Story Board: తెలంగాణలో నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. మూడు రోజుల్లో దాదాపు రూ.వెయ్యి కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ శాఖ అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2024 డిసెంబర్ నెల చివరి మూడు రోజుల్లో రూ.736 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరగ్గా…. 2025 డిసెంబర్ చివరి మూడు రోజుల్లో రూ.980 కోట్లకుపైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ చెబుతోంది. నూతన మద్యం విధానంలో భాగంగా కొత్తగా లైసెన్స్‌లు పొందిన దుకాణదారులు డిసెంబర్ నుంచి మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 3,620 మద్యం దుకాణాలు, దాదాపు 1,100 బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు కలిసి డిసెంబర్ నెలలో రూ.4,920 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి కొనుగోలు చేశారు. డిసెంబరు 25 నుంచి 31 వరకు మద్యం విక్రయాలు విలువ రూ.1,350 కోట్లకుపైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబరు 29న రూ.280 కోట్లు, 30న రూ.380 కోట్లు, 31న రూ.315 కోట్లకుపైగా విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే దాదాపు రూ.1000 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మొత్తం 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి.
తెలంగాణలో మద్యం అమ్మకాలు ఆల్ టైం రికార్డును సృష్టించాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే రూ. 5 వేల కోట్ల సేల్స్ మార్కును దాటేసింది. సాధారణంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లో అమ్మకాలు పెరగడం సహజమే. అయితే ఈ స్థాయిలో సేల్స్ ఎప్పుడూ కాలేదని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. కొత్త మద్యం పాలసీ కూడా డిసెంబర్‌లోనే మొదలు కావడంతో డిపోల నుంచి ఎప్పటికప్పుడు స్టాక్ బయటకు వెళ్లడంతో ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది.. భారీగా ఆదాయం వచ్చింది. అంతకు ముందు మద్యం పాలసీ మొదలైన 2023 డిసెంబర్‌లో కూడా రూ.4,291 కోట్లు వచ్చాయి. క్షణం తీరిక లేకుండా కౌంటర్లు నడవడంతో కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యువత, మద్యంప్రియులు పెద్ద ఎత్తున పార్టీలు చేసుకోవడంతో బీర్లు, విస్కీలు, ప్రీమియం బ్రాండ్ల సేల్స్ ఆకాశాన్ని తాకాయి. 28న రూ.182 కోట్లు, 29న రూ.282 కోట్లు, 30న రూ.375 కోట్లు, 31న రూ.400 కోట్ల పైచిలుకు విలువైన మద్యం డిపోల నుంచి వైన్ షాప్‌లకు చేరింది. ప్రభుత్వం అర్ధరాత్రి దాకా మద్యం అమ్మకాలకు అనుమతులతోపాటు 31 రాత్రి ప్రత్యేక ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వడంతో సేల్స్ అమాంతం పెరిగాయి.
ఈసారి డిసెంబర్ నెలలో అమ్మకాలు ఈ స్థాయిలో పెరగడానికి న్యూ ఇయర్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికలు కారణమయ్యాయి. పల్లెల్లో పోరు రసవత్తరంగా సాగడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్యాన్ని నీళ్లలా ఖర్చు చేయడంతో సేల్స్ పెరిగిపోయాయి. నామినేషన్ల ఘట్టం నుంచి ఫలితాలు వచ్చే వరకు గ్రామాల్లో విందులు, వినోదాలు జోరుగా సాగడం, దావత్‌ల పేరుతో భారీగా మద్యం కొనుగోలు చేయడంతో మద్యం డిపోలు వెంటవెంటనే ఖాళీ అయ్యాయి. రాజకీయ వేడికి మందు కిక్కు తోడవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో డిసెంబర్ నెల మొత్తం పండుగ వాతావరణమే కనిపించింది. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని రికార్డుస్థాయికి చేర్చింది. కొత్తగా లైసెన్సులు దక్కించుకున్న వ్యాపారులు.. షాపుల్లో ఎలాంటి కొరత రాకూడదనే ఉద్దేశంతో డిపోల నుంచి పరిమితికి మించి సరుకును లిఫ్ట్ చేశారు. తెచ్చిన స్టాక్ ఎప్పటికప్పుడు అయిపోవడంతో జోష్ మీదున్నారు.
కొత్త ఏడాది మందుబాబులకు కిక్కు ఇచ్చింది. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ మద్యం ప్రియులు ఫూటుగా తాగేశారు. డిసెంబర్ 31న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మధ్యాహ్నం నుంచే మందుబాబులు దుకాణాల దగ్గర బారులు తీరారు. గతేడాది కంటే అధికంగా లిక్కర్ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. గతేడాది ఒక్క డిసెంబర్ నెలలో రూ.3,805 కోట్లు విలువైన 38.07లక్షల కేసుల లిక్కర్, 45.09 లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. కానీ, ఈసారి రూ.5 వేల కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయింది. దక్షిణాదిలో మద్యం వినియోగంలో తెలంగాణ టాప్ లో నిలిచినట్లు ఎక్సైజ్ అంచనాల్లో తేలింది. రాష్ట్రాల వారీగా ఒక ఏడాదిలో అమ్ముడైన మొత్తం మద్యం పరిమాణాన్ని, ఆయా రాష్ట్రాల జనాభాతో భాగించి తలసరి మద్యం వినియోగాన్ని లెక్కించగా.. తెలంగాణ మొదటి స్థానంలో నిలిచినట్లు తేలింది. సగటున తెలంగాణలో ఏడాదికి 4.44 లీటర్ల ఆల్కహాల్ వినియోగిస్తున్నట్లు అంచనాలు వెల్లడించాయి. ఈ జాబితాలో రెండో స్థానంలో కర్ణాటక ఉంది. అక్కడ తలసరి వినియోగం 4.25 లీటర్లు. ఆ తర్వాత తమిళనాడు 3.38 లీటర్లు, ఆంధ్రప్రదేశ్ 2.71 లీటర్లు, కేరళ 2.53 లీటర్లు వినియోగంతో వరుసగా నిలిచాయి.
మద్యం వినియోగం మాత్రమే కాకుండా, ఖర్చు విషయంలోనూ తెలంగాణ ముందంజలోనే ఉంది. తెలంగాణలో మద్యం కోసం సగటున ఏడాదికి రూ.11,351 వెచ్చిస్తున్నట్లు ఎక్సైజ్ అంచనాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఖర్చు రూ.6,399గా నమోదైంది. తెలంగాణలో మద్యం విక్రయాల పెరుగుదలకు.. పలు అంశాలు కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ వంటి మెట్రో నగరంతో పాటు జిల్లా కేంద్రాలు, మండల స్థాయిలో కూడా మద్యం దుకాణాల విస్తృతి ఎక్కువగా ఉండటం వినియోగాన్ని ప్రభావితం చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా భారీ ఆదాయం లభిస్తోంది. ఎక్సైజ్ శాఖకు వచ్చే ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ఆదాయం ఉపయోగపడుతుండటంతో ప్రభుత్వాలు మద్యం విధానాలపై సమతుల్య నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణలో లిక్కర్ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో అంటే 2015-6లో మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్‌శాఖకు రూ.12,706 కోట్ల ఆదాయం వస్తే.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది కాస్తా రూ.34,600 కోట్లకు చేరింది. అంటే తొమ్మిదేళ్లలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో మద్యం విపరీతంగా అమ్ముడైంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే లిక్కర్సేల్స్ అదనంగా 7 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది ఎక్సైజ్ శాఖకు పన్నుల రూపంలో రూ.7వేల కోట్లు వచ్చాయి. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో ఇదే మేజర్‌షేర్. కాగా, గతేడాది దరఖాస్తుల ద్వారా వచ్చిన రూ.2640 కోట్లు ఈ సారి లేకపోవడంతో, కేవలం అమ్మకాల ద్వారానే ఈ ఆదాయం సాధ్యమైందని అధికారులు వివరించారు. పండుగలు, సీజన్లలో డిమాండ్ ఎక్కువ ఉండటంతో సేల్స్ పెరుగుతున్నాయి. అంతే కాకుండా ధరలు పెరిగినా లిక్కర్ కొనేవాళ్ల సంఖ్య తగ్గలేదు. 2014 నుండి మద్యం అమ్మకాలు స్థిరమైన పెరుగుదల ధోరణిని కనబరుస్తున్నాయి, COVID-19 కారణంగా 2020-21లో స్వల్ప తగ్గుదల మినహా మిగతా సంవత్సరాలన్నింటిలో లిక్కర్ సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో అత్యధికంగా పురుషులు మద్యం సేవించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక్కడ 41 శాతం మంది పురుషులు మద్యం తాగుతారని గణాంకాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు మునుపెన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయికి చేరాయి. కొత్త ఏడాది వేడుకల తరుణంలో ప్రభుత్వం విక్రయ సమయాన్ని పొడిగించడం, మద్యం లభ్యత పెరగడంతో డిసెంబర్ నెలాఖరున అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.543 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఈసారి మద్యం అమ్మకాలు 8 శాతం వృద్ధిని కనబరిచాయి. డిసెంబర్ నెల మొత్తం మీద రాష్ట్ర ఖజానాకు మద్యం ద్వారా రూ.2,767 కోట్ల ఆదాయం సమకూరింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ 28 నుంచి 31 రాత్రి జనవరి 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద భారీగా జనసందోహం కనిపించింది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ మద్యం విక్రయాలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి.న్యూయర్ వేడుకలకు ముందు నుంచే మద్యం కొనుగోళ్లకు ప్రజలు ఎగబడ్డారు. ప్రత్యేకంగా బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ వంటి మద్యం రకాలపై డిమాండ్ భారీగా నమోదైంది. అనేక ప్రాంతాల్లో రాత్రి ఆలస్యమైనా కూడా మద్యం దుకాణాల ముందు క్యూ లైన్లు కనిపించాయి.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో మద్యం విక్రయాలు సాగగా, నిబంధనల ప్రకారం ముందస్తు బుకింగ్‌లతో పాటు కౌంటర్ల వద్ద విక్రయాలు నిర్వహించారు. పర్యాటక కేంద్రాలు, నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో కూడా మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో మద్యం విక్రయాలు సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపుగా జరిగాయి. రోజు వారీ సేల్స్‌తో పోలిస్తే, కొత్త సంవత్సరం వేడుకలలో దాదాపు రెట్టింపు అమ్మకాలు నమోదయ్యాయి.విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రత్యేకంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది న్యూయర్ వేడుకల్లో గత సంవత్సరంతో పోలిస్తే మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. దీనితో రాష్ట్ర ఖజానాకు గణనీయమైన ఆదాయం సమకూరినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించాలన్న ఉత్సాహంతో ప్రజలు వేడుకల్లో పాల్గొనగా, మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో 2025 డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అధికారిక గణాంకాల ప్రకారం డిసెంబర్ 1 నుంచి 31 వరకు మొత్తం మద్యం అమ్మకాలు సుమారు రూ. 2,767 కోట్లు గా నమోదయ్యాయి. 2024 డిసెంబర్ లో ఇవి రూ. 2,568 కోట్లు ఉండగా, ఈసారి సుమారు 8 శాతం వృద్ధి నమోదైంది. ప్రత్యేకంగా డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో అమ్మకాలు భారీగా జరిగాయి. ఈ మూడు రోజుల్లో మాత్రమే 2025లో సుమారు రూ. 543 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదే కాలంలో 2024లో అమ్మకాలు రూ. 336 కోట్లు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌కు మద్యం నుండి వచ్చే ఎక్సైజ్ ఆదాయం ప్రధాన ఆదాయ వనరు, అక్టోబర్ 2024 నుంచి 2025 డిసెంబర్ మధ్యకాలంలో ఏపీలో లిక్కర్ అమ్మకాలు.. రూ. 7 వేల కోట్లను అధిగమించాయి. బీర్ అమ్మకాలు సంవత్సరానికి సుమారు 95% పెరిగాయి. ఏపీలో మద్యం అమ్మకాల ఆదాయం వార్షిక రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 10% ఉంటుంది. దక్షిణాదిన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మద్యం మార్కెట్‌గా ఏపీని చెబుతారు. ఏపీలో దాదాపు 11.5% జనాభా మద్యం సేవిస్తున్నారు, ఇది జాతీయ సగటు 9.9% కంటే ఎక్కువ. గతంలో రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకల సమయంలో రోజుకు రూ.150 కోట్ల లోపే అమ్మకాలు జరిగాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా రోజుకు సగటున రూ.180 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ సగటున రూ.85కోట్ల అమ్మకాలు జరుగుతాయి. నూతన సంవత్సరం సందర్భంగా దీనికి రెట్టింపు కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. 6.73 లక్షల కేసుల లిక్కర్, 2.95 లక్షల కేసుల బీర్‌ను మందుబాబులు తాగేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో రూ.2,2983 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2024-25తో పోలిస్తే ఇది 1.79శాతం ఎక్కువ. మద్యం షాపుల విక్రయాల్లో లిక్కర్ 277 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, బార్లలోని అమ్మకాల్లో 69 శాతం అమ్మకాలు పడిపోయాయి. బీర్ అమ్మకాలు షాపుల్లో 521 శాతం పెరగ్గా, బార్లలో 60 శాతం తగ్గాయి.
డిసెంబరు నెలలో అమ్మకాలు భారీగా పెరిగాయి. 2024తో పోలిస్తే ఆ నెలలో విలువ పరంగా చూసినా 7.75 శాతం అమ్మకాలు పెరిగాయి. 2024లో చివరి నాలుగు రోజుల కంటే 2025లో చివరి నాలుగు రోజుల్లో ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు 11.5శాతం, బీరు విక్రయాలు 34.4 శాతం పెరిగాయి. తద్వారా రూ.140.48 కోట్ల అధిక రాబడి వచ్చింది. ఇక 2024 డిసెంబర్‌తో పోలిస్తే 2025 డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. 2024 డిసెంబర్‌లో మొత్తం 33,88,275 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 11,25,050 బీరు కేసులు విక్రయించారు. వాటి విలువ రూ.2,568.18 కోట్లు. కాగా 2025 డిసెంబర్‌లో మొత్తం 37,79,446 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 15,11,633 బీరు కేసులు విక్రయించారు. వాటి విలువ రూ.2,767.08కోట్లు. డిసెంబర్‌లో మొత్తం 178.6 కోట్ల మద్యం అమ్మకాల్లో విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. రూ.169.4కోట్ల మద్యం అమ్మకాలతో తిరుపతి జిల్లా రెండోస్థానంలో, రూ.155.4కోట్ల మద్యం అమ్మకాలతో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలకు వచ్చే ఏ ఆదాయం అయినా పడిపోవచ్చేమో కానీ.. మద్యంపై వచ్చే ఆదాయం మాత్రం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా.. మద్యంపై ఆదాయానికి ఢోకా లేదనే భరోసాతో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయంటే నమ్మాల్సిందే. పొరపాటున మద్యనిషేధం పెడితే మందుబాబులు ఎంత ఇబ్బంది పడతారో తెలియదు కానీ.. సర్కారుకి మాత్రం ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతోంది. మద్యం అమ్మకాలు ఈ రేంజ్ లో పెరుగుతుంటేనే.. అప్పుడప్పూడూ నిధులకు కటకట తప్పడం లేదు. అలాంటిది అసలా ఆదాయమే లేకపోతే అనే విషయం ఊహించడానికి కూడా ప్రభుత్వాలకు ఇష్టం ఉండదు. అదేమంటే మద్యంపై ఆదాయం మాకోసమా.. జనానికే ఖర్చు చేస్తున్నాం కదా అనే రొటీన్ డైలాగ్ రెడీగా ఉంటోంది.
మద్యపానం మంచిది కాదని ఓవైపు ప్రచారం చేస్తూ.. మరోవైపు అదే మద్యంపై వచ్చే ఆదాయంతో ప్రభుత్వం నడవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాష్ట్రాల ఆదాయంలో ఎక్కువ శాతం మద్యం డబ్బే అంటే.. ఇక బడ్జెట్ ను లిక్కర్ బడ్జెట్ అనడానికి ఆలోచించాల్సిన పనేముందనేది మరో ప్రశ్న. ఏదో మొహమాటానికి ఇతర ఆదాయాల గురించి ప్రస్తావిస్తున్నారు కానీ.. నిజానికి ఆదాయం అంతా లిక్కర్ ద్వారానే అనేది చేదు నిజం. ఈ పరిస్థితులు మారాలనుకోవడం ప్రస్తుతానికి అత్యాశే. కనీసం వచ్చే ఏడాదికైనా మద్యం అమ్మకాలు తగ్గకపోయినా.. పెరగకుండా ఉంటే అదే పదివేలు అని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. తాగేవాళ్లు తాగుతారు.. ప్రభుత్వాలు ఎవర్నీ బలవంతం చేయడం లేదు కదా అనే వాదన కూడా నిజమే. కానీ పనిగట్టుకుని చెడ్డఅలవాటును ప్రోత్సహించేలా సర్కారీ విధానాలు ఉండొచ్చా అనేది నైతికమైన ప్రశ్న. ఇక్కడ నైతికత కంటే వాస్తవికత ముఖ్యం అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటున్నాయి ప్రభుత్వాలు. ముందు పాలన సజావుగా సాగాలంటే డబ్బు కావాలి. దాని కోసం అందుబాటులో ఉన్న మార్గాలు అన్వేషించాలి. అలా వస్తోందే మద్యంపై ఆదాయం. ఇదేదో జనాన్ని ఇబ్బందిపెడుతున్న విషయం అని ఎందుకనుకోవాలనేది మరో ప్రశ్న. మద్యం ఆదాయం ఓకే కానీ.. మరీ దాని మీదే అతిగా ఆధారపడటం కరెక్టేనా అనేది ఆర్థికవేత్తలు అడుగుతున్న ప్రశ్న. ఒకే రకమైన ఆదాయం మీదే ఎక్కువగా ఆధారపడటం ఏ ఆర్థిక వ్యవస్థకైనా మంచిది కాదు. రాష్ట్రాలు కూడా ఈ విషయంలో జాగ్రత్తపడాలని చెబుతున్నారు. కానీ రేపటి గురించి ఆలోచించే రాష్ట్రాలెన్ని అనేది మరో చిక్కు ప్రశ్న. ఈ రాష్ట్రం చూసినా.. ఈరోజు గడిస్తే అంతేచాలనుకునేలా ఆర్థికవ్యవస్థను నడిపిస్తున్నాయి. మరికొన్నిరాష్ట్రాలైతే ఓడీకి వెళ్లకపోతే అదే పదివేలు అనుకుంటున్నాయి.
మద్యంపై వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాయి. మాతాశిశు సంక్షేమం, రైతులకు పెట్టుబడి సాయం, వైద్య, విద్యా రంగాల్లో మౌలిక వసతులు.. ఇలా చాలా కీలకమైన అవసరాలకు మద్యంపై వచ్చే ఆదాయమే ప్రధాన మార్గం. ఆ ఆదాయమే కోసుకుపోతే.. చాలా పనులు నిలిచిపోతాయి. అప్పుడు జనమంతా ఇబ్బందులు పడక తప్పదంటున్నాయి ప్రభుత్వాలు. మద్యం అమ్మకం మంచిదా.. కాదా అనే చర్చకు కాలం చెల్లింది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని దేనికి ఖర్చుపెడుతున్నారో చూడాలంటున్నారు పాలకులు. లిక్కర్ సేల్స్ పెరగటం ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవాలంటున్నారు.
అలాగని మద్యనిషేధానికి ప్రభుత్వాలు అసలు ప్రయత్నం చేయలేదనటం కూడా తప్పవుతుంది. కానీ దాని కారణంగా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. దీంతో నిషేధం కంటే నియంత్రణలో అమ్మకాలే బెటరని అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. జాతీయోద్యమ స్ఫూర్తితో కూడా దేశంలో మద్య నిషేధాన్ని అమలు చేయడం కష్టమైందని చరిత్ర చెబుతుంది. జాతీయ స్థాయిలో మద్యపాన నిషేధం అమలు చేసేందుకు 1977లో ప్రధాని మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. జాతీయ మద్యపాన నిషేధ విధానం ప్రకటించింది. ఆ సమయంలో జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే నిషేధం అమలైంది. నిషేధం వల్ల రాష్ట్రాలో నష్టపోయే రాబడిని కేంద్రం భరిస్తుందని కూడా మొరార్జీ హామీ ఇచ్చారు. కానీ ఆచరణలో ఆ ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. చివరకు దొంగ మద్యం ఆయుర్వేదిక్ మందుల రూపంలో కూడా మార్కెట్లోకి వచ్చింది. ఆ తర్వాత లక్షద్వీప్, గుజరాత్, బిహార్, నాగాలాండ్, మిజోరాం లాంటి రాష్ట్రాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు పాక్షిక నిషేధ చట్టాలను తీసుకువచ్చాయి. కొన్ని సందర్భాల్లో చట్టాలను సడిలించాయి. హరియాణా, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిషేధ చట్టాన్ని తీసుకువచ్చి, అమలుచేయలేక ఉపసంహరించుకున్నాయి. గాంధీ పుట్టిన నేల కాబట్టి, గుజరాత్‌లో నిషేధం తప్పనిసరిగా అమలు చేయాల్సివస్తోంది. అది మొక్కుబడిగానే జరుగుతున్నట్లు అక్కడి మీడియా వార్తలు చూస్తే అర్థమవుతుంది. చట్టం కేవలం కాగితం మీదే చాలా కఠినంగా కనబడుతోంది. తాహతు ఉన్నవాళ్లకి మద్యం డోర్ డెలివరీ జరగుతూ ఉంది. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి పెద్దమొత్తంలో మద్యం అక్రమ రవాణా అవుతోందని వార్తలు వస్తున్నాయి.
అక్రమ మద్యం అందుబాటులో లేనివాళ్లు నాసిరకం మందు తాగున్నారు. ఫలితంగా 2009లో 149 మంది చనిపోయారు. అది కూడా అహ్మదాబాద్ వంటి మహానగరంలో. 1999-2009 మధ్య నమోదైన 70,899 మద్య నిషేధ కేసుల్లో శిక్ష పడింది కేవలం 9% మందికే. 2017లో ఓ పిటిషన్‌ను విచారణ సందర్భంగా నిషేధం సత్ఫలితాలు ఇవ్వడంలేదని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి చాలా స్పష్టంగా వాఖ్యానించారు. మన దేశంలోనే కాదు అమెరికాలో కూడా మద్యనిషేధం సత్ఫలితాలు ఇవ్వలేదు. నిజానికి అమెరికాలో మద్యపాన నిషేధం ఎప్పుడో ఎనిమిది దశాబ్దాల కిందట జరిగింది. దాని గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు. అయితే, ఈ అంశంపై ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి. పుస్తకాలు వస్తున్నాయి. ఇవన్నీ చెప్పిన, చెబుతున్న విషయం ఒక్కటే.. అదే అమెరికాలో మద్య నిషేధం ఒక విఫల ప్రయోగం అని. ఇలా ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని సరిపెట్టుకోవాల్సిందే.
మద్యపానాన్ని ప్రోత్సహించాల్సిన పనిలేదు. అలాగని నిషేధించాల్సిన అవసరమూ లేదు. యథాతథ స్థితి కొనసాగిస్తూనే.. అమ్మకాలపై నియంత్రణ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆదాయం పెంచుకోవడం కోసం అవసరమైనప్పుడల్లా అబ్కారీ విధానాన్ని సవరించే విధానం కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మద్యం దుకాణాలు నడుపుతున్నాయి. ఎలాగైనా అధిక ఆదాయం పొందడమే లక్ష్యం. అటు మందుబాబులు కూడా ప్రభుత్వాలకు బాగానే సహకరిస్తున్నారు. ఎక్కడా నిరాశపరచకుండా ఎప్పటిక్పప్పుడు మద్యపానంలో కొత్త రికార్డులు బద్దలు కొడుతున్నారు. న్యూఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించడంతో.. ఈ ఏడాది మద్యంపై ఆదాయం బాగా పెరిగిందని లెక్కలేసుకుపనిలో బిజీగా ఉన్నాయి రాష్ట్రాలు. అంతేకానీ మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని నియంత్రించాలని ఎవరూ అనుకోవడం లేదు.