దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డల్‌గా ఉన్నా.. హైదరాబాద్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఇక్కడ అపార్ట్మెంట్ల విషయంలో డిమాండ్ కు మించిన సప్లై కారణంగా స్లంప్ వచ్చింది. కానీ భూముల విలువ ఎక్కడా తగ్గలేదని మరోసారి నిరూపణ అయింది. హైదరాబాద్ అభివృద్ధి పరుగు ఇప్పట్లో ఆగదని పెట్టుబడిదారులు కూడా నమ్మకం పెట్టుకున్నారు. అందుకే కొత్తగా పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ఫోర్త్ సిటీ హైదరాబాద్ కు మరింత అడ్వాంటేజ్ అవుతుందనడంలో సందేహం లేదు.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు ఊరట ఇచ్చేలా భూములకు వేలంలో రికార్డు ధర పలికింది. రాయదుర్గంలో ఎకరా రూ.177 కోట్లకు పోవటం.. మార్కెట్లో కొత్త ఉత్సాహం నింపింది. తద్వారా హైదరాబాద్ లో భూముల విలువకు ఢోకా లేదని, ఇక్కడ బాగా డిమాండ్ ఉందని తేలిపోయింది.
ఎన్నో సహజ అనుకూలతలు ఉన్న నగరం హైదరాబాద్. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డల్ అయినా.. ఇక్కడ మాత్రం మెరుగ్గానే ఉంది. అయితే అపార్ట్మెంట్ల విషయంలో స్లంప్ కు ప్రత్యేక కారణాలున్నాయి. కొన్నేళ్లుగా డిమాండ్ కు మించి పెరిగిన నిర్మాణాలతోనే స్లంప్ వచ్చింది కానీ.. హైదరాబాద్ కు డిమాండే లేక కాదని ఇప్పుడు భూముల వేలంతో తేలిపోయింది. రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు వేలం వేస్తే.. కళ్లు చెదిరే రీతిలో రూ.177 కోట్ల ధర పలికింది. సాధారణ సమయంలో ఇంత ధర వస్తే పెద్ద ప్రత్యేకత ఏం లేదు. కానీ దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ డల్ అయిన పరిస్థితిలో కూడా హైదరాబాద్ భూముల విలువ తగ్గలేదని నిరూపణ కావటం.. ఇక్కడి మార్కెట్ కు కొత్త కిక్ ఇస్తుందనటంలో సందేహం లేదు.
పైగా ఇంత ధర పెట్టి కొన్నా లాభమే కానీ.. నష్టం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు రాయదుర్గం భూముల్లో 60 ఫ్లోర్ల నిర్మాణాలకు సర్కారు అనుమతి ఇస్తుంది. తద్వారా 3 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు వస్తాయి. నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3 వేలు వేసుకున్నా.. రూ.100 కోట్లు అవుతుంది. కానీ అమ్మకానికి వచ్చేసరికి చదరపు అడుగు రూ.15 వేల చొప్పున అమ్ముతారు. అప్పుడు రూ.450 కోట్లు వస్తాయి. ఏతావాతా లాభం రూ.173 కోట్లు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చెక్కుచెదరలేదని కేవలం భూముల విలువ విషయంలోనే కాదు.. పెట్టుబడుల అంశంలోనూ నిరూపణ అవుతూనే ఉంది. ఇప్పటికే దేశంలోకి వచ్చే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో ఎక్కువ భాగం హైదరాబాద్ కు వస్తున్నాయి. హైదరాబాద్‌లో 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది ప్రఖ్యాత ఎలి లిల్లీ సంస్థ. ప్లాంట్ అండ్ క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు. సీఎం రేవంత్‌రెడ్డితో ఎలి లిల్లీ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, ఆ సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. కాస్ట్ ఆఫ్ లివింగ్, అనుకూల వాతావరణం, నివాసయోగ్యత లాంటివి హైదరాబాద్ కు వరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఐటీ, ఫార్మా హబ్ గా ఉన్న హైదరాబాద్.. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా మారబోతోంది.హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తుండటంతో.. దేశం నలుమూలల నుంచి భాగ్యనగరానికి జనం తరలి వస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఐటీ రంగంలోనే 9 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన వారి సంఖ్య అంతకు రెట్టింపు ఉంటుంది. అభివృద్ధిలో, సంపద సృష్టిలో హైదరాబాద్ దూసుకెళ్తోంది అనే మాట విశ్వవ్యాప్తంగా మారింది. జీడీపీలో దేశంతో తెలంగాణ రాష్ట్రం పోటీపడి ముందడుగు వేసింది.
హైదరాబాద్ దినదినం అభివృద్ధి చెందుతోంది. గతంతో పోలిస్తే.. ఎన్నో మెరుగైన జీవన ప్రమాణాలు అందుబాటులోకి వచ్చాయి.. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందినవారు సైతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో టాప్ స్పాట్ లో నిలిచిన ఘనత కూడా హైదరాబాద్ కు ఉంది.
ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌ను తమ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనుకూల వాతావరణం ఉండటంతో నగరానికి ప్రపంచ స్థాయి కంపెనీలు భారీ పెట్టుబడులతో క్యూ కడుతున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన అమెజాన్.. హైదరాబాద్ కేంద్రంగా తమ అతి పెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. అంతేకాదు ఆపిల్, మెటా, క్వాల్కామ్, మైక్రాన్, నోవార్టిస్, మెడ్‌ట్రానిక్స్, ఉబెర్, సేల్స్‌ఫోర్స్, వన్‌ప్లస్, ఒప్పోతో పాటు మరిన్ని దిగ్గజ కంపెనీలు నగరంలో తమ రెండో అతి పెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయి.
హైదరాబాద్ నిజమైన ప్రపంచస్థాయి నగరంగా మారే క్రమంలో జీవ వైవిధ్యం అత్యంత కీలకమైన అంశంగా నిలుస్తోంది. జీవించు- జీవించనివ్వు అన్న స్ఫూర్తి ఆధారంగా నగరీకరణ జరిగినప్పుడే ప్రకృతితో మమేకమై బతకగలిగే పరిస్థితి ఉంటుంది. సరస్సుల నగరంగా పేరు పొందిన హైదరాబాద్‌లో ప్రస్తుతం దాదాపు రెండు వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న 1,350కి పైగా జల వనరులు, 1,600 హెక్టార్లలో విస్తరించిన సహజ రాళ్లగుట్టలు , రెండు జాతీయ పార్కులు నగరంలో జీవవైవిధ్యానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయి. దీంతోపాటు హైదరాబాద్ సెం ట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్రిశాట్ వంటి సంస్థలకు ఉన్న సువిశాలమైన క్యాంపస్‌లు జీవ వైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నాయి.
ఈ రోజు దేశం మొత్తం హైదరాబాద్ సిటీ వైపు చూస్తోంది. దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరం ఇది. దీనికి తోడు అన్ని వర్గాలవారూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ జీవించే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. హైదరాబాద్‌లో సగటున 10వేల రూపాయలతో నెలగడుపుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాతో పోల్చితే తాగునీటి సమస్య అతి తక్కువగా ఉన్న నగరం హైదరాబాద్. ఇంత అనుకూల వాతావరణం మరే నగరంలోనూ లేదు. మరో 25 ఏళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఢిల్లీలో విపరీతమైన ఎండ లేదా చలి ఉంటుంది. ముంబైలో విపరీతమైన కాలుష్యం సమస్యగా ఉంది. బెంగళూరు చిన్న నగరం కానీ జనాభా ఎక్కువ, భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఉంది. చెన్నైలో విపరీతమైన హ్యుమిడిటీ ఉంటుంది. కోల్‌కతా.. అత్యంత మురికి నగరాల్లో ఒకటి. కానీ హైదరాబాద్ కు చెప్పుకోదగ్గ సమస్యలేవీ లేవు. ఇలా ఏ రకంగా చూసినా హైదరాబాద్ మిగిలిన అన్ని మెట్రో నగరాలకంటే చాలా బెటర్.
కాలానుగుణంగా మారుతూ.. ఎందరు వచ్చినా అందర్నీ అక్కున చేర్చుకుంటూ.. అపార ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తోంది హైదరాబాద్. మొదట్లో పారిశ్రామిక నగరంగా ఉన్న హైదరాబాద్.. తర్వాత ఐటీ, ఫార్మా హబ్‌గా ఎదిగింది. ఆ తర్వాత హెల్త్ టూరిజంకు మార్గాలు తెరిచింది. ఇప్పుడు ఏఐలోనూ దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏ కొత్త వ్యాపార అవకాశం వచ్చినా.. అది కచ్చితంగా హైదరాబాద్ కు రావాల్సిందే. అసలు హైదరాబాద్ గురించి మన కంటే.. గ్లోబల్ మార్కెట్లోనే ఎక్కువ మాట్లాడుకుంటారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందుకే ఏటా అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. నిర్వాహకులు వారంతట వారే హైదరాబాద్ వచ్చి.. ఇక్కడి సర్కారును సంప్రదించి.. హైదరాబాద్ లో అన్ని అనుకూలతలు ఉన్నాయని.. తమ సమావేశాలు శాశ్వతంగా ఇక్కడే పెట్టుకోవటానికి అనుమతించాలని కోరుతుంటారు. అదీ హైదరాబాద్ ట్రేడ్ మార్క్.