Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్నటి వరకు కరవు రూపంలో ఎల్‌నినో దెబ్బతీస్తే.. ఇప్పుడు అర్నబ్ తుఫాన్ ముంచెత్తి ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని, సామాన్యులను కోలుకోలేని దెబ్బతీసింది. బాపట్ల నుంచి ఉత్తరాంధ్ర వరకు ఎటు చూసినా నేలపాలైన అన్నదాతల కష్టాలు, నీటిపాలైన సామాన్యుల వెతలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ప్రకృతి ప్రకోపం నుంచి జనజీవనం సాధారణ స్థితికి రావడం… మౌలిక వసతుల పునరుద్ధరణ సవాలేనా? ఎంత నష్టం వాటిల్లింది..ఎంత కష్టం వచ్చిపడింది? బయటపడే యాక్షన్ పట్టాలెక్కిందా? అర్నబ్ తుఫాన్ రైతులకు మరింత క్షోభను మిగిల్చింది. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో సుమారు 3 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతినగా, కోతకు వచ్చిన వరి పంట నేలపాలైంది. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, బాపట్ల జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోనూ వరి, అరటి, పత్తి, జీడిమామిడి తోటలు నీటమునిగాయి. కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట నీటిపాలవడంతో అన్నదాతల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైంది.
ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ బీభత్సం మాటలకు అందడం లేదు. అపార నష్టం అంచనాకు చిక్కడం లేదు. విరుచుకుపడిన ప్రచండ గాలులు..నేలపాలైన పంట పొలాలు…నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు..కూలిన చెట్లు…ముక్కలైన మత్స్యకార బోట్లు…కుండపోత వర్షాలతో జలమయమైన రహదారులు…రైతన్నకు మిగిలిన కడగండ్లు…తెగిపోయిన విద్యుత్ సరఫరా…నిలిచిపోయిన రవాణా వ్యవస్థ…స్తంభించిన జనజీవనం…బాపట్ల నుంచి ఉత్తరాంధ్ర వరకు ఎటు చూసినా విలయ విధ్వంసమే. ప్రభుత్వ లెక్కల ప్రకారం అర్నబ్ తుఫాన్‌తో రాష్ట్రానికి వాటిల్లిన నష్టం ప్రాథమికంగా 4,563 కోట్లు. ఇది కేవలం వాతావరణ విపత్తు మాత్రమే కాదు. సముద్రాన్ని నమ్ముకుని బతికే మత్స్యకారుడి నుంచి, నేలను నమ్ముకుని పంట పండించే రైతు వరకు.. రహదారులపై ఆధారపడే సామాన్యుడి నుంచి, విద్యుత్, రవాణా వ్యవస్థలను నిర్వహించే యంత్రాంగం వరకు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసిన ప్రకృతి ప్రకోపం. ఏడుగురికి పైగా ప్రాణాలు తీసిన బీభత్సం. తీరం దాటుతూ పెను విలయంగా విరుచుకుపడిన అర్నబ్ తుపాను మిగిల్చిన ఆస్తి, పంట నష్టాల లెక్కలు తేలేకొద్దీ రాష్ట్ర ఖజానా కళ్లు తేలేస్తోంది. పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందో, మౌలిక వసతుల మరమ్మతులకు ఎంత ఖర్చవుతుందో ఊహకు అందడం లేదు.
Also Read
- Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
- Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
- Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
మొన్నటి వరకు ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక అల్లాడారు అన్నదాతలు. అప్పులు చేసి అరకొర సేద్యానికి దిగి ఈ ఏడాది గట్టెక్కుదాం అనుకున్నారు. కానీ అర్నబ్ ఆ చిన్న ఆశలపైనా తుపాను రూపంలో విరుచుకుపడింది. అధిక వేగంతో వీచిన గాలులకు చాలాచోట్ల కోతదశలోని వరి నేలవాలింది. పొలంలోకి వచ్చిన నీరు త్వరగా బయటకు వెళ్లకపోతే మొలకలొస్తాయనే ఆందోళన రైతుల్ని కలవరపెడుతోంది. 33వేల కొబ్బరిచెట్లు పడిపోయినట్లు ప్రాథమిక లెక్కలు చెబుతున్నాయి. అరటితోటలు నేలమట్టం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 249 మండలాల్లోని 2,727 గ్రామాల్లో.. 3.25 లక్షల హెక్టార్లలోని వ్యవసాయ పంటలపై అర్నబ్ తుఫాన్ ప్రభావం చూపింది. అందులో 16 జిల్లాల్లో 3.04 లక్షల హెక్టార్లలోని వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనా. అత్యధికంగా 2.10 లక్షల హెక్టార్లలో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది.
అతి తీవ్ర తుఫాన్ దెబ్బకు ఉభయ గోదావరి జిల్లాల రైతులు నిండా మునిగిపోయారు. పశ్చిమగోదావరి జిల్లాలో 74,175, కాకినాడ జిల్లాలో 50,993, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 48,449, తూర్పుగోదావరి 42,635 హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. వరి నారుమళ్లు, మొక్కజొన్న, పెసర, మినుము, వేరుశనగ పంటలు పాడయ్యాయి. ప్రకృతి అందాలకు నెలవైన అంబేద్కర్ కోనసీమ..తుఫాన్ దెబ్బకు కకావికలమైంది. రోడ్ల పొడవునా పడిపోయిన వృక్షాలు, వేలాడుతున్న విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాలు, తోటల్లో నేలకొరిగిన కొబ్బరి చెట్లే దర్శనమిస్తున్నాయి. కొబ్బరిచెట్ల మొవ్వు మెలితిరగడంతో అవి కోలుకోవడానికి కొన్నేళ్లు పడుతుందని రైతులు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 46,500 కొబ్బరిచెట్లు దెబ్బతినగా, 8వేల హెక్టార్లలో అరటి పంట నేలపాలైందని అంచనా.
ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తీతకు సిద్ధంగా ఉన్న పత్తి తడిచింది. కృష్ణా జిల్లాలో 40,141, బాపట్ల జిల్లాలో 21,927 హెక్టార్ల పంట నేలవాలింది. ఇక ఉద్యాన పంటల నష్టం అంతాఇంతా కాదు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో 12,899 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించారు. 25,914 మంది రైతులకు చెందిన అరటి, బొప్పాయి, కొబ్బరి, కూరగాయ పంటలు, తమలపాకు తోటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా అరటి 8,471 హెక్టార్లు, కూరగాయల పంటలు 2,628, పసుపు 431, బొప్పాయి 376, కొబ్బరి 277 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలో అరటి పంట నష్టం అంతాఇంతా కాదు.
కాకినాడ జిల్లాలో అర్నబ్ తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సాగునీటి కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. దాంతో పంట పొలాల్లోకి వరద నీరు వెళ్తోంది. దాంతో రైతులు పూడికలు తీస్తున్నారు. వరద నీరు పోయేలా చేసి, పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అర్నబ్ తుఫాన్ కృష్ణా జిల్లా రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ప్రధానంగా అవనిగడ్డ నియోజకవర్గంలో పంట నష్టం తీవ్రంగా ఉంది. ప్రత్యామ్నాయ పంటలుగా అరటి, కందని వందల ఎకరాల్లో పండించిన రైతులకు నిరాశే మిగిలింది. భీకర గాలులకు, వర్షానికి కంద పంట మునిగింది. ఒక్కో ఎకరానికి రెండు లక్షల రూపాయల వరకు పెట్టిన పెట్టుబడి నేలపాలైంది.
ఉత్తరాంధ్ర రైతులను సైతం అర్నబ్ తుఫాను నష్టాలపాలు చేసింది. అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో జీడి తోటలు ధ్వంసమయ్యాయి. కోట్నిబెల్లి, జెడ్. బెన్నవరం, డోలవానిపాలెం, గదభపాలెం, రామన్న దొరపాలెం గ్రామాల్లో భారీ ఈదురుగాలులకు జీడి మామిడి చెట్లు నేలకు ఒరిగాయి. కోట్నిబెల్లిలోని జీడి మామిడి తోటలో పలువురు రైతులు నిరసన తెలిపారు. అధికారులు తమ తోటలను పరిశీలించి, నష్ట పరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది అర్నబ్ తుఫాన్. వందల ఎకరాల్లో వరి పంట నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వడ్డాది, బంగారు మెట్ట, LBP ఆగ్రహరంలో వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పొట్ట దశలో ఉండగా వరద నీరు చేరడంతో వరి కుళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. విజయనగరం జిల్లాలోని రైతు కుటుంబాల్లో ఈ వర్షాలు చేదునే మిగిల్చాయి. పొట్ట దశలో ఉన్న పంట నీటమునిగింది. నీటి ప్రవాహంతో వరి పంట నేలమట్టమైపోయింది. శ్రీకాకుళం జిల్లాలోని వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఆరుగాలం శ్రమించిన పంట నీట మునగడంతో రైతులకు కన్నీరే మిగిలింది.
ఇలా చెప్పుకుంటూపోతే ఆంధ్రప్రదేశ్ కర్షకుల ఆవేదన కట్టలు తెగుతూనే వుంది. అటు కేంద్రానికి నివేదిక పంపేందుకు పంటల నష్టం లెక్కలు తేల్చే పనిలో వుంది ప్రభుత్వం. ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. వరద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు సీఎం. పంట నష్టపరిహారం అందజేస్తామని..సురక్షిత ప్రాంతాల నుంచి తిరిగి ఇళ్లకు చేరే వారికి 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందజేస్తామని తుఫాన్‌తో రైతులకు వాటిల్లిన పంట నష్టాన్ని కూటమి ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందని జగన్ ఆరోపించారు. నష్టం నుంచి రైతులు ఇంకా కోలుకోకముందే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పంట నష్టం అంచనాలు, విద్యుత్ పునరుద్ధరణ, సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అధికార పక్షం ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా వున్నా…ఏపీ రైతాంగంపై అర్నబ్ రూపంలో పిడుగు పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే నష్టాల లెక్కలు తీసి, వెంటనే ఆదుకోవాలి. మౌలిక వసతులను సైతం పునరుద్దరించాలి. తుఫాన్ నుంచి త్వరగా కోలుకునేలా చర్యలుండాలని జనం కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!