Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story Board : ఇప్పటికే సర్ ప్రక్రియతో ఓటర్లు భారతీయులా.. కాదా అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ శాఖ అధికారి చేసిన వ్యాఖ్యలు.. అసలు భారతీయుడెవరనే కొత్త ప్రశ్నకు తావిచ్చాయి. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్.. ఆఖరికి పాస్ పోర్ట్ కూడా పౌరసత్వ ధృవీకరణ కాదని చెప్పడం దుమారం రేపుతోంది. అలాగయితే దేశంలో పౌరసత్వానికి ప్రాతిపదిక ఏంటి..? అసలు పౌరసత్వ చట్టం ఏం చెబుతోంది..? ఇప్పుడు ఎందుకీ గందరగోళం..?
అసలు మనం ఈ దేశ పౌరులం అని నిరూపించుకోవడం ఎలా..? అందుబాటులో ఉన్న ఏ పత్రమూ వారసత్వానికి ధృవీకరణ కాకపోతే.. మన భారతీయతను నిరూపించేది ఏది..? దీనికి చట్టపరంగా ఉన్న నిబంధనలేంటి..? ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ఒక ప్రకటన దేశవ్యాప్తంగా చాలా మందిని గందరగోళానికి గురిచేస్తోంది. పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని.. అది భారత పౌరసత్వానికి రుజువు కాదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 14వ పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఒక సీనియర్ అధికారి చేసిన ఈ వ్యాఖ్యలు దేశ ప్రజల్లో అయోమయం సృష్టించాయి. అలాగే గతంలో ఓటరు జాబితా సవరణల సమయంలో కేవలం ఆధార్ కార్డును పౌరసత్వ నిరూపణకు ప్రామాణికంగా తీసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తరుణంలో.. అసలు దేశంలో పౌరసత్వాన్ని నిరూపించే డాక్యుమెంట్స్ ఏవి? అనే అంశంపై సాధారణ ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
సిటిజన్‌షిప్ యాక్ట్ 1955 ప్రకారం, దేశంలో పౌరసత్వాన్ని 5 పద్ధతులలో పొందవచ్చు. పుట్టుక ద్వారా, వంశ పారంపర్యంగా లేదా వారసత్వంగా, రిజిస్ట్రేషన్ ద్వారా, సహజసిద్ధంగా లేదా నేచురలైజేషన్ ద్వారా, ఏదైనా కొత్త భూభాగాన్ని దేశంలో విలీనం చేయడం ద్వారా.. ఇలా ఏ పద్ధతిలో అయినా పౌరసత్వం వస్తుంది. అలాగే దేశంలో పౌరులందరికీ వర్తించేలా, పౌరసత్వాన్ని ఖచ్చితంగా నిరూపించే ఏ ఒక్క నిర్దిష్ట పత్రం లేదా కార్డ్ లేదనే మాట మనకు తెలియని వాస్తవం. ఒక వ్యక్తి పౌరసత్వాన్ని ఎలా పొందాడు అనేదానిపై, దానికి సంబంధించిన రికార్డులపైనే పౌరసత్వ నిర్ధారణ ఆధారపడి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేదా నేచురలైజేషన్ పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందిన వారికి ప్రభుత్వం అధికారికంగా పౌరసత్వ ధృవీకరణ పత్రం జారీ చేస్తుంది. ఇది పౌరసత్వానికి ప్రత్యక్ష రుజువుగా పనిచేస్తుంది. కానీ పుట్టుకతో లేదా వారసత్వంగా భారత పౌరసత్వం పొందిన మెజారిటీ భారతీయుల వద్ద ఈ పౌరసత్వ ధృవీకరణ పత్రం ఉండదు. ఎందుకంటే వారు దీన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే సిటిజన్‌షిప్ సర్టిఫికేట్ లేని వారు తమ పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, తల్లిదండ్రుల వివరాలు, వారి జాతీయతను తెలిపే పత్రాల ద్వారా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల పౌరసత్వ ధృవీకరణ పత్రాలు, తల్లిదండ్రులు భారత పౌరులని నిరూపించే రికార్డులు లేదా వారి భారతీయ పాస్‌పోర్ట్‌లు, పుట్టుక, వారసత్వం, జాతీయతకు సంబంధించిన ఇతర ప్రభుత్వ రికార్డులు పనిచేస్తాయి.
కేంద్ర హోం శాఖ నిబంధనల ప్రకారం.. భారత పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలు లేదా తల్లిదండ్రులకు సంబంధించిన పౌరసత్వ దరఖాస్తుల ప్రక్రియలో భారతీయ పాస్‌పోర్ట్‌లను, సిటిజన్‌షిప్ సర్టిఫికేట్లను పౌరసత్వ ఆధారాలుగా అంగీకరిస్తారు. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపు, నివాసం, ఓటు హక్కు, డ్రైవింగ్ అర్హతలను మాత్రమే ధృవీకరిస్తాయి. చట్ట ప్రకారం వీటిని పౌరసత్వానికి పూర్తి స్థాయి నిర్ధారణకు అవసరమైన డాక్యుమెంట్లుగా పరిగణించరు. పాస్‌పోర్ట్ యాక్ట్ 1967 లోని సెక్షన్ 20 ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం భారత పౌరులు కాని వారికి కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాస్‌పోర్ట్, ట్రావెల్ డాక్యుమెంట్‌ను జారీ చేసే అధికారం కలిగి ఉంది. అందుకే కేవలం ఒక పత్రాన్ని బట్టి పౌరసత్వాన్ని ప్రాథమికంగా నిర్ధారించలేరు. దాన్ని కేవలం పౌరసత్వ చట్టం రూల్స్ ప్రకారమే నిర్ణయిస్తారు.
14వ పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా గురువారం కేంద్ర విదేశాంగ శాఖ ఇచ్చిన వివరణతో ఈ వివాదం మొదలైంది. పాస్‌పోర్ట్ అనేది భారతీయ పౌరసత్వానికి ఏ రకంగానూ గుర్తింపు కాబోదు. కేవలం అంతర్జాతీయ ప్రయాణాలకు వీలు కల్పిస్తూ జారీచేసిన అనుమతి పత్రంగానే పాస్‌పోర్ట్‌ను చూడాలని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాయి. పౌరసత్వం నిర్ధారణకు పాస్‌పోర్ట్‌ను ప్రామాణికంగా తీసుకోకూడదు అనే నిర్ణయం నిన్న మొన్న తీసుకున్నది కాదు. మోడీ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో తీసుకున్నది అసలే కాదు. పాస్‌పోర్ట్ చట్టం, 1967లోని సెక్షన్ ప్రకారం పౌరులుకాని వ్యక్తులకూ పాస్‌పోర్ట్‌లు జారీ చేయవచ్చు. గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఏరకంగా చూసినా పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వానికి ఒక రుజువుగా ప్రభుత్వం ఏనాడూ పరిగణించలేదు. ఇప్పుడు కొత్తగా ఏ విధానాన్నీ తీసుకురాలేదని వివరణ వచ్చింది. కానీ ఈ వివరణ మరిన్ని కొత్త ప్రశ్నలకు, గందరగోళానికి తావిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
జనన ధ్రువీకరణ, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పౌరసత్వాన్ని రుజువు చేసే అధికారిక పత్రాలుగా గుర్తిస్తామని గతేడాది కేంద్రం స్పష్టం చేసింది. జనన, మరణ ధ్రువీకరణ చట్టం- 1969 ప్రకారం నిర్ధేశిత అధికారులు మాత్రమే జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలి. ఒక వ్యక్తి నిర్దేశిత రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో నివసించారని నివాస ధ్రువీకరణ పత్రాలు నిర్ధారిస్తాయి. ఇవి మాత్రమే వాళ్లు భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని రుజువు చేస్తాయి. ఈ పత్రాలు లేని వారు తమ పౌరసత్వ నిర్ధారణకు సంబంధిత మున్సిపల్ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆశ్రయించాల్సి ఉంటుంది. అలాగే కేంద్రం ప్రభుత్వం జారీ చేసే ఆధార్ కార్డు సైతం పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదు. ఒక గుర్తింపు పత్రం మాత్రమే అని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే సంబంధ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది.
2019 డిసెంబరు 20వ తేదీన కేంద్రప్రభుత్వ విభాగమైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్.. ఎన్నార్సీ, సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్.. సీఏఏలకు సంబంధించిన పౌరుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తిచేస్తూ పలు ప్రశ్నలు, వాటికి సమాధానాలను ప్రచురించింది. వీటి ప్రకారం పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతానికి సంబంధించిన ఏ పత్రాన్నైనా ఇచ్చి పౌరసత్వాన్ని రుజువు చేసుకోవచ్చు. అయితే ఏ ఏ పత్రాలను అనుమతిస్తారన్న విషయంపై ఆయా శాఖలు నిర్ణయం తీసుకుంటాయి. వ్యక్తుల పౌరసత్వం అనేది 2009 నాటి ద సిటిజన్‌షిప్ రూల్స్ప్రకారం నిర్ణయిస్తారు. ఈ నిబంధనలు పౌరసత్వ చట్టం, 1955 ఆధారంగా ఉంటాయి. ఏతావాతా ప్రభుత్వ పరంగా పౌరసత్వం విషయంలో ఎలాంటి గందరగోళం లేదని అధికారులు చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం ఎన్నో అనుమానాలకు తావిచ్చారనడంలో సందేహం లేదు.
- Tags
- NTV Telugu
- story board
తాజావార్తలు
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!