గోదావరి వరద భయపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా జిల్లాలు బిక్కుబిక్కుమంటున్నాయి. పాత రికార్డులు బద్దలు కొట్టి మరీ దూసుకొస్తున్న వరద.. మహా విషాదాన్ని కళ్లకు కడుతోంది.
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి వరద నీటితో మునిగిపోవడంతో ఉత్తర తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలతో పాటు సాగునీటి ప్రాజెక్ట్ లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. 1986 లో మేడిగడ్డ ప్రాంతంలో రికార్డు అయిన భారీ వరదను మించి గోదావరి ప్రవహిస్తుండడంతో పాటు అదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు మహారాష్ర్ట, ఛత్తీస్ఘడ్ నుంచి వస్తున్న వరద నీటికి మొత్తం ఉత్తర తెలంగాణ అతలాకుతలం అయిపోయింది. 14 వ తేది మధ్యాహ్నం నాటికి మేడిగడ్డ వద్ద వరద ప్రవాహాం 25 లక్షల క్యుసెక్కులు దాటింది. బ్యారేజ్ గరిష్ట ఎత్తు 108 మీటర్లు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం వంద అడుగులుగా నిర్మించారు. అయితే ప్రస్తుతం 102 మీటర్ల మేర నీరు ప్రవహిస్తుండడంతో స్పిల్ వే పిల్లర్లు సైతం మునగిపోయాయి. దీనికి తోడు ప్రాణహిత, పెన్ గంగ, వార్ధ లాంటి ఉపనదుల నుంచి భారీగా వరద వస్తోంది.
సాధారణంగా ప్రాణహిత నుంచి మాత్రమే వరద వస్తుంది. ఎప్పుడో కానీ వార్ధ, పెనుగంగ ల నుంచి వరద రాదు. కానీ గోదావరికి సంబంధించిన అన్ని ఉపనదుల నుంచి వరద వస్తుండడంతో మహారాష్ర్ట, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ ప్రాంతాల్లోని పట్టణాలు, పల్లెలు వరదమయమయ్యాయి. దీని ప్రభావంతో కాళేశ్వరం దేవాలయంలోకి నీరు ప్రవేశించింది. ప్రాజెక్ట్ భద్రత కోసం ఏర్పాటు చేసిన కార్యాలయం, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు నీటిలో మునగిపోయాయి. ఓ వైపు వరద నీటితో నీటి మట్టం పెరగడంతో పాటు ఇంకో వైపు మిడ్ మానేరు, శ్రీరాం సాగర్, కడెం నారాయణరెడ్డి, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి తదితర ప్రాజెక్ట్ ల నుంచి వరద నీరు విడుదలవుతూనే ఉంది.
గురువారం మధ్యాహ్నం నాటికి గోదావరి బేసిన్ లోని అన్ని ప్రాజెక్ట్ లు వరద నీటితో కొట్టుకుపోయేలా వణికిపోతున్నాయి. శ్రీరాం సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎస్సారెస్పీ వరద కాలువ, కడెం ప్రాజెక్ట్, ఎల్లంపల్లి బ్యారేజ్ మొదలైన ప్రాజెక్ట్ ల నుంచి పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తున్నా అంతే స్థాయిలో వరద వస్తోంది. ఎల్లంపల్లి నుంచి 11 లక్షల 79 వేల క్యూసెక్కుల ఇన్ ఫో సరాసరిన వస్తుంటే 11 లక్షల 85 వేల క్యుసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. శ్రీ రాం సాగర్ నుంచి 3 లక్షల 29 వేల క్యుస్కెల నీటిని విడుదల చేస్తున్నారు. కేంద్ర జల సంఘం హెచ్చరికల ప్రకారం ఎప్పుడూ వరద రాని వార్ధా ఉప నదికి గరిష్టస్థాయిలో వరద నీరు వస్తోంది. 162 మీటర్ల గరిష్ట ప్రమాద నీటి మట్టాన్ని దాటి ప్రవహిస్తోంది. దీనివల్ల మహారాష్ర్టలోని చంద్రాపూర్ జిల్లాలో వరద విలయ తాండవం చేస్తోంది. అలాగే పెన్ గంగ లో వరద నీరు 97 మీటర్లు గరిష్టం కాగా 103 మీటర్లు దాటి పోయింది. దీని వల్ల యావత్మాల్ జిల్లాలో ముంపునకు గురవుతోంది. అదే విధంగా అదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో గరిష్ట స్థాయిలో వరద నీరు ప్రవాహం 138 మీటర్లు కాగా ఆ స్థాయి ని మంచి ప్రవహిస్తోంది. ఈ విధమైన పరిస్థితి వల్ల ప్రాజెక్ట్ లు నీటి మునిగిపోయి అతలాకుతలం అవుతున్నాయి.
గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో గ్రామాలు, పట్టణాలను ముంచేస్తోంది. భద్రాచలం వద్ద 60 అడుగులను దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తుండగా..భద్రాద్రి రాముని ఆలయానికి వరద తాకింది. దీంతో భద్రాచలం పట్టణం చిగురుటాకులా వణికిపోతోంది. పలు కాలనీలు నీట మునిగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభంలోనే ఈ స్థాయిలో వరద రావడంతో మరో రెండు నెలలు పరిస్థితులు ఎలా ఉంటాయోనని తీర్ ప్రాంత ప్రజలు ఆందోళన చెదుతున్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 61.5 అడుగులకు చేరింది. 1986లో గోదావరి నదికి వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా కరకట్టను నిర్మించారు. దాదాపు 80 అడుగుల మేర వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించారు. అయినప్పటికీ లీకేజీ లోపాలు శరాఘాతంలా మారాయి. అయితే 36ఏళ్ల తర్వాత గోదావరికి భారీగా వరద రావడంతో నీరు కరకట్టను తాకింది. మూడో ప్రమాద హెచ్చరిక దాటి 24 గంటలు గడవక ముందే.. ప్రవాహ ఉద్ధృతి ఏకంగా 8 అడుగులకు మించిపోయింది. గంట గంటకూ ప్రవాహం పెరిగింది. ఇప్పటికే ఏకంగా 18 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.
భద్రాచలం పట్టణానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి వారధి అతలాకుతలమైంది. దీంతో అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. 36ఏళ్ల తర్వాత గోదావరి వంతెనపై ఆంక్షలు విధిస్తూ రాకపోకలు నిషేధించారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఫలితంగా పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. సుభాష్‌నగర్, రామాలయం పరిసరాలు, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీలను వరద ముంచెత్తింది. అప్రమత్తమైన అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ రాత్రికి భద్రాచలంలో వరద తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 66 అడుగులు ఉంది. అది రాత్రికి 70 అడుగులకు చేరే అవకాశం ఉందని తెలిపారు. గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం నుంచి కూనవరం, చర్ల మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
ఎగువనున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉప్పెనలా గోదావరి వరదతో విరుచుకుపడుతోంది. వరద ఉధృతి ధాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మీ, సరస్వతి బ్యారేజ్‌లను గోదావరి వరద ముంచెత్తింది.
లక్ష్మీ బ్యారేజ్ వద్దకు 28.30 లక్షల క్యూసెక్కులు చేరడంతో కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 16.72 అడుగులకు చేరుకుంది. గోదావరి చరిత్రలో 1986లో రికార్డు స్థాయిలో 35,06,338 క్యూసెక్కులు ప్రవాహం వచ్చినప్పుడు కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 15.75 అడుగులుగా నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోయింది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. గురువారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద 19,90,294 క్యూసెక్కులు ఉండగా.. వరద నీటి మట్టం 63.20 అడుగులకు చేరగా. ఇది శుక్రవారం 70 అడుగులను దాటే అవకాశముందని కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరికి 1986, ఆగస్టు 16న రికార్డు స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలంలో గరిష్ఠంగా 75.6 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత ఆగస్టు 24, 1990న 70.8 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత గత 32 ఏళ్లుగా ఎన్నడూ భద్రాచలం వద్ద వరద నీటిమట్టం 70 అడుగులను దాటలేదు.
ఎగువ నుంచి గోదావరి పోటెత్తుతుండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. 24 గంటలూ ప్రాజెక్టు వద్ద వరద ఉధృతిని అధికారులు సమీక్షిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పోలవరం వద్దకు 16,48,375 క్యూసెక్కులు చేరుతుండగా.. వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద మట్టం 36.495 మీటర్లకు చేరగా.. దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 26.20 మీటర్లకు చేరుకుంది. ఇక్కడకు శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి 28.50 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంత వరద వచ్చినా ఎదుర్కొనేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. బ్యారేజ్‌లోకి గురువారం 16,61,565 క్యూసెక్కులు చేరుతోంది. మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తి 16,76,434 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. వరద మట్టం 15.6 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అలాగే, శుక్రవారం రాత్రికి ధవళేశ్వరం బ్యారేజీలోకి 28.50 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశముంది. అప్పుడు వరద మట్టం 17.75 అడుగులను దాటే అవకాశం ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీచేయనున్నారు. రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం 17.60 అడుగులుగా ఉంది. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరిగితే ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 554 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశముంది. అంబేద్కర్ కోనసీమలో 20, తూర్పు గోదావరిలో 8, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి 4, ఏలూరు జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశముంది.
గోదావరికి మరింత వరద వచ్చే ప్రమాదం పొంచి ఉండడంతో కోనసీమ లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, కె.గంగవరం, ఐ.పోలవరం మండలాల్లోని పలుచోట్ల ఇళ్లలోకి నీరుచేరింది. 18 మండలాల్లోని 59 గ్రామాలు వరద నీట చిక్కుకున్నాయి. 73,400 మంది వరదబారిన పడ్డారు. వరద ఉధృతి మరింత పెరిగితే ఈ మండలాల్లో మరికొన్ని గ్రామాలతోపాటు కాట్రేనికోన, కపిలేశ్వరపురం, ఆత్రేయపురం మండలాల్లోని పలు గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరే అవకాశముంది. ధవళేశ్వరం హెచ్చరికల నేపథ్యంలో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తూర్పు గోదావరిలో ఎనిమిది వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్టీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.
గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కరకట్టలను ఇసుక బస్తాలతో పటిష్టపరిచారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. విశాఖ జిల్లా ఎటపాక పోలీసుస్టేషన్లోకి గోదావరి వరద చేరింది. గోదావరి వరదల తాకిడితో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. కడెం, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో తగ్గడంతో కొన్ని ప్రాంతాలు తేరుకున్నాయి. కానీ కాళేశ్వరం దిగువన తెలంగాణలోని అనేక మండలాలు వరద ముంపులో కనిపిస్తున్నాయి.
అదే సమయంలో భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరు జిల్లాల్లోని వందల గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పోలవరం ముంపు మండలాలతో పాటుగా, గోదావరి లంకలు, కోనసీమ గ్రామాల ప్రజలు భయాందోళనతో గడపాల్సి వస్తోంది. శుక్రవారం ఉదయానికి భద్రాచలం వద్ద 2006 నాటి వరద స్థాయిని దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయానికి 67.1 అడుగులతో భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతోంది. వరద అంతకంతకు పెరుగుతుండటంతో పూర్వపు గోదావరి జిల్లాలు ప్రమాదం అంచుకు చేరుకుంటున్నాయి. చరిత్రలోనే తొలిసారిగా జులై నెలలో ఇంత పెద్ద వరదలు వచ్చినట్లు నీటి పారుదల శాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి.
గోదావరికి సహజంగా జులైలో వరదల సీజన్ ప్రారంభమవుతుంది ఆగష్టులో అది ఉధృతమవుతుంది. సెప్టెంబర్‌తో ముగుస్తుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా సీజన్ ఆరంభంలోనే నదీ ప్రవాహం ఎక్కువైంది. అది కూడా అసాధారణ స్థాయిలో కనిపిస్తోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద 2006 తర్వాత అత్యధిక వరద ప్రవాహంగా నమోదయ్యింది. సరిగ్గా పది రోజుల క్రితం గోదావరి నదిలో నీటి ప్రవాహం అంతంత మాత్రంగానే ఉండేది. ఎగువన వర్షాలు కురవకపోవడంతో నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో ధవళేశ్వరం నుంచి పంట కాలువలకు నీటిని విడుదల చేయడానికి సరిపడా నిల్వలు మాత్రమే మిగిలాయి. కానీ అనూహ్యంగా వారం గడిచేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిండుకుండలా నదీ ప్రవాహం మారిపోయింది. ఎండిపోయినట్టుగా కనిపించిన నది ఇప్పుడు హఠాత్తుగా భిన్నమైన రూపంలో దర్శనమిస్తోంది.
తొలుత మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగా ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి వచ్చిన వరద నీరు గోదావరిలో చేరింది. బాబ్లీ మీదుగా ఎస్సార్సెపీ నుంచి ప్రవాహం సాగింది. అదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో కూడా భారీ వర్షాలు కురియడం వల్ల శబరి ఉప్పొంగింది. తాలిపేరు, కిన్నెరసాని నుంచి కూడా వరద నీరు తరలిరావడంతో ఈనెల ధవళేశ్వరం వద్ద 10వ తేదీ నాటికి వరద తాకిడి మొదలయ్యింది. నాలుగు రోజుల్లోనే అది మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది.
ధవళేశ్వరంలోని నీటి పారుదల శాఖ గోదావరి హెడ్ వర్క్స్ అధికారుల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం గడిచిన వందేళ్లలో ఇంత పెద్ద స్థాయిలో వరద ప్రవాహం జులైలో ఎన్నడూ నమోదు కాలేదు. అందులో 1950ల తర్వాత జులైలో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరిన జాడ లేదని చెబుతున్నారు.
గోదావరికి 1954, 1986, 1990, 2006, 2013, 2020లలో వచ్చిన వరదలే పెద్దవిగా నమోదయ్యాయి. ఆ వరదలన్నీ ఆగష్టు నెలలోనే వచ్చాయి. ఎక్కువగా ఆగష్టు మొదటి, రెండు వారాల్లోనే భారీ వరదలు వస్తుండడం సహజంగా కనిపించింది. ఈసారి అందుకు భిన్నంగా ధవళేశ్వరం వద్ద జూలై 14వ తేదీ సాయంత్రానికే మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది. ముఖ్యమంత్రి కార్యాలయం అందించిన సమాచారం మేరకు ఈసారి వరద ప్రవాహం 23 నుంచి 24 లక్షల క్యూసెక్కుల వరకూ డిశ్చార్జ్ చేయాల్సిన స్థితికి చేరడం ఖాయంగా యంత్రాంగం భావిస్తోంది.
1986లో వరద వచ్చిన అనుభవాలు రికార్డై ఉన్నాయి. ఇప్పటికి మూడు దశాబ్దాలు గడిచినా.. వరద నిర్వహణలో మాత్రం మార్పు లేదు. గతం నుంచి ఏమీ పాఠాలు నేర్చుకోలేదు. ఎప్పుడు వరదొచ్చినా ముప్పు తప్పడం లేదు. ముందుజాగ్రత్త చర్యలు ప్రకటనలకే పరిమితమౌతున్నాయి. ధవళేశ్వరం దగ్గర కరకట్ట నిర్మాణం కూడా సగంలో ఆగిపోయింది. ప్రాజెక్టుల పూడిక తీయకపోవడం మరో పెద్ద సమస్య. దీంతో గణాంకాలకు, వాస్త వ నీటి నిల్వలకు పొంతన లేకుండా పోతోంది. ప్రాజెక్టుల్లో లిఫ్టులకే కానీ స్టోరేజ్ కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కొంప ముంచుతోంది. ఇంకా హైదరాబద్ లో భారీ వర్షాలు కురవలేదు కాబట్టి సరిపోయింది. అదే ఉత్తర తెలంగాణ జిల్లాల స్థాయిలో హైదరాబాద్ కు వరదొస్తే మహానగరం మునిగి ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా యంత్రాంగం కళ్లు తెరిచి వరద నిర్వహణ సమర్థంగా చేయకపోతే.. కన్నీటి గాథలు పునరావృతమౌతూనే ఉంటాయి.
కోనసీమ గతంలో అనేక వరదల తాకిడికి గురయ్యింది. వాటి నుంచి కోలుకుని నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉంది. 2006లో 25లక్షల క్యూసెక్కులకు పైబడి డిశ్చార్జ్ చేయాల్సిన పరిస్థితి రావడంతో కోనసీమలోని రెండు చోట్ల గోదావరి గట్లు తెగిపోయాయి. ఈసారి మళ్లీ దాదాపుగా అదే స్థాయిలో ప్రవాహం ఉంటుందనే అంచనాతో అంతా ఆందోళనతో గడుపుతున్నారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన 34 మండలాలు వరద ప్రమాదానికి గురయ్యాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందులో అత్యధికంగా కోనసీమ జిల్లాలో 20 మండలాలున్నాయి.
ఏటా జులై, ఆగష్టు నెలల్లో గోదావరికి వరద తాకిడి కనిపిస్తుంది. ఈ సమయంలో వివిధ ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. తెలంగాణలోని పేరూరు నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వరకూ నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అధికారికంగా వెల్లడిస్తూ ఉంటారు. నదీ ప్రవాహం స్థాయిని బట్టి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. వాటిని బట్టి దిగువ ప్రాంతాల ప్రజలు వ్యవహరించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల పరిధిలో అతి పెద్ద నదిగా గోదావరి ఉంది. మహారాష్ట్రలో ప్రస్థానం ప్రారంభించి, తెలంగాణ మీదుగా ఏపీ తీరంలో బంగాళాఖాతానికి ఈ నదీ ప్రవాహం చేరుతుంది. మార్గం మధ్యలో అనేక ఉపనదుల చేరికతో రాజమహేంద్రవరం ప్రాంతంలో ఇది అఖండ గోదావరిగా మారుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దిగువన పలు పాయలుగా సాగుతుంది.
ఏటా జులై నుంచి సెప్టెంబర్ వరకూ గోదావరిలో వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహరాష్ట్రలో భారీ వర్షాలు కురిసిన తర్వాత దాని ప్రభావం గోదావరి నీటిమట్టం మీద పడుతుంది. బాబ్లీ నుంచి విడుదలయ్యే నీటితో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు వరద తాకిడి చేరుతుంది. అక్కడ నుంచి ప్రస్తుతం కాళేశ్వరం, దాని దిగువన భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం బ్యారేజ్ వరకూ ఈ వరద తాకిడిని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తుంటారు. గోదావరి నదికి ఉపనదుల నుంచి కూడా ఎక్కువ వరద నీరు చేరుతుంది. అందులో ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి, పెన్ గంగా వంటి నదులున్నాయి. ముఖ్యంగా ప్రాణహిత, శబరి వంటి ఉపనదుల నుంచి ఎక్కువగా వరద నీరు గోదావరికి చేరుతుంది.
తెలంగాణలో కురిసిన వర్షాలతో ప్రాణహిత, ఇంద్రావతికి వరద ప్రవాహం పెరిగితే, ఛత్తీస్‌గఢ్‌లో కురిసే వర్షాలతో శబరి ప్రవాహం ఉద్ధృతంగా సాగుతుంది. ఆయా నదుల నుంచి వరద నీటితో పోలవరం, ధవళేశ్వరం వద్ద వరద ఎక్కువగా కనిపిస్తుంది.
తెలంగాణలోని కాళేశ్వరం, పేరూరు, దుమ్ముగూడెం, భద్రాచలం వద్ద వరద ప్రవాహాన్ని నీటిపారుదల అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరద నిర్వహణ చేస్తుంటారు. ఆయా ఉపనదులు వచ్చి గోదావరిలో కలిసిన తర్వాత వాటికి దిగువన వరద తాకిడిని కొలిచేందుకు ప్రయత్నిస్తారు. నీటిమట్టం ఆధారంగా డిశ్చార్జ్‌ను కొలుస్తారు.
ఏపీలోని పోలవరం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద లెక్కలు సేకరిస్తూ ఉంటారు. వరదల సమయంలో అన్ని చోట్లా వివరాలను ప్రతీ గంటకు బులిటెన్ రూపంలో వెల్లడిస్తూ ఉంటారు. గోదావరిలో ఏర్పాటు చేసిన కొలమానం ఆధారంగా నీటిమట్టం నీటి ప్రవాహాన్ని కొలుస్తూ అధికారికంగా వెల్లడిస్తూ ఉంటారు. ప్రవాహ స్థాయిని బట్టి ప్రజలను అప్రమత్తం చేయడం, వరద నిర్వహణ చర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది. ఆ సమయంలో వివిధ దశలో హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. మొదటి, రెండవ, మూడవ ప్రమాద హెచ్చరికలు విడుదలవుతూ ఉంటాయి. 1950 నుంచి 2022 వరకూ గోదావరికి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నమోదయిన లెక్కల ప్రకారం 37 సార్లు వరదలు వచ్చాయి అందులో 24 సార్లు ఆగష్టులోనే వరదలు వచ్చాయి. నీటి వనరుల శాఖ గోదావరి హెడ్ వర్క్స్ నివేదికల ప్రకారం.. 1953 ఆగష్టు 19న 30,03,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అప్పట్లో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్ట ఉండేది. దానికి 48 గేట్లు ఉండేవి. ఆ తర్వాత 1978లో కొత్త బ్యారేజ్ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఆగష్టు 16, 1986లో చరిత్రలోనే అతిపెద్ద వరదలు నమోదయ్యాయి. ఆనాడు 35,06,388 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. ఆనాటి వరదల్లో గోదావరి జిల్లాలకు అపార నష్టం సంభవించింది. వందల గ్రామాలు జలమయమయ్యాయి. ఆ తర్వాత ఆగష్టు 25, 1990 నాడు 27,88,700 క్యూసెక్కుల వరద ప్రవాహం బ్యారేజ్ వద్ద నమోదయింది.
ఆ తర్వాత దశాబ్దంన్నర పాటు మళ్లీ పెద్ద వరదలు నమోదు కాలేదు. కానీ ఆగష్టు7, 2006న మరోసారి పెద్ద వరదలు వచ్చాయి. 28,50,664 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదయింది. ఆ సమయంలో కోనసీమలోని శానపల్లిలంక, మొండెపులంక ప్రాంతాల్లో గోదావరి కట్టలు తెగి వరద ప్రవాహం ఊళ్లలో ప్రవేశించింది. భారీ సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. అపార ప్రాణ నష్టం కూడా సంభవించింది. భద్రాచలం వద్ద 43 అడుగులకు నీటిమట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులను వరద తాకిడి తాకితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. అదే 53 అడుగుల దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి రెడ్ అలెర్ట్ ప్రకటిస్తారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 11.75 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక విడుదలవుతుంది. నీటిమట్టం 13.75 అడుగులను దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. వరద ప్రవాహం 17.75 అడుగులను చేరితే మూడో ప్రమాద హెచ్చరిక వస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరిన సమయానికి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 10లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతారు. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని 13 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంటుంది. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే సమయానికి 17లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. దానిని దాటి గడిచిన 20 ఏళ్లలోనే 8 సార్లు వరద తాకిడి నమోదైంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరగానే నదిలో బోటు ప్రయాణాలు సహా వివిధ ఆంక్షలు అమలులోకి వస్తాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు. లంకవాసుల రాకపోకలకు కూడా అవకాశం లేదు.
రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వస్తే అనేక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతుంది. రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది కలిసి ఏటిగట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. గట్లు బలహీనంగా ఉన్నాయని భావిస్తే ఆయా ప్రాంతాల్లో అవసరమైన ఇసుకబస్తాలు వంటి రక్షణ చర్యలకు పూనుకుంటారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరితే ధవళేశ్వరంలో బ్యారేజ్ నిర్వహణ కూడా సూపరింటెండెంట్ ఇంజనీర్ పర్యవేక్షణలోకి వెళుతుంది. జిల్లా కలెక్టర్‌కు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలియజేస్తూ అవసరమైన అన్ని చర్యలకు ఉపక్రమిస్తారు. ప్రభుత్వ యంత్రాంగమంతా వరద నిర్వహణలోకి వెళుతుంది. ముఖ్యమైన శాఖల సిబ్బందికి సెలవులు కూడా రద్దవుతాయి. అన్ని వేళలా ఇరిగేషన్ సిబ్బంది అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఏ సమస్య వచ్చినా యుద్ధ ప్రాతిపదికన రంగంలో దిగేందుకు యంత్రాంగం అప్రమత్తం కావాలి. భద్రాచలంలో కూడా మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి గోదావరి ప్రవాహం ఉంటే నేరుగా సబ్ కలెక్టర్ పర్యవేక్షణలోకి మారుతుంది.