Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు వందల సంవత్సరాల తర్వాత రామాలయం కొలువుదీరిందని ఓవైపు భక్తులో సంతోషపడుతుంటే.. మరోవైపు ఆలయంలో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. మొదట్లో నిధులు దారిమళ్లాయనే ఆరోపణలు వచ్చినప్పుడు.. వాటిని రాజకీయ ప్రేరేపితంగా కొట్టిపారేసే ప్రయత్నం జరిగింది. కానీ భక్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో.. యూపీ సర్కారు సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. మరోవైపు రాముడి పేరు చెప్పి.. పెద్ద మొత్తంలో సొమ్ము స్వాహా చేశారని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వచ్చే ఏడాది యూపీ ఎన్నికల తరుణంలో.. రామాలయంలో నిధుల గోల్మాల్ వ్యవహారం.. సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే సిట్ ప్రాథమిక విచారణలో వెలుగుచూసిన కొన్ని విషయాలు.. అందరికీ కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి.
రామజన్మభూమిలో రాముడి సొమ్ముకే దిక్కు లేకుండా పోయింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైన రామాలయంలో భక్తులు సమర్పించిన కానుకలకు కాళ్లొచ్చాయి. చివరకు సీసీ టీవీ ఫుటేజ్ కూడా ట్యాంపరింగ్ చేసి.. ఆధారాలు కూడా మాయం చేయాలని చూసిన ఇంటి దొంగల బాగోతం చూసి.. సిట్ అధికారులే అవాక్కవుతున్నారు.
Also Read
- Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
- Story Board: ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందా ?
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
వందల ఏళ్ల కల.. సాకరమైందన్న ఆనందం కొన్నాళ్లు కూడా నిలవలేదు. రాముడి తిరిగొచ్చాడంటూ.. దేశవ్యాప్తంగా జరిగిన సంబరాల గుర్తులు ఇంకా పూర్తిగా చెరిగిపోలేదు. అయోధ్య రామాలయానికి రోజూ పెరుగుతున్న భక్తుల తాకిడి చూసి.. పులకిస్తున్న మనసులు ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఇంతలోనే మహాపచారం జరిగిపోయింది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో సమర్పిస్తున్న విరాళాలు, కానుకలు మాయమయ్యాయన్న ఆరోపణలు అయోధ్యలో కలకలం రేపాయి. మొదట్లో ఇవి ఉట్టి ఆరోపణలే అని భావించిన వారు కూడా.. తర్వాత సర్కారు సిట్ దర్యాప్తుకు ఆదేశించడంతో అలర్ట్ అయ్యారు. చివరకు సిట్ ప్రాథమిక విచారణలోఅడుగుడగునా నిర్లక్ష్యం నిజమేనని బయటపడటం.. సీసీ టీవీ ఫుటేజ్‌లో మార్పులు.. అన్నీ కలిసి రామభక్తుల మనోభావాల్ని తీవ్రస్థాయిలో దెబ్బతీశాయి. ఎంతో నమ్మకంతో రాముడి ఆలయానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇచ్చిన విరాళాలు కొందరు స్వార్థపరుల చేతిలోకి వెళ్లిపోయాయని, ఆలయ వ్యవహారాలు చూసే ట్రస్టే.. కంచే చేను మేసిన చందంగా వ్యవహరిస్తోందని తెలిసి.. భక్తులు నిర్ఘాంతపోతున్నారు. ఇందుకోసమేనా రామాలయం కట్టింది..? ఈ బరితెగింపు చూడటానికేనా రాముడ్ని కొలువుతీర్చింది..? అని కోట్లాదిమంది భక్తులు నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నారు.
అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్లు వెల్లడయ్యింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం విరాళాల సొమ్ము చోరీకి గురైనట్లు బలమైన ఆధారాలను కనుగొంది. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను త్వరలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సిట్ సమర్పించనుంది. గడిచిన ఆరు రోజులుగా అయోధ్యలో సిట్ బృందం ముమ్మరంగా విచారణ జరిపింది. ఆలయ హుండీల నుంచి సేకరించిన నగదును లెక్కించే సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌పై చేతివాటం ప్రదర్శించినట్లు దర్యాప్తులో తేలింది. కొన్ని కీలకమైన సీసీటీవీ దృశ్యాలను కావాలనే డిలీట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు సమర్పించిన బంగారం, వెండి, వజ్రాభరణాలను నకిలీ వాటితో మార్చేసారనే ఆరోపణలపై సిట్ లోతుగా విచారించింది. నిర్లక్ష్యంతో పాటు దీని వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందనే దిశగా అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.
ఈ భారీ అక్రమాలకు సంబంధించి సిట్ ఇప్పటివరకు ట్రస్ట్ అధికారులు, మేనేజ్మెంట్ సిబ్బంది, బ్యాంక్ ఉద్యోగులతో సహా దాదాపు 150 మందిని ప్రశ్నించింది. ట్రస్ట్ కార్యనిర్వాహకుడు అనిల్ మిశ్రా, కన్స్ట్రక్షన్ ఎయిడ్ గోపాల్ రావు పాత్రలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కూడా ప్రస్తుతం నిఘా నీడలో ఉన్నారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ఎస్బీఐ, టీసీఎస్లకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తిన్ను యాదవ్ అనే వ్యక్తితో పాటు కొందరు బ్యాంక్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ట్రస్ట్‌కు చెందిన కీలక అధికారులు దర్యాప్తు పూర్తయ్యే వరకు అయోధ్య విడిచి వెళ్లకూడదని సిట్ ఆదేశించింది. ఆలయ నిర్వహణలో పారదర్శకత కోసం కాశీ విశ్వనాథ్ ఆలయం తరహాలోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను నియమించాలని, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణను పెంచాలని సిట్ సూచించనుంది. అలాగే విరాళాల లెక్కింపునకు బ్యాంకులు కేవలం రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే నియమించాలని, క్రమం తప్పకుండా ఆడిటింగ్ నిర్వహించాలని నివేదికలో సిఫార్సు చేయనున్నట్లు చెబుతున్నారు.
కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామ మందిరం ప్రతిష్ట విరాళాల కుంభకోణంతో అభాసుపాలవుతోంది. రామరామా ఏమిటీ అక్రమాలని భక్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరానికి సంబంధించిన విరాళాల అక్రమాల పుట్టను తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించే నగదు, బంగారం, వెండి, ఇతర ఖరీదైన విరాళాలు అక్రమార్కుల భోజ్యం అయినట్టు దర్యాప్తు సంస్థ గుర్తించింది. ముఖ్యంగా ఇంత ప్రతిష్టాత్మకమైన పెద్ద ఆలయ నిర్వహణలో ముఖ్య విభాగాలు నిర్వహించే అధికారులు, ఉద్యోగులకు జవాబుదారీతనం లేకపోవడం, వారిపై పర్యవేక్షణ, నిఘా లోపించడం, సీసీటీవీ ఫుటేజీలు అదృశ్యం కావడం దర్యాప్తు సంస్థను ఆశ్చర్యపరిచింది.
మరోవైపు రామ మందిర విరాళాలు దుర్వినియోగం అయినట్లు వచ్చిన ఆరోపణలు సంఘ్ పరివార్‌లో ఆందోళనలు పెంచాయి. పలువురు బీజేపీ నాయకులు సైతం ఆలయ నిధుల దుర్వినియోగంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశారు. విరాళాల చోరీపై మనోభావాలు దెబ్బతిన్న కోట్లాది మంది భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ మందిరానికి వచ్చిన విరాళాల్లో కోట్ల రూపాయలు మాయమయ్యాయంటూ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించడంతో ఈ వివాదం ఈ నెల మొదట్లో తెరపైకి వచ్చింది. కాగా, దీంతో ఈ ఆరోపణలనూ దర్యాప్తు చేసేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నెల 13న ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.
అయోధ్య మందిర విరాళాల కుంభకోణంపై దర్యాప్తు జరిపిన సిట్ తన ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు సమర్పించిందని చెబుతున్నారు. అవకతకవలకు బాధ్యులైన పలువురిని గుర్తించిన సిట్ వారి గురించి తన నివేదికలో నివేదించింది. గత ఆరు రోజులుగా జరిపిన దర్యాప్తు గురించి ముఖ్యమంత్రికి వివరించింది. అయోధ్య మందిర విరాళాల కుంభకోణంపై దర్యాప్తు జరిపిన సిట్ ఇప్పటివరకు 150 మంది అనుమానితులను గుర్తించింది. వీరిలో 25 మంది నేరుగా ప్రత్యక్ష విచారణను ఎదుర్కొనే అవకాశం ఉంది. సిట్ బృందం ఇప్పటికే సిబ్బంది నియామకం, రికార్డుల నిర్వహణను నిశితంగా పరిశీలించడంతో పాటు దీర్ఘకాలంగా విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఉద్యోగుల వివరాలను సేకరించింది. ఆర్థిక రికార్డులు ఎలా నిర్వహిస్తున్నది, విరాళాలు, ఖరీదైన వస్తువులను ఎలా నిర్వహస్తున్నది అధికారులను ప్రశ్నించింది. కాగా, శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనీల్ మిశ్రా, రామ మందిర నిర్మాణ ఇన్చార్జి గోపాల్ రావులను సిట్ ఆలయ ప్రాంగణంలో ఆరు గంటల పాటు విస్తృతంగా ప్రశ్నించింది. ఐదుగురు ప్రధాన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సిట్ ఇప్పటికే రూ.2 కోట్లను స్వాధీనం చేసుకుంది. వీరు ప్రధానంగా విరాళాల లెక్కింపు సమయంలో ఈ అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించింది. వారిలో ఒక వ్యక్తి ఇంటి నుంచి బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంది.
అయోధ్యలోని రామ మందిరానికి అందిన విరాళాలు దుర్వినియోగం అయినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ముగ్గురు సభ్యుల సిట్ బృందానికి రామ మందిరానికి, విరాళాల లెక్కింపు గదికి చెందిన సీసీ ఫుటేజీ పరిమిత కాలానికి మాత్రమే లభ్యం కావడం ఆటంకంగా మారింది. ఆలయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం సీసీ కెమెరాల ఫుటేజీ 45 రోజులది మాత్రమే లభ్యమవుతుంది. 45 రోజులు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. కాగా, లభ్యమైన ఫుటేజీ కూడా అనధికారికంగా మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని సిట్ అనుమానిస్తోంది. సుమారు 8 నెలల సీసీటీవీ ఫుటేజీను పూర్తిగా తుడిచిపెట్టేసినట్టు దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం కూడా గుర్తించింది.
అయోధ్య రామ మందిర విరాళాల కుంభకోణంలో ప్రముఖుల ప్రమేయం ఉందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వారి పేర్లను బయటపెట్టకపోతే ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉందని ఆయన జోస్యం చెబుతున్నారు.
మరోవైపు విరాళాల్లో తీవ్ర దుర్వినియోగం వచ్చిందని ఆరోపణలు రావడం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యలో మార్పు లేనప్పటికీ విరాళాలు మొత్తం భారీగా తగ్గిపోయాయి. ఆలయానికి ప్రతి రోజూ రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వచ్చే ఆదాయం లక్ష లోపు పడిపోయింది.
అయోధ్య విరాళాలపై ఏర్పడిన వివాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. ప్రజలు 15 రోజులు ఆగాలని కోరారు. నిధుల దుర్వినియోగానికి బాధ్యులు ఎవరైనా, ఎంతటివారైనా వదిలిపెట్టబోమంటూ హామీనిచ్చారు. ఈ సందర్భంగా విపక్షాలైన సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌ల ద్వంద్వ వైఖరిని, శ్రీరాముని ఉనికిని ప్రశ్నించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. రామ భక్తులపై, జై శ్రీరామ్ నినాదాలు చేసిన వారిపై కాల్పులు, లాఠీచార్జి చేయించిన సమాజ్‌వాది పార్టీ ఇప్పుడు తనను తాను రామభక్తులుగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. సిట్ దర్యాప్తు అన్ని నిజాలను వెలికి తీస్తుందని యోగి భరోసా ఇచ్చారు.
అయోధ్య రామాలయంలో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగాయన్న వివాదం రాజకీయంగా వేడెక్కడంతో రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్, ప్రధాని మోడీ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా ఇప్పుడు ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నిధుల కుంభకోణానికి సంబంధించి మీడియా ఆయనను తొలుత ప్రశ్నించినప్పుడు ‘ఆలయ నిర్మాణ పనుల పర్యవేక్షణ మాత్రమే నా బాధ్యత తప్ప మరే ఇతర వాటితో నాకు సంబంధం లేదు’ అని పేర్కొన్నారు. అయితే విమర్శలు ఎక్కువ కావడం, దర్యాప్తు తీవ్రత పెరుగడంతో పర్యవేక్షణ, జవాబుదారీతనంలో ఉన్న లోపాలను ఈ వివాదం బయటపెట్టిందని ఆయన అంగీకరించారు. అంతేకాకుండా ఎటువంటి అధికారిక కార్యక్రమాలు నిర్దేశం జరుగకుండానే పలు ముఖ్యమైన కార్యక్రమాలు వలంటీర్ల చేతుల మీదుగానే జవాబుదారీతనం లేకుండా జరుగుతున్నాయని వెల్లడించారు. ఏతావాతా ఆలయానికి వచ్చిన విరాళాలకు భద్రత కల్పించడంలో అలవిమాలిన నిర్లక్ష్యం.. అంతిమంగా రాముడి పరువు తీసిందనే చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
IPL Player: బిగ్‌షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్‌పై పోలీస్ కేసు..
-
Vasudeva Sutham: దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తే భూమ్మీద బతికే హక్కు లేదు!
-
Ram Charan: ‘నా కూతురు క్లిం కారా నన్ను పెద్ది అంటోంది’.. ‘పెద్ది’ సక్సెస్ మీట్లో రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్!
ట్రెండింగ్
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!