టాలీవుడ్ సంక్షోభంలో ఉంది. జనం థియేటర్లకు రావడం మానేశారు. కరోనా అదుపులో ఉన్న తరుణంలో.. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. కానీ థియేటర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. దీనికి అధిక టికెట్ రేట్లే కారణమనే వాదన కూడా ఉంది. కరోనా టైమ్ లో ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటుపడ్డారని, సరైన కంటెంట్ ఉన్న సినిమాల్లేక ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయాలూ ఉన్నాయి.
టాలీవుడ్ లో మొన్నటివరకు టికెట్ రేట్లు పెంచాలని చర్చ జరిగితే.. ఇప్పుడు రేట్ల తగ్గింపు చర్చనీయాంశంగా మారింది. స్వయంగా నిర్మాతలే ప్రెస్ మీట్ పెట్టి మరీ రేట్ల తగ్గింపు విషయం ప్రకటించాల్సి వచ్చింది. ఇంత చేసినా థియటర్లకు పూర్వవైభవం వస్తుందా.. లేదా అనేది అనుమానంగానే కనిపిస్తోంది.
తెలుగు వాళ్లకు సినిమా అనేది ఓ కల్చర్. అత్యంత చవకైన వినోద సాధనం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఒకప్పుడు చాలా మంది ప్రేక్షకులు టైమ్ పాస్ కోసం సినిమాకి వెళ్లేవాళ్లు. ఏ సినిమా అయినా పర్లేదనే ధోరణి కూడా ఉండేది. కానీ టికెట్ ధరలు పెరిగాక.. సినిమా లగ్జరీ అయిపోయింది. టైమ్ పాస్ కోసం సినిమా అనే కల్చర్ పోయింది. దీంతో ఓ వర్గం ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లకు రావడం మానేశారు. ఓటీటీలు వచ్చాక మధ్యతరగతి కూడా పూర్తిగా థియేటర్ కు దూరమైపోయింది. అంతంత రేట్లు పెట్టి టికెట్లు కొని సినిమా చూసే బదులు.. కొద్దిరోజులైతే ఓటీటీలో ఫ్యామిలీ మొత్తం చూడొచ్చనే భావన పెరిగింది. దీనికి తోడు సినిమా కంటెంట్ విషయంలో కూడా మేకర్స్ దృష్టి పెట్టడం లేదనే ఫిర్యాదులున్నాయి. గతంతో పోలిస్తే ప్రేక్షకుల ఆలోచన ధోరణి మారిందని తెలిసినా.. విభిన్నమైన ఆలోచనలకు ఆదరణ దక్కుతున్నా.. టాలీవుడ్ మాత్రం మూస పద్ధతిలో వెళ్తోందనే విమర్శలున్నాయి.
అదుపు తప్పుతున్న బడ్జెట్ కూడా సినిమాల కొంప ముంచుతోంది. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ లో 70 శాతం హీరో, హీరోయిన్, డైరక్టర్ రెమ్యూనరేషన్ కే పోతోంది. మిగతా కాస్త డబ్బులతో తీసే సినిమాకు అనుకున్న క్వాలిటీ రావడం లేదు. దీంతో ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా తిప్పికొడుతున్నారు. నిజానికి మన దగ్గర ఇప్పటికీ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. కరోనా టైమ్ లో దేశంలో ఎక్కడా లేని విధంగా టాలీవుడ్ థియేటర్లే కళకళలాడాయి. కానీ అందుకని చెత్త సినిమాలు వదిలితే చూసేది లేదని ఆడియన్స్ తేల్చిచెబుతున్నారు. కొన్ని సెలక్టెడ్ సినిమాలు మాత్రమే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంటున్నాయి. క్రేజీ కాంబినేషన్ ఉన్నా.. కథ లేకపోతే లాసుల తప్పడం లేదు. కొన్ని ప్రాంతాల్లో థియటర్ యజమానులు సినిమాహాళ్ల నిర్వహణకు కూడా డబ్బులు రావడం లేదని స్వచ్ఛందంగా థియేటర్లు మూసేస్తున్నారు. ఈ ధోరణి కూడా నిర్మాతలకు గుబులు పుట్టిస్తోంది.
కరోనా సాకుతో సినిమా బడ్జెట్ పెరిగిపోయిందని, టికెట్ రేట్లు పెంచుకున్న నిర్మాతలకు.. ఇప్పుడు ప్రేక్షకుల ధోరణి అంతుబట్టడం లేదు. గతంలో మాదిరిగా హడావుడి, హంగామాకు ఆడియన్స్ ఎట్రాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. స్టార్ హీరో సినిమాకు, చిన్న సినిమాకు ఒకే రేటు పెట్టడానికి వాళ్లు సిద్ధంగా లేరు. టికెట్ రేటుకు తగ్గ క్వాలిటీ కోరుకుంటున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఈ సంగతి గుర్తించి పద్ధతి మార్చుకోకపోతే.. కష్టాలు తప్పవనే అభిప్రాయాలున్నాయి. ఒకప్పుడు ఐదు రూపాయల సినిమా టికెట్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు సినిమా అంటే ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లినంత బిల్లవుతోంది. అందుకే చాలా మంది థియేటర్లకు ముఖం చాటేస్తున్నారు. ఓటీటీలు విస్తృతంగా అందుబాటులోకి రావడం, విపరీతమైన ధరలు.. థియేటర్లను కళ తప్పేలా చేశాయి.
సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను విశ్లేషించే స్థాయిలో ప్రేక్షకులు ఉన్నప్పుడు, 24 కళల పనితీరులో తప్పులు వెతికే పరిస్థితి ఉన్నప్పుడు.. చాలా జాగ్రత్తగా సినిమాలు తీయాలి. ఏమాత్రం తేడా వచ్చినా నష్టాలకు సిద్ధపడాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎంత బడ్జెట్ పెట్టినా.. ఎంత క్రేజీ కాంబినేషన్ అయినా.. ఎంత ప్రచార ఆర్భాటం చేసినా.. సినిమా హిట్ అవుతుందనే గ్యారెంటీ లేదు. లాభాల మాట దేవుడెరుగు.. కనీసం పెట్టిన డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని నిర్మాతలు వాపోతున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నా.. అవి అమలు కావడం లేదు. హీరోల రెమ్యూనరేషన్లు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా సమయంలో రెమ్యూనరేషన్లు తగ్గించుకోవాలనే సూచనలు వచ్చినా..హీరోలు మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. ఓ హీరో 60 రోజుల కాల్షీట్ కు రూ.60 కోట్లు తీసుకుంటుంటే.. మరో హీరో 90 రోజుల కాల్షీట్ కు రూ.50 కోట్లు తీసుకుంటున్నారు. హీరోయిన్లు, డైరక్టర్లు కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఎవరికి వారు రెమ్యూనరేషన్ ను ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకుని.. అంతిమంగా బడ్జెట్ పెంచేస్తున్నారు. నిర్మాతకు అన్నీ తెలిసినా.. ఎలా ఖర్చు తగ్గించాలో తెలియని పరిస్థితుల్లో క్యాషియర్ గా మిగిలిపోతున్నాడు.
కరోనా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు , అన్ని ఇండస్ట్రీల్లోనూ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా ఓటీటీల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రేక్షకుడు థియేటర్‌కు రాలేని పరిస్థితుల్లో.. సినిమానే ప్రేక్షకుడికి వద్దకు తీసుకెళ్లేందుకు ఓటీటీ మాధ్యమం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇప్పటికీ కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయంటే ఓటీటీల పరిధి ఎంత విస్తృతమైందో ఇట్టే అర్థమవుతోంది. అయితే, ఈ పరిణామమే థియేటర్ల పరిస్థితిని ప్రశార్థకంగా మార్చింది. ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలు యోచిస్తున్న తరుణంలో ఓటీటీల్లో త్వరగా సినిమాలను విడుదల చేయటమూ ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ 45 రోజుల దాకా సినిమా విడుదల చేయకూడదన్న నిర్మాతలు ఆ సమయాన్ని 70 రోజులకు పెంచాలని పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం ఓటీటీల వల్లే ప్రేక్షకులు థియేటర్‌కు రాలేకపోతున్నారా అంటే, అందుకు ఇంకా చాలా కారణాలు ఉన్నాయనే చెప్పాలి.
సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి సినిమా చూడాలంటే మొదటగా గుర్తొచ్చేది టికెట్ ధరలు. కరోనా తర్వాత సినిమా పరిశ్రమను ఆదుకునే చర్యల్లో భాగంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. పెద్ద సినిమాల విడుదల సమయంలోనైతే మొదటివారం 50శాతం అదనంగా వసూలు చేసేందుకు పచ్చజెండా ఊపాయి. వేసవికాలంలో విడుదలైన సినిమాలన్నీ భారీ బడ్జెట్, బిగ్‌స్టార్స్ సినిమాలు కావడంతో ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపారు. అయితే, సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన కుటుంబ ప్రేక్షకులు అంతంతమాత్రమే. దీనికి ప్రధాన కారణం టికెట్ ధరలు. వీటికి పార్కింగ్ ఫీజు, క్యాంటీన్‌లో తినుబండారాల ధరలు అదనం. ఇవన్నీ సామాన్యుడిని థియేటర్‌కు రప్పించకుండా చేసే ప్రతిబంధకాలే. ఓటీటీల కన్నా ముందు వీటిపై ఓ నిర్ణయానికి వస్తే, ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించవచ్చన్నది సగటు సినీ అభిమాని సూచన.
ఒకప్పుడు స్క్రిప్ట్ పూర్తయ్యాక, నటీనటుల డేట్స్ అన్నీ కుదిరితేనే దర్శక-నిర్మాతలు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేవారు. రానురానూ మార్పులు వచ్చాయి. షూటింగ్ మొదలయ్యే ముందు కూడా సన్నివేశాలు రాసుకుంటూ కూర్చోవడం వల్ల సినిమా వ్యయం పెరిగిపోవడమే కాకుండా, నాణ్యతా దెబ్బతింటోందని సీనియర్ నటులు, రచయితలు వివిధ ఇంటర్వ్యూల్లో చెప్పారు. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత మరింత మెరుగు కోసం చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ, అప్పటికప్పుడు కొత్త సన్నివేశాలు రాయడం కూడా నిర్మాణ వ్యయం పెరగడానికి కొన్నిసార్లు కారణమవుతోంది. ఇక సృజనాత్మకత పేరుతో దర్శకులు వేయించే సెట్లు, అనవసర హంగులు, విదేశీ ప్రయాణాలు.. ఇవన్నీ నిర్మాణ వ్యయాన్ని తడిసి మోపెడు చేస్తున్నాయి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా హీరో-హీరోయిన్ల రెమ్యునరేషనూ ఓ కారణమే. అవసరం ఉన్నా లేకపోయినా విజువలైజేషన్ పేరుతో చేస్తున్న గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటమే కాకుండా, సినిమాపై అదనపు భారాన్ని పెంచుతున్నాయి.
సినిమా విడుదల తర్వాత నిర్మాతలకు అదనపు ఆదాయం డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చేవి. వీసీఆర్‌లు మొదలుకొని సీడీల వరకూ ఆ పరంపర కొనసాగింది. కరోనా తరవాత నిర్మాతలకు మరొక ఆదాయ మార్గాన్ని చూపింది ఓటీటీ. చిత్రీకరణ పూర్తి చేసుకుని, కరోనా కారణంగా విడుదల చేయలేని పరిస్థితుల్లో ఓటీటీ చాలా మంది నిర్మాతలను గట్టెక్కించింది. ఓటీటీలకు అలవాటు పడిన ప్రేక్షకులు క్రమంగా థియేటర్‌లకు వచ్చేందుకు ఆసక్తి కనపరచడం లేదు.
థియేటర్‌కు రావాలా? వద్దా? అన్నది ప్రేక్షకుడి వ్యక్తిగత అభిరుచి, అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుంది. సినిమాలో సత్తా ఉన్నప్పుడే ప్రేక్షకుడు రెండున్నర గంటల పాటు థియేటర్‌లో కూర్చొనేందుకు ఆసక్తి చూపుతాడు. ఆర్‌ఆర్ఆర్, కేజీయఫ్2, సర్కారువారి పాట, ఎఫ్3, విక్రమ్ వంటి వాటిని ప్రేక్షకులు థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ సినిమాలన్నీ దాదాపు నెలన్నర తర్వాతే ఓటీటీలో వచ్చాయి. అంటే 45 రోజుల తర్వాత. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్, ఆచార్య తదితర చిత్రాలు రెండు మూడు వారాల్లోనే ఓటీటీలో వచ్చాయి. కొన్ని చిన్న చిత్రాలైతే వారానికే ఓటీటీ బాటపట్టాయి. థియేటర్‌లో కొనసాగలేని చిన్న చిత్రాల నిర్మాతలు ఓటీటీల ద్వారా గట్టెక్కారన్నది జగమెరిగిన సత్యం.
బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సినిమాను మళ్లీ ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. కానీ, పెద్దగా మెప్పించలేని సినిమాలను పదివారాల గడువు పెట్టుకుని ఓటీటీలో ఆలస్యం చేస్తే, ఎంతమంది చూస్తారన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దీని వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎందుకంటే ప్రతివారం వివిధ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. ఇతర భాషల్లో సినిమాలను, తెలుగు ఆడియోతో, సబ్ టైటిళ్లతో చూసే ప్రేక్షకుల సంఖ్యా బాగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలో చూడాలన్నా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. థియేటర్‌కు వెళ్తే, రెండున్నర గంటలు కూర్చోవాల్సిందే. కానీ, చేతిలో మొబైల్, రిమోట్ ఉంటే ఓటీటీలో పూర్తి సినిమా చూసేవారూ తక్కువే. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఎంతకాలానికి ఓటీటీలోకి తీసుకురావాలనే విషయమై ఎంతో రీసెర్చ్ జరుగుతోంది. ఫ్లాప్ అయిన సినిమాను త్వరగా ఓటీటీకి ఇవ్వడం వల్ల ప్రస్తుతానికి లాభం చేకూరినట్టువుతుంది. కానీ, అది భవిష్యత్తులో థియేటర్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రన్ వే 34, సమ్రాట్ పృథ్వీరాజ్, దగడ్ , అటాక్, బచ్చన్ పాండేవంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మెప్పించలేక రెండు, మూడు వారాలకే ఓటీటీ బాటపట్టి, నష్టాల నుంచి కొంత మేర గట్టెక్కాయి. తెలుగులోనూ ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని సినిమాలు పది వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయం ఎంత వరకూ సహేతుకమైందన్నది ఇప్పటికీ ఇంకా ఆలోచించాల్సిన విషయమే.
తెలుగు సినీ రంగంపై నిర్మాణ వ్యయం, ఓటీటీల ప్రభావం పడుతోందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం కూడా నిర్మాతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ తరుణంలో సినిమా షూటింగులు నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదనే ఆలోచన కూడా వస్తోందంటే కలవరపడాల్సిన విషయమే. టాలీవుడ్ ఎగ్జిబిషన్ సెక్టార్ మళ్లీ సంక్షోభంలో కూరుకుపోతోంది. ఈ ఏడాది తొలిసగంలో పెద్ద సినిమాలు అన్నీ ఎవరో తరుముకు వస్తున్నట్లు క్యూ కట్టేసాయి.
ఇక చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు మిగిలాయి. ఒకటి రెండో కాస్త పెద్ద సినిమాలు. టాప్ లైన్ హీరోల సినిమాలు ఏవీ ఇప్పట్లో లేవు. పైగా విడుదలవుతున్న సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర డింకీ కొట్టేస్తున్నాయి. వీటన్నింటికి తోడు వర్షాలు, గాలులు ఇంకో పక్క వ్యవసాయ పనులు పెరగడం. మొత్తం మీద అన్నీ కలిసి థియేటర్లకు సినిమాలు లేకుండా, వున్నా కూడా కలెక్షన్లు లేకుండా చేసేసాయి. దాంతో ఆంధ్ర, సీడెడ్, తెలంగాణలో చాలా థియేటర్లు మూత పెట్టారు. ఇలా మూసేసిన థియేటర్ల సంఖ్య 500 నుంచి 800 వరకు వుంటుందని అంటున్నారు. అయితే థియేటర్లు ఇలా నాలుగైదు రోజులు మూసినా ఉపయోగం ఏమీ వుండదు. కాస్త కరెంట్ బిల్లు తగ్గుతుంది తప్ప మరే ఇతర ఖర్చులు తగ్గవు. దాని వల్ల ఎగ్జిబిషన్ సెక్టార్ మరింత నష్టాలే చవిచూడాల్సి వస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌లన్నీ డిజిటల్ స్క్రీన్‌లే. సర్వీస్ ప్రొవైడర్లైన క్యూబ్‌సినిమా, యూఎఫ్‌వో మూవీలు వర్చువల్ ప్రింట్ ఫీజు వసూలు చేస్తున్నాయి. అయితే, కరోనా సమయంలో వీటికి మినహాయింపు ఇచ్చాయి. ఆ సమయంలో నెలకు దాదాపు రూ.12 నుంచి 15లక్షల నష్టం వచ్చినా థియేటర్లకు జనాన్ని రప్పించాలనే ఉద్దేశంతో భరించాయి. మళ్లీ పరిస్థితులు చక్కబడటంతో వాటిని యథాతథంగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక సినిమాకు వారు ఉపయోగించే పరికరాలను బట్టి రూ.10 వేల నుంచి రూ.17వేల వరకూ వీపీఎఫ్ ఛార్జీలు ఉన్నాయి. వీటి ధరలను కూడా స్థిరీకరిస్తే బాగుంటుందని నిర్మాతల మండలి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
థియేటర్లకు పూర్వవైభవం రావాలంటే.. గతంలో మాదిరిగా కథకు పెద్దపీట వేయాలనే వాదన పెరుగుతోంది. ఇప్పుడున్న రెమ్యూనరేషన్ విధానానికి స్వస్త పలికి.. కొత్త పద్ధతి ఆలోచించాలని కింది స్థాయి నుంచి డిమాండ్ ఉంది. సినిమా సినిమాకు హీరో, హీరోయిన్, డైరక్టర్ రెమ్యూనరేషన్లు మాత్రమే పెరిగిపోతున్నాయి. మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు అవే రెమ్యూనరేషన్లు ఉంటున్నాయి. ఈ గ్యాప్ కారణంగా అసంతృప్తి పెరిగినా.. ఇబ్బందులు తప్పవు. నిర్మాతలు ఇవన్నీ ఆలోచించి.. సముచిత నిర్ణయాలు తీసుకోవాలి. పరిశ్రమ చల్లగా ఉండాలంటే.. కొందరు నష్టపోయినా పర్లేదనే వైఖరి తీసుకోవాలి. మొదట ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే మార్గాలు అన్వేషించాలి. అందరికీ అందుబాటులో రేట్లు పెట్టడం చాలా ముఖ్యం. ఎవరైనా థియేటర్ కు వచ్చి సినిమా చూసేలా ఉండాలి కానీ.. థియేటర్లోకి ఎంటరవ్వాలంటే.. వందలకు వందలు ఖర్చు పెట్టాలనడం కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టవుతుంది. ప్రేక్షకుల క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ధోరణి ముదరడమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని సినీ విమర్శకులు చెబుతున్నారు.
ఎన్నో కారణాలతో తెలుగు సినిమా సంక్షోభం దిశగా అడుగులు వేస్తుంది.సక్సెస్ ఎప్పుడూ 10శాతమే అయినా.. నష్టాలు భారీ స్థాయిలో వుంటున్నాయి. దీనికి కారణం ఒకటని చెప్పలేం. అయితే.. బడ్జెట్ పెరగడానికి మెయిన్ రీజన్‌గా హీరో.. దర్శకుల రెమ్యునరేషనే అంటున్నారు నిర్మాతలు. ప్రొడ్యూనర్స్ గిల్డ్ సమావేశమై… అగ్ర హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకోకపోతే… షూటింగ్ బంద్ దిశగా అడుగులేయడానికి రెడీ అవుతోంది.
అఖండ.. కెజిఎఫ్2… ఆర్‌ఆర్‌ఆర్.. పుష్ప వంటి అరకొర సినిమాలు తప్ప సక్సెస్ దక్కడం గగనమైపోతోంది. భారీ నష్టాలు తెలుగు సినిమాను వెంటాడుతోంది. ఆ రోజుల్లో దిగ్గజ నిర్మాతలంతా అప్పటి స్టార్ క్యాస్ట్ తో పెద్ద సినిమాలను నిర్మించారు.వారు నిర్మించే ప్రాసెస్ లో ఏనాడు ఫైనాన్షియర్ల నుంచి లిక్విడ్ క్యాష్ తెచ్చుకుని సినిమాలను నిర్మించింది లేదు.తమకున్న దాంతోనే సినిమాల నిర్మాణం చేపట్టేవారు.వీరంతా భారీ వడ్డీలకు అమౌంట్ తెచ్చి సినిమాలను చేయలేదని ఇప్పటికీ మాట్లాడుకుంటారు.కాని నేటి తరం నిర్మాతల విషయానికి వచ్చేసరికి 5నుంచి 10రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి చేయాల్సిన పరిస్థితి.ఇక్కడ మితిమీరిన బడ్జెట్ నిర్మాతలను పూర్తిగా రిస్క్ లో పెట్టేస్తుంది.
హీరోలే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ పారితోషికాలు ఓ రేంజ్‌లో పెంచేశారు. గతంలో వీళ్లు సినిమాలో వుంటే.. 50 లక్షలు అయ్యేది. కానీ.. ఇప్పుడది కోటి నుంచి 2 కోట్లకు చేరింది. వేరు లాంగ్వేజెస్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. దర్శకుల కోరిన మీదట.. అంతిచ్చి.. వాళ్లనే తీసుకోక తప్పడం లేదు.
ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలి.. కరోనా వచ్చినప్పట్నుంచీ టాలీవుడ్ లో వినిపిస్తున్న డిమాండ్ ఇది. కానీ పిల్లి మెడలో గంట కట్టెదెవరనేదే ఇక్కడ అసలు ప్రశ్న. నిర్మాతలు పూనుకోకపోతే.. థియేటర్ల కష్టాలు కొనసాగుతాయనే ఆందోళన ఉంది.
ఒకప్పుడు ఇండస్ట్రీలో నిర్మాతకు చాలా గౌరవం ఉండేది. పెద్ద పెద్ద హీరోలు కూడా వారిని గౌరవించేవాళ్లు. కానీ తర్వాత నిర్మాతలే వాళ్ల స్థాయ తగ్గించుకున్నారనే వాదన ఉంది. నిర్మాత అజమాయిషీ ఉన్నన్నాళ్లూ చాలా వరకు బడ్జెడ్ అదుపులోనే ఉంది. ఎప్పుడైతే నిర్మాత, క్యాషియర్ పాత్రకు పరిమితమయ్యాడో.. బడ్జెట్ కడా ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. నిర్మాతలకు సినిమా తెరకెక్కే విధానంపై అవగాహన లేకపోవడం కూడా బడ్జెట్ పెరుగుదలకు కారణమౌతోంది. నిర్మాత, దర్శకుడితో కూర్చుని.. మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించకపోతే.. టాలీవుడ్ ని దేవుడు కూడా కాపాడలేడని సీనియర్లు చెబుతున్నారు. అనవసర ఆర్భాటాలు తగ్గించుకుంటే.. సినిమా బడ్జెట్ ఆటోమేటిగ్గా తగ్గుతుంది. అప్పుడు టికెట్ ధరలు తగ్గించడానికి వీలవుతుంది. ప్రేక్షకులు కూడా మెల్లగా థియేటర్లకు రావడం మొదలుపెడతారు.
అసలు టాలీవుడ్ హిస్టరీ ఏంటనేది స్టడీ చేస్తే.. తెలుగు నేలపై సినిమా వినోద సాధనమే కానీ.. బిజినెస్ కాదనే విషయం తెలుస్తుంది. ప్రేక్షకులతో థియేటర్లకు ఉన్న భావోద్వేగ బంధాన్ని.. లేనిపోని కమర్షియల్ సూత్రాలత పోగొట్టారనే విమర్శలున్నాయి. వారంలోగా వంద కోట్లు లాగేయాలనే పేరాశే కొంప ముంచుతోంది. ఒకప్పుడు కూడా భారీ బడ్జెట్ సినిమాలొచ్చాయి. కానీ వాటికి కూడా మామాలు రేట్లే ఉండేవి. సినిమా బాగుంటే ఎక్కువ రోజులు ఆడేద. ఆటోమేటిగ్గా డబ్బులు వచ్చేవి. ఇప్పుడు కూడా అలా ఉంటే నష్టం ఏంటనే వాదన ఉంది. ప్రేక్షకులు వారం కంటే సినిమాను భరించలరనేది నెగటివ్ థింకింగ్ అంటున్నారు. ఓటీటీ వాళ్లు ఫ్యాన్సీ ఆఫర్ ఇవ్వగానే టెంప్ట్ అయిపోతున్న నిర్మాతలున్నారు. బాగా నడుస్తున్న సినిమాను కడా రిస్క్ ఎందుకని ఓటీటీకి అమ్మేస్తున్నారు. కొందరు చేసే పనులు అందరికీ చేటు తెస్తున్నాయి.
రెమ్యూనరేషన్లు మార్కెట్ ను బట్టి నిర్మాతలు ఫిక్స్ చేయాలి కానీ.. హీరోల డిమాండ్లకు తలొగ్గడమేంటనే వాదన కూడా ఎప్పట్నుంచో ఉంది. కాన ఆ దిశగానూ ముందడుగు పడలేదు. హీరోయిన్ ఎవరుండాలో కూడా హీరోలే డిసైడ్ చేస్తుండటంతో. బడ్జెట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. డైరక్టర్లు కూడా మరింత భారంగా మారుతున్నారు. ఎవ్వరూ నిర్మాతను సపోర్ట్ చేయడం లేదు. కిందివాళ్ల కష్టాలు అసలే పట్టించుకోవడం లేదు. దీంతో టీమ్ స్పిరిట్ మిస్సవుతోంది. ఎవరికి నచ్చినట్టు వాళ్లుంటున్నారు. అంతిమంగా సినిమా నష్టపోతోంది.
లైఫ్ చాలా వేగంగా మారిపోతోంది. ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. స్పీడ్ యుగానికి తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడంలో సినిమా రంగం విఫలమైంది. ప్రేక్షకులతో లింక్ లేకుండా సినిమాలు తీయడంతో.. ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకప్పుడు హీరోలకు అభిమాన సంఘాలుండేవి. గ్రౌండ్ రిపోర్టులు తెలుసుకునే వీలుండేది. ఇప్పుడు రివ్యూల్ని కూడా భరించలేకపోతున్నారు. పొగిడితే పొగడాలి కానీ విమర్శించడమేంటనే స్థాయికి ఇగోయిజం పెరిగిపోయింది. దీంతో సినిమావాళ్ల ఊహా ప్రపంచానికి, ప్రేక్షకుల వాస్తవ ప్రపంచానికి పొంతన కుదరడం లేదు. ఏమాత్రం అనుభవం, వనరులు లేని ఔత్సాహికులు చేస్తున్న షార్ట్ ఫిల్మ్ లు కూడా హిట్ అవుతున్నప్పుడు.. కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమా ఎందుకు ఆడదనేది సినీ ఇండస్ట్రీ వేసుకోవాల్సిన ప్రశ్న.
ఇండస్ట్రీ బాగుండాలంటే.. థియేటర్లకు జనం రావాలి. ఈ సంగతి అందరూ గుర్తుంచుకుంటే రోజులు మారతాయి. లేకపోతే ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఇలాగే ఉంటే.. సినిమాలు తీయడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవచ్చు. అప్పుడు ఇండస్ట్రీపై ఆధారపడ్డ లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయి. పది మంది రెమ్యూనరేషన్ కోసం.. ఇంతమందిని రిస్క్ లో పెట్టడం న్యాయమేనా అని నిర్మాతలు కూడా ఆలోచించాలి. స్టార డమ్ అనేది హీరోయిజం నుంచి.. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో కూడా చెప్పే స్థాయికి చేరడం ఆరోగ్యకర పరిణామం కాదు. ఎవరి పని వాళ్లు చేస్తే అందరికీ మంచిది. లాభాలు వస్తే వాటా తీసుకునే హీరోలు.. నష్టం వస్తే మాత్రం ముఖం చాటేస్తున్నారు. నిర్మాతల కష్టసుఖాల గురించి ఆలోచించడం లేదు. ఈ పరిస్థతి మారితేనే చిత్రపరిశ్రమకు మంచి రోజులొస్తాయ. వంద కోట్లు పెడిత కాదు.. మంచి కథ, కథనంతోనే సినిమా ఆడుతుందనే విషయాన్ని గుర్తించాలి. కథలో లాజిక్ లేకపోయినా.. స్క్రీన్ ప్లేతో అయినా మ్యాజిక్ చేయాలి. ఏదీ చేయకుండా వదిలితే మాత్రం భరించడానికి ఆడియన్స్ సిద్ధంగా లేరని స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పటికైనా మారాలి. తెలివి తెచ్చుకోవాలి. పాతరోజుల్లో పాటించిన మంచి విధానాలు మళ్లీ అనుసరించాలి. ముఖ్యంగా అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఎవరిక వారు వీలైనంత వరకు బడ్జెట్ తగ్గించుకోవడం గురించి ఆలోచించాలి. ప్రేక్షకులకు ఎంత అందుబాటు ధరల్లో సినిమాను ఉంచగలిగితే అంత మంచిది. అప్పుడే సినిమా పది కాలాలు బతుకుంది. లేకపోతే థియేటర్ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
సినిమా అంటేనే నిర్మాత.ఆయన కనుసన్నల్లోనే తొలితరం నుంచి సినీ పరిశ్రమ నడుస్తు ఉంది. హెమ్ ఎమ్ రెడ్డి,రఘుపతి కయ్య,వై.వి.రావు,డూండీ ,కె మీనాక్షి నాయుడు లాంటి హేమా హేమీలు మద్రాస్ నగరంలో తెలుగోడి సత్తాను తెలుగు చిత్రంతో చెప్పే ప్రయత్నంలో విజయవంతం అయ్యారు.వారిని అనుసరిస్తూ పలువురు ఫైనాన్షియర్లు,భూస్వాములు కూడా ఈ ఫీల్డ్ లోకి వెళ్లి సినిమాల నిర్మాణం చేపట్టారు.తొలినాళ్లలో అలా వెళ్ళినవారంతా మంచి అభిరుచిగల నిర్మాతలే.కాని రాను రాను పరిస్థితి మారిపోయింది. ఇప్పుడున్న నిర్మాతలకు అభిరుచితో సంబందం లేదు.హీరోలు డేట్స్ ఇస్తే చాలు.అదే పదివేలు.వాళ్లిచ్చిన కాల్షీట్స్ తో తమని తాము సక్సెస్ ఫుల్ గా ట్రాక్ లో పెట్టుకోవాలని చూస్తున్నారు.
తెలుగు సినిమాకు ముందునుంచి నిర్మాతే హీరో.ఆ తర్వాత కథానాయకుడు వచ్చి పీఠమెక్కాడు.అక్కడనుంచి దర్శకునివైపు కెప్టెన్ ఆఫ్ ది షిఫ్ గా సినిమా ప్రయాణం మొదలైంది.ఈ క్రమంలో నిర్మాత రానురాను తన మునుపటి వైభవాన్ని కోల్పోతూ వచ్చాడు.కేవలం ప్రొడక్షన్ మీద గ్రిప్ ఉన్న సంస్థలు మాత్రమే అప్పటినుంచి ఇప్పటికీ తమ పలుకుబడిని చూపిస్తూ సినిమాలను కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అప్పట్లో పోస్టర్ పై వచ్చే నిర్మాతల పేర్లు చూసి…. సినిమా ఎలాంటిదో ఇట్టే చెప్పేసేవారు.నిర్మాతలు తమ అభిరుచులకు తగ్గ కథలనే దర్శకులతో తీయించేవారు.రానురాను ఆ కల్చర్ కనుమరుగైపోతుంది.కేవలం కొందరు హేమాహేమీలు మాత్రమే ఇప్పటికీ ఆ పాత కల్చర్ ను కొంతలో కొంత మెయిన్ టైన్ చేయగలుగుతున్నారు.
నిజానికి నిర్మాతల ఇబ్బందుల్లో ఒక్క హీరోనే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు.మార్కెట్లో ఫామ్ లో ఉన్న దర్శకులు కూడా…ఫస్ట్ కాపీని ఇంతకు ఇస్తాం.అప్పటి వరకు ప్రొడక్షన్ లో నిర్మాతలను వేలు పెట్టొద్దంటున్నారు.ఇక్కడే… నిర్మాతకు వేరే ఆప్షన్ కనిపించక మెగాఫోన్ పట్టిన వారు ఏది చెబితే దానికి తలొగ్గుతున్నాడు. నిర్మాతలు కమిటైన ఈ కాంప్రమైజ్ పాలసీ… ఇప్పటిదాకా తీసుకొచ్చింది.