించింది అమెరికా. అందుకు వీలుగా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేటు నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రరాజ్యం తెలిపింది. అయితే ఇటీవల హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ముందుజాగ్రత్త చర్యలో భాగంగా భారీ ఎత్తున హెచ్-1బీ, హెచ్-4 వీసాలను ప్రుడెన్షియల్ రద్దు చేసింది. ఈ రద్దు తాత్కాలికమేనని, ఇది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని ఇమిగ్రేషన్ వెల్లడించింది. ఈ తాత్కాలిక వీసా రద్దు వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కును ప్రభావితం చేయదు. కానీ, తర్వాత వీసా అపాయింట్‌మెంట్ సమయంలో దీన్ని పరిగణనలోకి తీసుకుని వారి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంటుంది.
హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డిన్ పేజీలు, రెజ్యూమోలను సమీక్షించాలని ఆదేశించింది. వాక్ స్వాతంత్ర్యం అణచివేసేలా సెన్సార్‌షిప్‌ను అమలు చేసేందుకు గతంలో పనిచేసినట్లు తేలినా వారి వీసాలను తిరస్కరించవచ్చని స్టేట్ డిపార్ట్‌మెంట్ మెమో జారీ చేసింది. హెచ్-1బీతోపాటు హెచ్-4 వీసాదారుల రెజ్యూమో, లింక్డిన్ ప్రొఫైళ్లను సమీక్షించాలి. వారు అసత్య ప్రచారం, కంటెంట్ నియంత్రణ, ఫ్యాక్ట్ చెకింగ్, ఆన్‌లైన్ సేఫ్టీ వంటి విభాగాల్లో పని చేశారా ? అని గమనిస్తారు. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లపై ఇప్పటికే దీన్ని అమెరికా అమలు చేస్తోంది. ఇప్పుడు H1B,H4 వీసాదారులకు కూడా ఇది వర్తింపజేస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్…అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వలసేతర వీసాలపైనా కఠినంగా వ్యవహరిస్తున్నారు. హింస, చోరీ కేసుల నుంచి మద్యం తాగి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినవారి వీసాల రద్దుకు చర్యలు తీసుకున్నారు. అలాగే, హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డిన్ పేజీలు, రెజ్యూమెలను సమీక్షించాలని ఇటీవల తన దౌత్యవేత్తలకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆదేశించింది. జనవరి నుంచి 85 వేల వీసాలు రద్దయ్యాయని చెప్పిన, స్టేట్ డిపార్ట్‌మెంట్, అమెరికా పౌరుల భద్రతను దృష్టిలోపెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ వీసాల రద్దు కారణంగా 8 వేల మంది విద్యార్థులపై ప్రభావం పడిందని సంబంధిత అధికారులు వివరించారు.
మరోవైపు స్టార్టప్ వీసా ప్రోగ్రామ్‌ను కెనడా నిలిపివేసింది. ఆ స్థానంలో తమ దేశంలో వ్యాపారాలు ప్రారంభించే విదేశీయుల కోసం సరికొత్త స్కీమ్‌ను ప్రారంభించేందుకు కెనడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2026లో పైలట్ ప్రాజెక్ట్ రూపంలో కొత్త స్కీమ్‌ను తీసుకురానున్నట్లు ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా అధికారులు వెల్లడించారు. కెనడాలోని వ్యాపార ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్‌లను పునర్నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నందునే…స్టార్టప్ వీసా వర్క్ పర్మిట్ల దరఖాస్తులను నిలిపివేసినట్లు తెలిపారు.
ఇకపై స్టార్టప్ వీసా ప్రోగ్రామ్‌లో వర్క్ పర్మిట్ కోసం చేసుకునే దరఖాస్తులను అంగీకరించబోమని ఐఆర్‌సీసీ ప్రకటించింది. అయితే ఈ వీసా ప్రోగ్రామ్ కింద ఇప్పటికే వర్క్ పర్మిట్ పొందినవారు దానిని పొడిగించుకోవడానికి చేసుకున్న దరఖాస్తులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. తాము తీసుకువచ్చే కొత్త ప్రోగ్రామ్ కెనడా దీర్ఘకాలిక ఇమిగ్రేషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని స్పష్టం చేసింది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అయితే రెండు ప్రోగ్రామ్‌లకు ఉన్న తేడా ఏంటనే విషయాన్ని వెల్లడించలేదు. కొత్త స్టార్టప్ వీసా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను 2026లో క్లారిటీ ఇవ్వనుంది.
హెచ్1బీ వీసా ఫీజు పెంపు…సోషల్ వెట్టింగ్‌తో అమెరికాకు వెళ్లే వారి సంఖ్య భారీగా పడిపోయింది. టెక్ కంపెనీలు…అమెరికాకు నిపుణులు పంపించాలంటే…వణికిపోయేలా చేస్తున్నారు. హెచ్1బీ వీసా పెంపును…20 రాష్ట్రాలకు పైగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అయినప్పటికీ డోనాల్డ్ ట్రంప్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు.
అమెరికాలో హెచ్-1బీ వీసా కార్యక్రమం…1990లో ప్రారంభమైంది. అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి…దీన్ని తీసుకువచ్చారు. అయితే హెచ్-1బీ వీసా రుసుము మొన్నటి వరకు దాదాపు 1 లక్ష నుంచి రూ.6 లక్షల మధ్యే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా దానిని రూ.88 లక్షలకు పెంచారు. ట్రంప్ తీసుకువచ్చిన లక్ష డాలర్ల ఫీజు…ఇప్పటికే అమలవుతోంది. ఇందుకోసం ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఈలోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్‌లో చట్టం చేస్తే…ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమల్లో ఉంటుంది.
భారత్ నుంచి హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం 60 వేల డాలర్ల నుంచి 1.40 లక్షల డాలర్ల మధ్యలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో హెచ్-1బీ వీసా కోసం ఒక ఉద్యోగిపై లక్ష డాలర్ల ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకు రాలేదు. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము లక్ష డాలర్లు ఉంటుందని వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది. అమెరికాకు వెళ్లాలని కలలు కంటోన్న వేలాది మంది భారత విద్యార్థులు, యువ నిపుణులపై ప్రభావం చూపుతోంది.
వాయిస్
యుఎస్ వీసా అనేది ఒక ప్రత్యేక అర్హత అని, అదొక హక్కు కాదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దేశ భద్రతకు ముప్పు కలిగించే దరఖాస్తుదారుల్ని గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్క్రీనింగ్ చేస్తామని స్పష్టం చేసింది. యూఎస్ కంపెనీలు నిపుణులైన కార్మికులను నియమించుకునేందుకు హెచ్1బీ ప్రోగ్రామ్ అనుమతిస్తుంది. ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారిలో ఎక్కువమంది భారత్, చైనాకు చెందినవారే ఉన్నారు. విదేశీ విద్యార్థుల్లోనూ అత్యధిక మంది భారతీయులే. 2023-24 విద్యాసంవత్సరం ప్రకారం 3.32లక్షల మంది అగ్రరాజ్యంలో విద్య అభ్యసిస్తున్నారు.
సోషల్ వెట్టింగ్ నిబంధనపై ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోషల్ వెట్టింగ్ కోసం పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకుంటే.. ప్రైవసీకి భంగమని పలువురు వాదిస్తున్నారు. కానీ అమెరికా మాత్రం వీసా కావాలంటే.. సోషల్ వెట్టింగ్‌కు సహకరించాల్సిందేనని తేల్చిచెబుతోంది. సోషల్ వెట్టింగ్ లో వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడానికి వారి ఆన్‌లైన్ యాక్టివిటీని, సోషల్ మీడియా ఖాతాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కొన్ని నెలల క్రితం హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన తర్వాత తాజాగా తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు.. వీసాల కోసం ఎదురుచూస్తున్నవారికి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ కఠిన చర్యలు భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వేలాది మంది టెక్ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
అమెరికాలో వలసదారుల కారణంగా ఆ దేశ పౌరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయనే వాదనను బలంగా వినిపించి ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అధ్యక్షుడైతే వలసల నియంత్రణపై దృష్టి పెడతానని మొదటే చెప్పారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం పేరుతో ప్రక్రియ మొదలుపెట్టినా.. చివరకు వీసాలు దొరకటం కూడా గగనంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వృత్తినిపుణులు అందునా భారతీయుల ఎక్కువ సంఖ్యలో వలస రావటానికి హెచ్‌వన్‌బీ వీసానే రాజమార్గంగా ఉందని ట్రంప్ గుర్తించారు. దీంతో ఆ వీసా ప్రక్రియను బాగా కఠినతరం చేశారు. జాతీయ భద్రత అనే సాకు చెప్పి.. తలా తోకా లేని రూల్స్‌తో వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ దెబ్బతో తొలిసారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారితో పాటు రెన్యువల్ కోసం చూస్తున్నవారికీ కష్టాలు తప్పటం లేదు. గతంలో ఉద్యోగం వస్తే.. వీసా గ్యారంటీగా వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు రావడం కంటే.. వీసా రావడమే పెద్ద సమస్యగా మారింది. అలాంటి పరిస్థితిని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా సృష్టించారు.
గతేడాది అమెరికా విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. అప్పటి నుంచి ట్రంప్ సర్కారు విదేశీ విద్యార్థులపై కన్నెర్ర చేసింది. ఈ క్రమంలోనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల రికార్డులను కూడా కోరింది. తాజాగా వీసా ఇంటర్వ్యూల సమయంలోనే సోషల్ మీడియా వెట్టింగ్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల విద్యార్థి వీసా ప్రాసెసింగ్‌పై పెను ప్రభావం పడటంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారిన్ స్టూడెండ్ అడ్వైజర్ నివేదిక ప్రకారం.. విదేశీ విద్యార్థుల నమోదుతో అమెరికా వర్సిటీలకు ఏటా 43.8 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బుక్ చేసుకొన్న విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం కొనసాగనున్నాయి.
అమెరికా పౌరులతో పోటీపడి అధిక నైపుణ్యంతో వలసదారులు అమెరికాలో కొలువులు సంపాదించుకుంటున్నారు. కానీ ట్రంప్ మాత్రం వారి ప్రతిభను గుర్తిచకుండా.. మా ఉద్యోగాలు మీరు లాక్కుంటున్నారనే అర్ధం పర్ధం లేని లాజిక్ తెరపైకి తెచ్చారు. అసలే నిరుద్యోగంతో అల్లాడుతున్న యూఎస్ యూత్‌కు ట్రంప్ ధోరణి బాగా నచ్చింది. దీంతో ట్రంప్ ఇంకా బరితెగిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాలపై టాప్ కంపెనీలతో ట్రంప్ వైట్‌హౌస్‌లో మీటింగ్ పెట్టారు. అయితే ఇప్పటికిప్పుడు భారీ సంఖ్యలో ఉద్యోగాలు తెచ్చుకునే అర్హతలు అమెరికన్లకు లేవని అవి తేల్చేశాయి. దీంతో కొన్నాళ్లు సైలంట్‌గా ఉన్న ట్రంప్.. మధ్యలో మనవారికి శిక్షణ ఇవ్వటానికి కొందరు అధిక నైపుణ్యం ఉన్నవారికి రెడ్ కార్పెట్ వేయాలన్నట్టుగా మాట్లాడారు. కానీ తన అసలు బుద్ధి మారలేదని నిరూపిస్తూ.. ఆఖరి క్షణంలో కూడా వీసాల కోసం దరఖాస్తుచేసుకున్నవారిని వేధించటమే పనిగా పెట్టుకున్నారు.
ఇకపై అమెరికా కంపెనీలు అత్యున్నత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకుంటాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్య అమెరికా ఉద్యోగాలను కాపాడడమే కాకుండా కొత్త అవకాశాలను సృష్టిస్తుందని నమ్ముతోంది. H-1B వీసా వ్యవస్థ అత్యధికంగా దుర్వినియోగం అవుతున్న వలస విధానాల్లో ఒకటని అమెరికా భావిస్తోంది. ఈ ప్రోగ్రామ్ అసలు ఉద్దేశం అమెరికన్లు పని చేయలేని రంగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులను మాత్రమే తీసుకురావడమే లక్ష్యమంటోంది. ఇప్పుడు కంపెనీలు ఒకరిని స్పాన్సర్ చేయాలంటే 100,000 డాలర్లు చెల్లించాలి. దీంతో వారు తీసుకురాబోయే వ్యక్తులు నిజంగానే అత్యున్నత ప్రతిభావంతులు అయి ఉండాలి. వారిని అమెరికన్ ఉద్యోగులతో భర్తీ చేయలేనివారిగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.
ట్రంప్ చర్యలతో 2026 సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈసారి మొత్తం 3.58 లక్షల దరఖాస్తులు మాత్రమే అందాయి. గత ఏడాది నమోదైన 4.78 లక్షల రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఇది దాదాపు 26.9 శాతం తగ్గుదల. ఇక 2024తో పోలిస్తే అయితే ఈ సంఖ్య సగం కంటే ఎక్కువగా, 54 శాతం మేరకు తగ్గిపోయింది. ఈ ఏడాది హెచ్-1బీ వీసా కోసం 1,20,141 దరఖాస్తులు మాత్రమే అర్హత సాధించాయి. మరోవైపు హెచ్-1బీ వీసా ఫీజును పెంచడాన్ని గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానంలో సవాల్ చేసింది. 20 రాష్ట్రాలు కూడా దీన్ని సవాల్ చేశాయి. వలసల చట్టంతో సహా దాని సంబంధిత ఖర్చులలో ఇలాంటి కీలక మార్పులు చేసే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని వాదించాయి. హెచ్-1బీ వీసాలపై అదనపు రుసుములు విధించే అధికారం ట్రంప్‌నకు లేదని స్పష్టం చేశాయి.
భారతీయులనే…ట్రంప్ టార్గెట్ చేసుకుంటున్నారు. మొదట టారీఫ్‌లను భారీగా పెంచిన అమెరికా…ఆ తర్వాత అక్రమ వలసదారులను డీపొర్టేషన్ చేశారు. ఇప్పుడు హెచ్1బీ వీసాలు, సోషల్ వెట్టింగ్‌తో విదేశీయులు…అమెరికాలో అడుగు పెట్టకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస వ్యతిరేక విధానాల్ని కొనసాగిస్తున్నారు. వలసదారుల్లో మెజార్టీ భారతీయులే కావడంతో.. ట్రంప్ నిర్ణయాల ప్రభావం నేరుగా మనపైనే పడుతోంది. అధ్యక్షుడిగా గద్దెనెక్కగానే భారత్ విద్యార్థుల్ని టార్గెట్ చేసిన ట్రంప్.. ఏకంగా మన విద్యార్థులకు సంకెళ్లేసి మరీ సైనిక విమానాల్లో వెనక్కు పంపారు. ఆ తర్వాత పార్ట్ టైమ్ ఉద్యోగాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటికీ అమెరికా వర్సిటీల్లో చదువుతున్న భారత్ విద్యార్థుల్ని వెంటాడి వేధిస్తున్నారు. ఆ తర్వాత టారిఫ్ ల భారం మోపారు. ప్రపంచంలో మరే దేశంపై లేనంతగా భారత్ పై భారీ టారిఫ్‌లు విధించారు. టారిఫ్‌లపై చర్చల్లో ఇటీవలే కాస్త సానుకూలత కనిపిస్తున్న తరుణంలో.. మళ్లీ హెచ్ వన్ బీ పేరుతో వేధిస్తున్నారు ట్రంప్. సరే ట్రంప్ తిక్క గురించి కాసేపు పక్కనపెడితే.. ఈ దుస్థితికి ఎన్నారైల స్వయంకృతమే కారణమనే వాదన కూడా లేకపోలేదు.
ట్రంప్ పోకడలు చూస్తుంటే.. రేపొద్దున వీసా వచ్చాక కూడా.. అమెరికాలో ప్రశాంతంగా ఉండనిస్తారనే గ్యారెంటీ లేదనే అభిప్రాయాలు ఇప్పటికే వస్తున్నాయి. ఎవరేమనుకున్నా.. వలసదారులకు ఏదోలా అడ్డుకట్ట వస్తే.. అమెరికా కంపెనీలు చచ్చినట్టు అమెరికన్లకే ఉద్యోగాలిస్తాయని ట్రంప్ గుడ్డిగా నమ్ముతున్నారు. కానీ ఎక్కడ నుంచైనా పనిచేసే వెసులుబాటు ఉన్న ఈరోజుల్లో.. ట్రంప్ ఉద్దేశాలు నెరవేరటం అంత తేలిక కాదని నిపుణులు మొత్తుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటివరకు విద్యార్థి వీసాలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్.. ఇప్పుడు ఉద్యోగ వీసాలపై పడ్డారు. ఏతావాతా వీసా అంటేనే భయపడిపోయేలా చేస్తున్నారు. మాకొద్దీ అమెరికా అనుకోవాల్సిందేనని బలవంతం చేస్తున్నారు. ఏం చేసైనా సరే అమెరికన్లకు ఉద్యోగాలిప్పించాలని ట్రంప్ కంకణం కట్టుకుంటున్నారు. అందుకోసం అమెరికా కంపెనీలు రిస్క్‌లో పడ్డా.. దేశం కోసం ఆ మాత్రం త్యాగం చేయాల్సిందేనని దబాయిస్తున్నారు. దీంతో ట్రంప్ ఉన్నంతకాలం ఏ క్షణం ఏ బాంబు పడుతుందో భయపడుతూ బతకాల్సిన పరిస్థితులు తప్పవని మరోసారి తేలిపోయింది.
పద్ధతి ప్రకారం డీపోర్టేషన్ తో తన లక్ష్యం నెరవేరదని గుర్తించిన ట్రంప్.. గంటకో రూల్ తెచ్చి మన విద్యార్థుల్ని వేధించారు. వెంటాడారు. పార్ట్ టైమ్ ఉద్యోగాలు పుట్టకుండా చేశారు. వర్సిటీల్లో ఉన్న విద్యార్థుల్నీ ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అమెరికా వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉల్లంఘన చేసినా.. వీసా సమస్యల్లో పడుతుందని వింత భాష్యం చెప్పారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న గ్రీన్‌కార్డులకు విలువ లేదన్నట్టుగా మాట్లాడారు. గ్రీన్‌కార్డులపై ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికన్లనూ ఆశ్చర్యపోయేలా చేశాయి.
ఒక్కసారి మానసికంగా మేం వేరు.. వాళ్లు వేరు అనే భావన వచ్చాక.. మా దేశానికి రాకండి.. మీ దేశానికి పోండి అనే నినాదాలు మొగ్గతొడుగుతాయి. ఇక్కడ వలసదారులు ఎందుక వలస వచ్చారనే మౌలిక సూత్రానికి కట్టుబడితే.. అనవసర గొడవలకు అవకాశమే ఉండదు. కానీ బతకటానికి ఇతర దేశాలకు వెళ్లినవారు.. అక్కడి స్థానికులపై ఆధిపత్యం ప్రదర్శనకు దిగటం.. సహజంగానే అశాంతికి కారణమౌతోంది. అప్పుడు వద్దనుకున్నా.. మా దేశంలో డబ్బులు సంపాదించుకుంటూ.. మమ్మల్నే అవమానిస్తారా అనే భావన పెల్లుబుకుతుంది. ఒక్కసారి స్థానికులతో సామరస్యం దెబ్బతిన్నాక.. అక్కడి ప్రభుత్వాలు కూడా వలసదారులకు రక్షణ కల్పించడం కష్టమౌతుందనే విషయాన్ని గుర్తించడం ఇప్పుడు చాలా అవసరం. ఇప్పుడు ఎన్నారైలతో అమెరికాకి ఈ రకమైన సమస్యలే వస్తున్నాయంటున్నారు.
చాలా దేశాల్లో విద్యార్థులు పనిచేయడంపై నిషేధం ఉంది. కేవలం క్యాంపసుల్లో మాత్రమే పరిమిత గంటల్లో పనికి అనుమతి ఉంది. కానీ మన భారతీయ విద్యార్థులందరూ పార్ట్ టైమ్ పేరుతో రెగ్యులర్ ఉద్యోగాలే చేస్తుంటారు. దీంతో స్థానికులకు ఉపాధి లేకుండా పోతోంది. ఎక్కడ్నుంచో వచ్చిన వలసదారులు సైడ్ ఇన్‌కమ్ కోసం తమ పొట్ట కొట్టడమేంటని స్థానిక అమెరికన్లకు కడుపు మండుతోంది. పోనీ చదువయ్యాక ఉద్యోగాలు చేసే సమయంలో అయినా సరిగ్గా ఉంటున్నారా అంటే అదీ లేదు. అమెరికాలో పని సంస్కృతి మన దేశంతో పోలిస్తే ప్రత్యేకం. కానీ ఎన్నారైలు ఆ పని సంస్కృతిని కూడా చెడగొడుతున్నానేది అమెరికా ప్రజల కంప్లైంట్. గంటకు తీసుకునే వేతనం, పని గంటల విషయంలో యజమానులకే ఎదురు ఆఫర్లు ఇస్తున్న ఎన్నారైలు.. సూటిగా చెప్పాలంటే.. స్థానికుల ఉద్యోగాలు లాక్కుంటున్నారనే ఆందోళన ఎప్పట్నుంచో ఉంది. అయితే మొన్నటిదాకా ఎలాగోలా సరిపెట్టుకున్న అమెరికన్లకు.. ఇప్పుడు మాంద్యం పరిస్థితుల్లో వారిని పంపేసి.. తమకు ఉద్యోగాలవ్వాలనే కాంక్ష మొగ్గ తొడిగింది. అదే సమయంలో ట్రంప్ రూపంలో వారికి ఆశాకిరణం కనిపించింది.
బీ1, బీ2 వీసాలపై వెళ్లి అక్కడ ఏవేవో చిన్నాచితకా ఉద్యోగాల్లో సెటిలైపోయి ఆ తర్వాత గ్రీన్ కార్డులు, సిటిజన్ షిప్‌లు సంపాదించడం.. అక్కడ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు , రాష్ట్రాల కార్యక్రమాలు నిర్వహించడం .. లక్షల డాలర్ల నిధులు సమీకరించడం.. ఇక్కడి ప్రాంతీయ పార్టీలకు అక్కడ నిధులు సమీకరించడం ఇలాంటి గతితప్పిన మతిమాలిన పనులు ఎన్నో చేస్తున్నారు. తద్వారా అమెరికన్లకే అభద్రత కల్గించే పరిస్ధితి తీసుకువచ్చారు. వాళ్ల దేశం వెళ్లి మనం బతుకుతూ వాళ్ల సంస్కృతికి ముప్పు తెచ్చే స్ధితికి వచ్చారు. అందుకే విదేశీయులు అమెరికాలో అడుగు పెట్టకుండా ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అన్న నినాదాన్ని పక్కాగా అమలు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.