Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Story Board On Iran Israel Us Conflict Is The World Moving Toward A Global War

Story Board : ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు.. గ్లోబల్ వార్ తప్పదా..?

Published Date :March 4, 2026 , 9:37 pm
By Sudhakar Ravula
Story Board : ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు.. గ్లోబల్ వార్ తప్పదా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Story Board : ఒక‌వైపు ఇజ్రాయెల్ మ‌రోవైపు ఇరాన్ తో పాటు అర‌బ్ దేశాలు, ఒక‌వైపు మిలిటెంట్ సంస్థలు.. మ‌రొక‌వైపు అస్ధిర‌మైన ప్రభుత్వాలు. ఒక‌వైపు అమెరికా ప్రభావంతో దూకుడుగా దాడిచేసే ఇజ్రాయెల్.. మ‌రొక‌వైపు అమెరికా పేరు చెబితేనే నిప్పులు క‌క్కే దేశాలు. నిత్యం క‌క్షలు. ప‌గ‌లు-ప్రతీకారాలు. ఇప్ప‌టికే రెండున్నరేళ్లుగా ఇజ్రాయెల్-హ‌మాస్ యుద్ధం సాగుతోంది. ఎన్ని శాంతి ఒప్పందాలు జ‌రిగినా అవి కేవ‌లం కాగితాల మీద‌నే అన్నట్లుంది. ఇలాంటి స‌మ‌యంలో.. ఇరాన్ మీద దాడికి దిగాయి ఇజ్రాయెల్-అమెరికా. చాలా తెలివిగా, ఇజ్రాయెల్ చేతుల‌తో ఇరాన్ క‌ళ్లు పొడిచింది యూఎస్. ఎలాగూ ఇజ్రాయెల్ అంటే ముస్లిం స‌మాజంలో వ్యతిరేకత ఉంది కాబ‌ట్టి త‌న పనిని ఆ దేశంతోనే చేయించింది. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన‌ట్లు… ఈ యుద్ధం నాలుగు లేదు ఐదు వారాలు జ‌రిగినా అది పెద్ద విధ్వంస‌మే. మూడో ప్రపంచ యుద్ధమే. మధ్యప్రాచ్యంలో ఇరాన్‌ దగ్గరున్న అణు సామర్థ్యం తమ మనుగడకే ముప్పు అని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. ఇరాన్‌లోని ప్రస్తుత పాలనను మార్చి, తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావడమే అమెరికా వ్యూహం. ఇప్పటికే ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కీలక అధికారులు, సైనిక నాయకులను హతమారుస్తున్నారు. తద్వారా కొత్తగా వచ్చే నాయకత్వం.. అమెరికా నిబంధనలకు తలొగ్గేలా చేయనుంది. ఇరాన్‌ దగ్గర క్షిపణులు, డ్రోన్లు ఉన్నప్పటికీ.. శత్రువుల అధునాతన దాడులను అడ్డుకోగల ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ లేకపోవడం పెద్ద బలహీనత. ఈ యుద్ధం వల్ల భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇబ్బందులు తప్పవు.

అమెరికాకు ఇజ్రాయెల్‌ అత్యంత సన్నిహిత మిత్రదేశం కావడం.. ఇరాన్‌ అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తోందన్న అనుమానాలు ప్రస్తుత దాడులకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు విఫలమవడంతో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్‌ను ముందుంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌కు రష్యా, చైనా నైతిక మద్దతు మాత్రమే ఇచ్చాయి. డ్రాగన్ మాత్రం ఓ అడుగు ముందుకేసి.. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని చెప్పింది. ఇరాన్‌ తన అణు సామర్థ్యాన్ని శాంతియుత అవసరాల కోసం కాకుండా.. అణ్వాయుధాల తయారీకి ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ అమెరికా దాడులకు దిగుతోంది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడం వెనక అమెరికా డీకాపిటేషన్‌ స్ట్రాటజీ ఉంది. ఒక వ్యవస్థలో అగ్ర నాయకత్వాన్ని తుడిచిపెట్టడం ద్వారా కింద ఉన్న యంత్రాంగాన్ని మానసికంగా, వ్యూహాత్మకంగా దెబ్బతీయడమే డీకాపిటేషన్‌. బంకర్లలో దాక్కున్న నేతలను సైతం అత్యంత కచ్చితత్వంతో మట్టుపెట్టడానికి ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌ నెట్‌వర్క్, అమెరికా అత్యాధునిక ఆయుధాల కలయికే కారణం. రాబోయే రోజుల్లో యుద్ధం తుపాకులతోనే కాకుండా.. సైబర్‌ దాడులు, డ్రోన్ల ద్వారా జరుగుతుంది.

ఇజ్రాయెల్‌తో భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నప్పటికీ, ఇరాన్‌తో చారిత్రక, ఆర్థిక సంబంధాలు కాపాడుకోవడమూ మనకు ముఖ్యమే. అఫ్గానిస్థాన్, సెంట్రల్‌ ఆసియా దేశాలకు సరకు రవాణా చేయడానికి ఇరాన్‌లోని చాబహార్‌ ఓడరేవు భారత్‌కు ఎంతో కీలకం. ముంబయి నుంచి రష్యా వరకు సాగే నార్త్‌-సౌత్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్‌లో భారత్, ఇరాన్, రష్యా మూడు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. వ్యూహాత్మకంగా ఇరాన్‌తో సంబంధాలు తెంచుకోవడం భారత్‌కి శ్రేయస్కరం కాదు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి పాత్ర నామమాత్రంగా మారింది. అమెరికా నిర్ణయాలను ప్రశ్నించే స్థితిలో ప్రస్తుతం ఏ దేశం లేదు. అస‌లే అమెరికా.. ఆపై డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు. ఇక ఆ దేశం ఏం చేసినా చెల్లుతోంది. నాలుగేళ్లుగా ఉక్రెయిన్ తో యుద్ధంలో మునిపోయిన ర‌ష్యాకు ఇప్పటికే త‌ల బొప్పి క‌ట్టింది. అమెరికాను ప్రతిఘ‌టించాలంటే.. అందులో ర‌ష్యా ఉండాలి. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఇక చైనా ప్రస్తుతానికి ఏమీ చేయకపోయినా.. భవిష్యత్తులో ఏం చేస్తుందనేది తేలాల్సి ఉంది. అప్పటివరకు ట్రంప్ దూకుడుకు అడ్డు ఏమిటి? అనే ప్రశ్నలు వ‌స్తున్నాయి.

ఇజ్రాయెల్-అమెరికాలు ఇరాన్ ను ఇంత‌టితో వ‌దులుతాయి అని భావించ‌లేం. పాకిస్థాన్ త‌ర్వాత‌ ప్రపంచంలో అణ్వస్త్రాలున్న ఉన్న రెండో ఇస్లామిక్ దేశం కావాల‌న్న ఇరాన్ ప్రయ‌త్నాల‌ను ప్రస్తుతానికి ధ్వంసం చేసినా, ఇంకా ఇరాన్ లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నెల‌కొల్పేదాక అమెరికా శాంతించ‌దు. ఇజ్రాయెల్ కూడా.. హ‌మాస్, హెజ్బొల్లా, హూతీ త‌దిత‌ర మిలిటెంట్ సంస్థల‌కు ఇరాన్ సాయం ఆగిపోతుంద‌ని భావించాకే యుద్ధం ఆపుతుంది. ఇప్పటికే నెల రోజులకు పైగా యుద్ధం సాగొచ్చని, అవసరమైతే ఆర్మీని కూడా ఇరాన్ పంపుతామనే ట్రంప్ ప్రకటనను తేలికగా కొట్టిపారేయలేం. ఇటు ఇరాన్‌ కూడా అమెరికా ఎత్తులకు పైఎత్తులేస్తూ.. యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచమంతా ఇరాన్ తీరును నిశితంగా పరిశీలిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, చిరకాల ప్రత్యర్థి ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్.. తన క్షిపణులను నేరుగా వారిపై ప్రయోగించాల్సింది పోయి, ఇరాక్, కువైట్, బహ్రెయిన్ వంటి పొరుగు దేశాల వైపు మళ్లించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. బహ్రెయిన్, కతార్, కువైట్‌.. వంటి ప్రాంతాల్లో అమెరికాకు చెందిన భారీ నౌకాదళ, వైమానిక స్థావరాలు ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడుల్లో ఈ స్థావరాలే వేదికలయ్యాయి. దాంతో నేరుగా వాషింగ్టన్‌పై దాడి చేయలేని ఇరాన్, అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడానికి పక్కనే ఉన్న ఈ లాజిస్టిక్ హబ్‌లను లక్ష్యంగా చేసుకుంది.

గతంలో ఇరాన్ తన పరోక్ష యుద్ధాన్ని హమాస్, హిజ్బుల్లా ద్వారా నడిపించేది. కానీ 2024-25 మధ్య జరిగిన పరిణామాల్లో ఇజ్రాయెల్ ఈ గ్రూపులను తీవ్రంగా దెబ్బతీసింది. సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోవడం, హిజ్బుల్లా నాయకత్వం తుడిచిపెట్టుకుపోవడంతో ఇరాన్ కొంత బలహీనపడింది. దీంతో తన ఉనికిని చాటుకోవడానికి పొరుగున ఉన్న ఇజ్రాయెల్ అనుకూల దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా ప్రాంతీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. యుద్ధం కొనసాగితే ఇరాన్ ఆర్థికంగా తట్టుకోవడం కష్టం. అందుకే, గల్ఫ్ దేశాల్లోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోందని అభిప్రాయాలున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గాన్ని మూసివేయడం ద్వారా అమెరికా, ఐరోపా దేశాలపై ఒత్తిడి తీసుకురావాలన్నది ఇరాన్ ప్లాన్. ఆ వ్యూహం ఇప్పటికే ఫలితాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. పొరుగు దేశాలపై దాడులు చేయడం ద్వారా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే తమ ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలుతాయనే హెచ్చరికను ఇరాన్ పంపాలని చూస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇరాన్ తీవ్రమైన దేశీయ నిరసనలతో అట్టుడుకుతోంది. ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. బయటి దేశాలపై దాడులు చేయడం ద్వారా జాతీయవాదాన్ని రగిల్చి ప్రజల దృష్టిని అంతర్గత సమస్యల నుంచి మళ్లించాలని ఇరాన్ పాలకులు చూస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్‌లో పాలన మార్పును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న దాడులు కేవలం సైనిక స్థావరాల మీద మాత్రమే కాదు, కీలక నాయకత్వంపై కూడా జరుగుతున్నాయి. తమ మనుగడకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఒక గాయపడిన సింహంలా ఇరాన్ తన పక్కనున్న చిన్న దేశాలపై విరుచుకుపడుతోంది. ఇది అమెరికాను చర్చల వైపు మళ్లించే ప్రయత్నం కూడా కావచ్చని కొందరి అభిప్రాయం.

మొత్తం మీద ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా ఇరాన్ ఇజ్రాయెల్, యూఎస్ మధ్య యుద్ధం. గల్ఫ్‌ దేశాల్లో చిచ్చు పెట్టింది. ప్రపంచ చమురు సరఫరా కు కీలకమైన ప్రాంతంలో ఉద్రిక్తతలతో.. ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఇకపై యుద్ధం కొనసాగేకొద్దీ.. ప్రపంచ దేశాలకు భారం తప్పదు. అప్పుడు మిగతా దేశాలన్నీ కలిసి అమెరికాపై ఒత్తిడి తెచ్చి యుద్ధం ఆపుతాయనేది ఇరాన్ వ్యూహం. ఇరాన్ వైపు నుంచి ఆలోచిస్తే ఈ వ్యూహం బాగానే ఉన్నా.. అదే వ్యూహాన్ని అమెరికా తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. ఇరాన్ ప్రపంచాన్ని నాశనం చేస్తుందనటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. ఇరాన్‌ను ఇలాగే వదిలేస్తే.. పదేపదే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుందని ఆయన వాదిస్తున్నారు. అందుకే ఇప్పుడే తాడోపేడో తేల్చుకుంటామని తేల్చిచెబుతున్నారు. తాము కూడా దాడులు ఉధృతం చేసి.. ఇరాన్‌కు తగిన జవాబు చెబుతామని అంటున్నారు.

అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తులుగా చెప్పుకుంటున్న రష్యా, చైనా కీలక సమయంలో హ్యాండ్సప్ చెబుతున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతి విషయంలో అమెరికాకు కౌంటర్ ఇవ్వలేకపోయినా.. సన్నిహిత మిత్రదేశాల విషయంలో కూడా జోక్యం చేసుకోకపోవటం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న వెనిజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా ఎత్తుకెళ్తే రష్యా, చైనాల్లో ఎవరూ జోక్యం చేసుకోలేదు. కనీసం కాపాడే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఇరాన్‌పై దాడి చేసి ఖమేనీని చంపేసినా.. రష్యా, చైనా ఖండన ప్రకటనలకే పరిమితం అయ్యాయి. అంతేకానీ ఇరాన్‌తో రక్షణ సహకార ఒప్పందాన్ని గౌరవించి.. నేరుగా యుద్ధానికి సాయం చేస్తామనే సంకేతాలు పంపటం లేదు. ఇక చైనా ఎయిర్ డిఫెన్స్ ఇరాన్‌ను బాగా దెబ్బతీసిందనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో చైనా ఎట్టకేలకు మరో అడుగు ముందుకేసింది. ఇరాన్ కష్టాలు ఇరాన్‌ కు ఉంటే.. చైనా కష్టాలు చైనాకు ఉన్నాయి. మొన్నీమధ్యే అమెరికాతో టారిఫ్ వార్‌కు ముగింపు పలికిన డ్రాగన్.. ఇప్పుడు మళ్లీ ఏరికోరి అగ్రరాజ్యంతో కయ్యానికి సుముఖంగా లేదు. పైగా నెలాఖరు ట్రంప్ బీజింగ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సమయంలో ఎక్కువతక్కువ మాట్లాడటం బాగుండదనే మీమాంస కూడా చైనాను వెనక్కి లాగుతోంది. కానీ ఇక తప్పదన్నట్టుగా ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడతామనే హామీతో సరిపెట్టింది. ప్రకటన సరే.. ఇంతకూ కార్యాచరణ ఏది..? అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. చైనా ఇలాగే ప్రేక్షక పాత్ర పోషిస్తే.. ఇరాన్ సార్వభౌమత్వం నిలుస్తుందా..? కాదని చైనా నేరుగా యుద్ధంలోక దిగుతుందా..? ఒకవేళ డ్రాగన్ అమెరికాతో తలపడితే అప్పుడేం జరుగుతుంది..? ఇవన్నీ ప్రస్తుతానికి ఉత్కంఠ రేపుతున్నవే.

పశ్చిమాసియాలో చెలరేగిన ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తూ ప్రపంచ దేశాలను రెండు వర్గాలుగా విభజిస్తోంది. మొదట ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఘర్షణగా ప్రారంభమైన ఈ పోరులో, ఇప్పుడు అమెరికాకు అండగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరప్ దేశాలు నిలిచాయి. మరోవైపు, ఇరాన్‌కు అండగా ఉంటామని చైనా బహిరంగంగానే ప్రకటించడంతో, ఈ యుద్ధం అగ్రరాజ్యాల మధ్య ప్రత్యక్ష పోరుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. మొత్తం మీద మిడిల్ ఈస్ట్‌లో మొదలైన ఈ ఉద్రిక్తతలు ఆసియా మరియు యూరప్ ఖండాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇది కేవలం ప్రాంతీయ యుద్ధంగా మిగిలిపోతుందా లేదా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే చర్చ అంతర్జాతీయ విశ్లేషకులలో మొదలైంది. ఒకవైపు నాటో దేశాలు, మరోవైపు చైనా-ఇరాన్ కూటమి పరస్పర దాడులకు దిగితే, అది ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. వాయిస్..
ఈ యుద్ధ ప్రభావం ఇప్పటికే సామాన్యుడిపై పడటం మొదలైంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరగవచ్చని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తప్పదనే భయాలు నెలకొన్నాయి.

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధం ఒక్కరోజులో మొదలైంది కాదు. 2023 అక్టోబర్‌లో హమాస్.. ఇజ్రాయెల్‌పై చేసిన దాడి దీనికి ప్రధాన కారణం. హమాస్ వెనుక ఇరాన్ మద్దతుందని, ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. అప్పటి నుంచి ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, హౌతీల్లాంటి గ్రూపులు.. ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తూనే ఉన్నాయ్. ఇప్పుడు.. ఇరాన్ అణ్వాయుధాలు తయారుచేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ యుద్ధం జరుగుతోంది. ఇరాన్ దగ్గరున్న బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు.పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్ ఇప్పుడు అగ్నిపర్వతంలా మారాయ్. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా అంతే వేగంగా స్పందించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వందల సంఖ్యలో క్షిపణులను ఇజ్రాయెల్ మీదకు ప్రయోగించింది. వందలాది బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లతో.. ఇరాన్ జరిపిన దాడులు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అంతేకాదు.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలటరీ బేస్‌లపైనా దాడులకు దిగింది.దాంతో.. మిడిల్ ఈస్ట్ మొత్తం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. మిడిల్ ఈస్ట్‌లోని దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయ్. ఇరాన్ తమపై జరుగుతున్నది ఉనికికి సంబంధించిన యుద్ధంగా భావిస్తోంది. హిజ్బుల్లా, హౌతీల లాంటి తమ ప్రాక్సీ గ్రూపులను కూడా ఇజ్రాయెల్‌పైకి ఉసిగొల్పుతోందనే వాదన వినిపిస్తోంది. గల్ఫ్‌లో కల్లోలం రేగటం తమ ఆర్థిక ప్రయోజనాలకు నష్టం అనే ఆలోచనతో.. చైనా కూడా సీరియస్‌గా ఆలోచనలు చేస్తోంది.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే.. యుద్ధం త్వరగా ముగిసేలా కనిపించడం లేదు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టే వరకు వెనక్కి తగ్గొద్దని అమెరికా భావిస్తోంది. ఇది.. ఒక్కరోజుతో ముగిసే ఆపరేషన్ కాదని, కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే.. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, శాంతిని దెబ్బతీసే వ్యవహారం కూడా. చైనా దౌత్యపరంగా ఇరాన్‌కు అండగా నిలుస్తోంది. ఇక్కడ చైనాను స్పందించేలా చేయడంలో ఇరాన్ సక్సెస్ అయిందనే విశ్లేషణలు వస్తున్నాయి. మొదట్లో కేవలం ఇరాన్ మునిగితే మనకేం పోతుందని మిగతా దేశాలన్నీ సైలంట్‌గా ఉన్నాయి. అది గమనించిన ఇరాన్.. మొత్తం ప్రపంచానికే పొగ పెట్టాలనే డిసైడై ఆ దిశగా కార్యాచరణ తీసుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంధన సరఫరానే కీలకం. ఈ ఇంధన సరఫరాకు ఆయువుపట్టు గల్ఫ్. అందుకే గల్ఫ్‌పై గురిపెట్టింది ఇరాన్. పేరుకి అమెరికా స్థావరాలపై దాడులు అని మొదలుపెట్టినా.. అసలు ఎక్కువగా చమురు క్షేత్రాలు, గల్ఫ్ వాణిజ్యాన్నే టార్గెట్ చేస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ప్రపంచ దేశాలన్నింటికీ తమకు సెగ తప్పదనే విషయం అవగతమైంది. అందుకే యుద్ధం వద్దు దౌత్యం ముద్దు అని పలు దేశాలు ఇటు అమెరికా, ఇజ్రాయెల్‌కు, అటు ఇరాన్‌కు విజ్ఞప్తులు చేస్తున్నాయి.

ప్రస్తుతం భారత్ కూడా అత్యంత క్లిష్టమైన స్థితిలో ఉంది. ఇటు అమెరికా, ఇజ్రాయెల్‌తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అటు ఇరాన్‌తో చారిత్రక బంధం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న 80 లక్షల మంది భారతీయుల భద్రత దృష్ట్యా భారత్ తటస్థంగా ఉంటూ, తక్షణమే యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, టర్కీ, ఖతర్ వంటి దేశాలు గతంలో ఇరాన్‌కు వ్యతిరేకమైనప్పటికీ, ప్రస్తుతం తమ దేశాలపై దాడులు జరుగుతాయన్న భయంతో తటస్థంగా ఉంటున్నాయి. దీనికి తోడు ఇరాన్ ఆయా దేశాల మీదా దాడులకు దిగింది. ఇదీంతో క తమ భూభాగం నుంచి అమెరికా దాడులు చేయడానికి ఇవి అంగీకరించడం లేదు. తద్వారా అమెరికాకి దాడులు చేసే అవకాశాల్ని మొత్తంగా దెబ్బతీయాలనేది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పుడు చైనా కూడా ఆపద్ధర్మంగానే స్పందించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం లక్ష్యాలు, సూత్రాలను అమెరికా ఉల్లంఘించిందని పేర్కొంది. ఇజ్రాయెల్ వెంటనే కాల్పుల విరమణ చేసి, సామాన్య ప్రజల భద్రత కోసం చర్చలు ప్రారంభించాలని చైనా విజ్ఞప్తి చేసింది. న్యాయాన్ని కాపాడటానికి, మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి పునరుద్ధరించడానికి చైనా అంతర్జాతీయ సమాజంతో మాట్లాడుతుందని పేర్కొంది. కానీ ఎక్కడా సైనిక సాయం గురించి కానీ.. తాము ఇరాన్‌తో భుజం కలిపి పోరాడతామనే మాట రాకుండా డ్రాగన్ చాలా జాగ్రత్తపడింది. చూస్తుంటే కేవలం దౌత్యఒత్తిడి ద్వారానే తమ ప్రయోజనాలు కాపాడుకోవాలనేది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. కానీ చైన ఈ వ్యూహానికే పరిమితమై ఉండగలదా..? భవిష్యత్తులో ఇరాన్‌ మరో ఎత్తు వేసి.. చైనా యుద్ధంలోకి దిగక తప్పని స్థితిని సృష్టిస్తుందా అనేది ఆసక్తిరేపుతున్న అంశం. అదే జరిగితే మాత్రం ఆధునిక చరిత్రలో అమెరికా, చైనా అమీతుమీ తేల్చుకోవటం ఇదే తొలిసారి అవుతుంది.

అమెరికాకి యుద్ధాలు కొత్త కాదు. కానీ గతంలో చేసిన యుద్ధాలకు, ఇప్పుడు చేస్తున్న యుద్ధానికీ చాలా తేడా ఉంది. చరిత్రలో అమెరికా చేసిన ప్రతి యుద్ధానికీ యూరప్ దేశాలు బేషరతుగా మద్దతు ప్రకటించాయి. అమెరికా ముందు చెప్పినా, చెప్పకున్నా.. ఒక్కోసారి అడిగినా, అడగకున్నా స్వచ్ఛందంగా సైనిక సాయానికి ముందుకొచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇరాన్‌ పై దాడులకు బ్రిటన్ ఆధీనంలో ఉన్న ఎయిర్ బేస్ వాడుకోవటానికి ఆ దేశం అమెరికాకు అనుమతివ్వకపోవడం పెద్ద సంచలనమే. దీంతో తీవ్ర అసహనానికి గురైన ట్రంప్.. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌పై సీరియస్‌ అయ్యారు. అయితే యుద్ధం త్వరగా ముదిరి.. ఇరాన్ భీకరంగా ప్రతిదాడులు చేయడంతో.. అప్పుడు స్టార్మర్ మనసు మార్చుకున్నారు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని, స్టార్మర్ తీరుపై తాను సంతోషంగా లేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.

కొంతకాలంగా ఈయూ, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రంప్ పుణ్యమా అని నాటో కూడా నామమాత్రంగా మారిపోయింది. విశ్వాసరాహిత్యం వచ్చి చేరింది. దీంతో ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు కూడా అమెరికాకు ఆలస్యంగా మద్దతు ప్రకటించాయి. ఇప్పటికీ అవి తమ సైన్యాలను దించలేదు. పైగా అవసరమైతే పంపుతామంటున్నాయి. తద్వారా ట్రంప్ నోరు తెరిచి తమ సాయం కోరితే.. చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నాయి. గతంలో ఈయూకి అమెరికా రక్షణ కల్పిస్తోందన్న ట్రంప్ మాటల్ని యూరప్ నేతలు ఇప్పుడు తిప్పికొడుతున్నారు. అమెరికాకూ యూరప్ అవసరం ఉంటుందనే విషయం మర్చిపోవద్దని గుర్తుచేస్తున్నాయి. అందుకే అమెరికా కూడా ఇంతకుముందులా యూరప్ సాయానికి త్వరపడటం లేదు. వారితో పని లేకుండానే ఇరాన్ యుద్ధం ముగించాలనే ఆలోచిస్తోంది. కానీ ఒక్కసారి యుద్ధంలోకి దిగాక అంతా అనుకున్నట్టే జరగదనే విషయం అమెరికాకు అఫ్గాన్ యుద్ధంతో అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా చనిపోయిన అమెరికా సైనికుల సంఖ్య విషయంలో భిన్నవాదనలు ఉన్నాయి. అమెరికా సైన్యానికి ప్రాణనష్టం పెరిగేకొద్దీ.. ట్రంప్‌కు స్వదేశంలో నిరసన సెగలు పెరుగుతాయి. ఒకవేళ యుద్ధంలో అమెరికా ఆయుధాలు కూడా కోల్పోవాల్సి వస్తే.. అది మరింత నష్టమని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ సమీకరణాలు ఎలా ఉన్నా.. యూరప్, అమెరికా సహజ మిత్రులు, ఉమ్మడి ప్రయోజనాల కోసమైనా తోడునీడగా నిలవక తప్పదు. కాబట్టి ఎప్పుడైనా యూరప్ సైన్యం రంగప్రవేశాన్ని కొట్టిపారేసే పరిస్థితి ఉండదు. అదే జరిగితే యుద్ధం మరింత తీవ్రమై.. ఇంకా భయంకరంగా మారొచ్చు.

బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు ఇరాన్ అణు కార్యక్రమాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి ప్రస్తుతానికి నేరుగా యుద్ధంలో పాల్గొనకపోయినా, ఇజ్రాయెల్ యొక్క రక్షణ హక్కుకు మద్దతు తెలుపుతూ అమెరికాకు దౌత్యపరమైన బలాన్ని ఇస్తున్నాయి. కానీ ఇరాన్ తీసుకున్న కార్యాచరణ యూరప్‌కు ఇబ్బందులు పెంచేలాగే ఉంది. ఒకవేళ యూరప్ సహనానికి ఇరాన్ పరిధులు దాటి పరీక్ష పెడితే.. అప్పుడు యుద్ధంలో దిగటం మినహా ఆయా దేశాలకు మరో ప్రత్యామ్నాయం ఉండకపోవచ్చు. వీటికి తోడు కెనడా, ఆస్ట్రేలియా కూడా అమెరికాకు మద్దతు ఇస్తున్నాయి. యుద్ధంలో తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్‌ను చంపేశామని ప్రకటించిన అమెరికా.. ఆ దేశంలో చెత్తంతా ఏరేస్తామని హుంకరిస్తోంది. అటు ఇరాన్ కూడా మేం యుద్ధాన్ని ప్రారంభించకపోయినా ముగిస్తామని దీటుగా కౌంటర్ ఇచ్చింది. కానీ అమెరికా వ్యూహమేమిటనేది ప్రస్తుతానికి అంతుచిక్కటం లేదు. ప్రస్తుతానికి ఇజ్రాయెల్‌ను ముందుంచి కథ నడుపుతున్న అమెరికా.. మరో సర్‌ప్రైజ్ ఎటాక్‌తో ఇరాన్‌ను చావు దెబ్బ కొట్టాలని ఆలోచిస్తోంది. కానీ వరుస దాడులు చేయకుండా.. ఎందుకు వెయిట్ అండ్ సీ పాలసీ అవలంబిస్తుందనేది తేలాల్సి ఉంది. ఇరాన్ పూర్తిస్థాయిలో దెబ్బతీయటమే లక్ష్యమని అమెరికా చెబుతున్నా.. ట్రంప్ మనసులో మరింత లోతైన వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. యుద్ధాన్ని పొడిగించటం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా, యూరప్ దేశాలు కునారిల్లినా.. ఆ పరిస్థితుల నుంచి అమెరికా అడ్వాంటేజ్ తీసుకోవాలనే దారుణ వ్యూహరచన చేస్తున్నారా అనే ఊహే భయపెడుతోంది. అదీ కాదనుకున్నా.. అందరూ అనుకుంటున్నట్టుగా మూడో ప్రపంచ యుద్ధమే వస్తే.. అది కచ్చితంగా అమెరికా నెత్తిన పాలు పోస్తుందనే ఆలోచనతో ట్రంప్ ఉన్నారా అనేది మరో కీలక ప్రశ్న. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా శక్తిమంతంగా ఎదిగిన తీరును పదేపదే గుర్తుచేసుకునే ట్రంప్.. మరోసారి తన హయాంలో అదే ఫీట్ రిపీట్ చేసే దుస్సాహసానికి తెగబడతారా అనేది ప్రపంచాన్ని మునివేళ్ల మీద నిలబెడుతున్న అంశం. ఏతావాతా ప్రపంచ వినాశనానికి ఇరాన్ పూనుకుంటుందన్న ఆరోపణలతో యుద్ధం మొదలుపెట్టిన అమెరికా.. దాన్ని చేజేతులా మూడో ప్రపంచ యుద్ధంగా మారుస్తుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • China Russia Iran support
  • Geopolitical analysis 2026
  • Global oil price crisis
  • Gulf region tensions
  • iddle East

తాజావార్తలు

  • Story Board : ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు.. గ్లోబల్ వార్ తప్పదా..?

  • Tata Sierra ప్రేమికులకు అదిరిపోయే గిఫ్ట్.. మార్కెట్లోకి DWC ‘సియెర్రా’ లిమిటెడ్ ఎడిషన్ వాచ్.!

  • 5g Phones Under 10K: రూ.10 వేల లోపు 5జీ ఫోన్స్ మీ మనసు దోచేస్తాయి!.. బ్యాటరీ, కెమెరా సూపర్!

  • Rajshri Deshpande: ప్రముఖ నటికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌.. సోషల్‌ మీడియాలో ఎమోషన్‌ పోస్ట్..

  • T20 World Cup Semi-Finals: సెమీస్‌కు ముందు టీమిండియాకు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యరీ బ్రూక్ హెచ్చరిక..

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions