Story Board: తెలంగాణలో ఎన్నికలకు గట్టిగా 50 రోజుల సమయం కూడా లేదు. దీంతో అన్ని పార్టీల్లోనూ రాజకీయ వేడి పెరుగుతోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుండగా.. కేసీఆర్ కూడా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో రిలీజ్ చేసి.. ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు చూస్తుంటే.. ప్రజల్ని ఆకర్షించటానికి హారాహోరీగా పథకాల రూపకల్పన చేసినట్టు కనిపిస్తోంది. ఈసారి తెలంగాణ ఎన్నికలు సంక్షేమం చుట్టూనే తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం రెండూ సంక్షేమాన్నే నమ్ముకున్నాయి. హామీల అండతోనే ఎన్నికల్లో గట్టెక్కాలని ఆలోచిస్తున్నాయి. పథకాల రూపకల్పన వరకు ఒక ఎత్తైతే.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లటం, తాము అమలుచేస్తామని వారిని కన్విన్స్ చేయడం మరో ఎత్తు. ఈ ప్రక్రియలో విజయవంతమైన పార్టీనే అధికారం దక్కించుకుంటుంది. మొత్తం మీద హామీల ప్రకటన వరకు పోటాపోటీగా కనిపించిన బీఆర్ఎస్, కాంగ్రెస్.. ఇప్పుడు జనం నమ్మకం గెలుచుకోవడానికి కూడా అంతే గట్టిగా పోటీపడుతున్నాయి. మరి వీరిలో ఎవరిని ప్రజలు ఆశీర్వదిస్తారనేది ఆసక్తి రేపుతున్న అంశం.
ఓవైపు తెలంగాణ ధనిక రాష్ట్రమని, దేశంలో ఎక్కడా జరగనంత అభివృద్ధి జరుగుతోందనే ప్రచారం నెలకొంది. అయినా పార్టీలన్నీ సంక్షేమాన్నే నమ్ముకోవడం పరిశీలకుల్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ప్రస్తుతానికి సంక్షేమ హామీలిచ్చినా.. ప్రచారం జోరందుకున్నాక.. అభివృద్ధి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందరి కంటే ముందే ఆరు గ్యారంటీల పేరుతో సంక్షేమ యుద్ధం మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్. కర్ణాటకలో గ్యారంటీలు వర్కవుట్ అయి ఆ పార్టీకి అధికారం దక్కింది. దీంతో ఆ జోష్ తో తెలంగాణనూ అధికార ఉట్టి కొట్టేయాలనే పట్టుదలతో గ్యారంటీలు ప్రకటించింది. తన గ్యారంటీల్లో అన్ని వర్గాలు కవరయ్యేలా జాగ్రత్తలు తీసుకుంది. మహాలక్ష్మీ పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2 వేల 500 ఆర్థిక సాయం , రూ.500 లకే గ్యాస్ సిలిండర్ , బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం , ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం , ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం, రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం, వ్యవసాయం కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్, గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు , చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్, రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు, యువ వికాసం ద్వారా నిరుద్యోగుల కోచింగ్‌కు ఐదు లక్షల సాయం వంటి హామీలు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లో ఉన్నాయి.
Also Read: IND vs BAN: టీమిండియాతో మ్యాచ్.. బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ!
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను నెరవేరుస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు. గ్యారంటీలన్నింటినీ కేవలం వంద రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది పార్టీ మైలేజీని పెంచడమే కాకుండా..కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు భరోసా కానున్నట్లు నేతలు విశ్వసిస్తున్నారు. కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేసినట్లే.. ఇక్కడ కూడా పూర్తి చేస్తామని పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ వెల్లడించిన గ్యారంటీలను కార్డు రూపంలో ప్రతీ ఇంటికి చేర్చాలని పార్టీ ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ పై విశ్వాసం పెరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు శాంపిల్ మాత్రమే.. అసలు మ్యానిఫెస్టో ముందుంది అంటున్నారు నేతలు. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి.. మ్యానిఫెస్టోకు తుదిమెరుగులు దిద్దుతోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించేలా మేనిఫెస్టోను రూపకల్పన చేయాలన్నది లక్ష్యం. ప్రజలు ఏం ఆశీస్తున్నారు? ఏ స్కీమ్‌లతో మేలు జరుగుతుంది? రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటీ? అనే అంశాలను బేరీజు వేసుకుంటున్నారు నేతలు. ఈ అంశాలన్నీ మేనిఫెస్టో కమిటీ దగ్గరకూ చేరాయి. వీటిపై కమిటీతో పాటు రాష్ట్ర పార్టీకి చెందిన కీలక నేతల అభిప్రాయాలనూ సేకరించారు. దీంతో పాటు కుల సంఘాలు, వివిధ వర్గాల నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. మేనిఫెస్టోను సుదీర్ఘ అధ్యయనం తర్వాతనే వెల్లడించాలని పార్టీ భావిస్తోంది. అందుకే మొదట గ్యారంటీలను మాత్రమే పార్టీ ప్రకటించింది. నున్నది. ఇక మేనిఫెస్టోలోని అంశాల చర్చ, ప్రజలు, ప్రజా సంఘాలు, ఇతర నేతలు కార్యకర్తలు తమ అభిప్రాయాలను చెప్పేందుకు గాంధీభవన్‌లో ఓ ప్రత్యేకమైన రూమ్‌ను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబరుతో కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటైంది.
Also Read: Dasara Festival: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 620 స్పెషల్ ట్రైన్లు
తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్నా.. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమే ఎదురైంది. ఈసారి ఎలాగైనా గెలవాలనే వ్యూహంతో ఉంది హస్తం పార్టీ. దీని కోసం ఏ అవకాశాన్ని వదలకుండా ప్రయత్నిస్తోంది. గెలుపుకు గ్యారంటీలే రాచబాట వేస్తాయని గట్టిగా నమ్ముతోంది. అందుకే క్యాడర్ తో ఇంటింటికీ గ్యారంటీ కార్డులు చేర్చే పనిలో పడింది. భారీ సభల కంటే కార్నర్ మీటింగులతో ఈ గ్యారంటీలను జనంలో లైవ్ లో ఉంచాలనే వ్యూహం కూడా అమలు చేస్తోంది. కర్ణాటకలో ఇలాంటి వ్యూహాలే విజయవంతమయ్యాయనేది కాంగ్రెస్ లెక్క. దీనికి తోడు బీఆర్ఎస్ కూడా సంక్షేమంలో తామే నంబర్ వన్ అని చెప్పుకుంటున్న తరుణంలో.. కాంగ్రెస్ ఇచ్చే సంక్షేమం ఎలా ఉంటుందో చాటి చెప్పడానికే గ్యారంటీల పేరుతో ఫస్ట్ షాట్ కొట్టింది ఆ పార్టీ. తద్వారా ఎన్నికల్ని సంక్షేమం చుట్టూ తిప్పాలనే వ్యూహం రచించినట్టు కనిపిస్తోంది. కేవలం హామీలివ్వడం కాదు.. వాటి అమలు విషయంలో బాధ్యత తీసుకుంటామనేది కాంగ్రెస్ ఓటర్ల కిచ్చే మాట. కావాలంటే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పథకాల అమలు చెక్ చేసుకోవాలంటూ ఛాలెంజ్ విసురుతోంది కాంగ్రెస్. గతంలో మాదిరిగా ప్రత్యర్థుల ట్రాప్ లో పడటానికి సిద్ధంగా లేమని.. ఈసారి ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు పక్కాగా ఉండటమే కాదు.. గ్యారంటీలతో అంది కంటే ముందే ఎలక్షన్ అజెండా సెట్ చేశామనే ధీమా టీకాంగ్రెస్ లో కనిపిస్తోంది. ప్రజల్లో కూడా గ్యారంటీలకు మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.