Story board: మనది వ్యవసాయ ఆధారిత దేశం. దాదాపు 83 కోట్ల మందికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. 70 శాతం గ్రామీణ మహిళలు వ్యవసాయం జీవనాధారంగా జీవిస్తున్నారు. 1991లో వచ్చిన సంస్కరణల తర్వాత మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. దేశంలో రోజుకు సగటున 46 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ప్రతి అరగంటకు ఒక రైతు చనిపోతున్నాడని అర్థం.
1956లో వ్యవసాయరంగ జీడీపీ 60 శాతానికి పైగా ఉంటే 2016-17కు వచ్చేసరికి అది దాదాపు 12 శాతానికి పడిపోయింది. కానీ ఇంకా 50 శాతం పైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలో మొత్తం ఆత్మహత్యల్లో 11 శాతం రైతులవే ఉంటున్నాయి. ఆత్మహత్యల రేటులో ప్రతి లక్షమంది జనాభాకు రైతులు 1.4 శాతం మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.
అభివృద్ధిచెందిన రాష్ర్టాలైన దక్షిణాదిలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు ఉన్నాయి.
పంట నష్టం, దివాళా, వ్యవసాయ సంబంధ సమస్యలు రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని కేంద్రం విశ్లేషించింది. కూలీ రేట్లు అధికమవ్వడం, వాతావరణ దుష్పరిణామాలు, ధరలు పెరుగుదల వంటివి కూడా కర్షకుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. పేద రైతులు ప్రధానంగా అప్పులపై ఆధారపడి వ్యవసాయం చేస్తారు. తక్కువ సమయంలోనే అప్పులు చెల్లించాల్సి ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అధిక వడ్డీరేట్లు ఉండటం, మొదటి దఫా అప్పు చెల్లించకపోవడంతో రెండో దఫా నిరాకరించడం, రైతులకు ఇవ్వాల్సిన రుణాలను ఇతర రంగాలకు మళ్లించడం వంటివి కూడా సమస్యలుగా మారుతున్నాయి. రైతులకు కొంత మొత్తంలోనే రుణాలిచ్చిన బ్యాంకులు.. రుణమాఫీని కూడా క్రమశిక్షణా రాహిత్యంగా చెప్పాయి. అది ఆర్థిక వ్యవస్థకు మంచిదికాదని ప్రభుత్వాలకే హితవు చెప్పే సాహసం కూడా చేశాయి.
జీవన వ్యయం రోజురోజుకు పెరిగిపోతుండటంతో దాన్ని అందుకోలేని రైతు ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నాడు. రైతులకు వచ్చే అరకొర ఆదాయంతో కనీస అవసరాలు తీర్చుకోలేక, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లభించక వ్యవసాయ వృత్తిలోనే కూరుకుపోవడంతో రైతు తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. అప్పు అనేది సామాజికంగా రైతును కుంగదీస్తుంది. తనకు వచ్చే ఆదాయంతో అప్పు తీర్చలేకపోతున్నాడు. దీనికి తోడు కుటుంబ ఖర్చులు పెరుగుతున్నాయి. గతంలో మాదిరిగా ఇంటిల్లిపాది వ్యవసాయ పనుల్లో పాలుపంచుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. దీంతో కుటుంబ సభ్యులను సంతృప్తి పరచలేక.. పరువు పోతోందనే ఆవేదనతో.. నిస్సహాయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
వ్యవసాయం అసంఘటిత రంగంలో ఉండటంతో పథకాలు కూడా లబ్ధిదారులకు సరిగా చేరడం లేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రైతులకు బాగానే చేయూత లభిస్తున్నా.. ఆశించిన ఫలితాలు రావడం లేదు. తెలంగాణలో, రుణమాఫీ, రైతు భరోసా లాంటి పథకాలున్నాయి. ఏపీలోనూ అన్నదాతకు ఆర్థిక సాయం అందుతోంది. అయినా సరే రైతులు నిలదొక్కుకోలేకపోతున్నారు. వ్యవసాయంలో పేరుకుపోయిన సమస్యలు కర్షకుల్ని కుంగదీస్తున్నాయి. అందుకు కేవలం ఆర్థిక సాయంతో అన్నదాతకు భరోసా ఇవ్వడం కుదరదని చాలా మంది నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
వ్యవసాయ దిగుబడుల విషయంలోనూ మన దేశం చాలా వెనుకబడి ఉంది. హరిత విప్లవం తర్వాత దిగుబడి పెరిగిన మాట నిజమే అయినా.. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర ఉత్పాదకత ఇంకా తక్కువగానే ఉంది. ఇక పంటలు అమ్ముకోవడానికి రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మార్కెట్లల్లో తీవ్ర అవినీతి చోటుచేసుకుంటోంది. ప్రభుత్వాలు ఈ అవినీతిని కట్టడి చేయలేక చేతులెత్తేస్తున్నారు. అందుకే ఏటా మద్దతు ధర ప్రకటిస్తున్న పంటలకు కూడా పూర్తిస్థాయి ఆ ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు.
రైతు సమస్యలకు పరిష్కారాలు సూచించడానికి, వ్యవసాయంపై సమగ్ర విధాన రూపకల్పనకు.. 2004లో ప్రొఫెసర్ ఎంఎస్. స్వామినాథన్ అధ్యక్షతన జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేశారు. పంటలకు మద్దతు ధర ఇవ్వడమే కాదు. ఆ మద్దతు ధరను నిర్ణయించడానికి తీసుకునే ప్రాతిపదికల విషయంలోనూ శాస్త్రీయత ఉండాలనే అభిప్రాయం వచ్చింది. రైతు పెట్టుబడి వ్యయాన్ని లెక్కగట్టి.. ఒక పంటకు ప్రభుత్వం ఇచ్చే కనీస ధరను మద్దతు ధరగా వ్యవహరిస్తారు. ఈ ధర కంటే తక్కువ ధరకు పంట ధరను పడిపోనివ్వదు. దీన్ని కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ నిర్ణయిస్తుంది. రబీ, ఖరీఫ్ పంటలకు వేర్వేరుగా కనీస మద్దతు ధర ఉంటుంది. రైతు ఆత్మహత్యలు ఆగాలంటే.. పంటలకు గిట్టుబాటు ధరను కల్పించడం చాలా కీలకం. రైతు హక్కులు కూడా మానవ హక్కులే. దానిపై ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలి. వ్యవస్థాగతా రుణాలు కల్పించాలి. రైతులకు సరైన శిక్షణ ఇచ్చి లాభాలు పొందేటట్టు చేయాలి. సామాజికంగా పౌరులు, మీడియా, ఇతర స్వచ్ఛంద సంస్థలు రైతు సమస్యలను తీవ్రమైన, ముఖ్యమైన అంశంగా పరిగణించి ఆత్మహత్య నివారణ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. రైతు లేని రాజ్యం నిలువదు. రైతుని కాపాడుకుంటేనే రాజ్యం సస్యశ్యామలమవుతుంది. అందుకే రైతుల ఆత్మహత్యలను నిరోధించి, రైతుకు ముఖ్యమైన స్థానం ఇచ్చి కాపాడాలి. వ్యవసాయంలో మహిళలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి వారి సంక్షేమానికి ప్రత్యేక పథకాలు రూపొందించాలి. రుణాలు, రుణ హామీలు, రుణ బదిలీలు, మాఫీలు అన్నింటికి చట్టబద్ధత కల్పించి ప్రభుత్వాలు, బ్యాంకులు జవాబుదారీగా వ్యవహరించాలి.
2017, మార్చి 28న గుజరాత్‌లో రైతు ఆత్మహత్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో సిటిజన్స్ రిసోర్స్ అండ్ యాక్షన్ అండ్ ఇనిషియేటివ్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌పై తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు రైతు ఆత్మహత్యల అంశాన్ని చాలా ప్రాధాన్యాంశంగా పరిగణించింది. రైతులు చనిపోయాక పరిహారం ఇచ్చి అదే పరిష్కారం అనుకోవడమే తప్పని సూత్రీకరించింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మళ్లీ వాటిని చెల్లించకలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దశాబ్దాల తరబడి రైతులు చనిపోతున్నా ఆత్మహత్యల వెనుక అసలైన సమస్యను పరిష్కరించే చర్యలు లేకపోవడంపై సుప్రీం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రతి రంగాన్నీ కృత్రిమ మేధ ప్రభావితం చేస్తోంది. వ్యవసాయ రంగంలోనూ ఈ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో సాగు స్వరూపాన్ని ఏఐ పూర్తిగా మార్చివేసేలా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అనేక దేశాలు యాంత్రీకరణను దాటుకుని స్మార్ట్ వ్యవసాయం వైపు పరుగులు తీస్తున్నాయి. ఇండియాలోనూ అటు వైపు అడుగులు పడుతున్నాయి. కృత్రిమ మేధ, డేటా ఆధారిత పరిష్కారాలు సాగులో కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. 1960ల్లో వచ్చిన హరిత విప్లవంతో దేశీయంగా ఆహారోత్పత్తి గణనీయంగా పెరిగింది. అదే సమయంలో నీటికొరత, విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం వంటి సవాళ్లను సాగు రంగం ఎదుర్కొంటోంది. వీటికితోడు పంటలపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, భవిష్యత్ తరాలకు ఆహారభద్రతను అందించడానికి కృత్రిమ మేధ, బిగ్‌డేటా అనలిటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలు ఉపయోగపడతాయి.
వ్యవసాయంలో స్థిరత్వం సాధించటానికి ఏఐ ముఖ్య సహాయకారిగా మారుతోంది. డ్రోన్లు, సెన్సర్లు తదితరాల ద్వారా రైతులు నేల ఆరోగ్యం, వాతావరణ పరిస్థితులు, పంట పెరుగుదల, తెగుళ్ల గురించి తెలుసుకోవచ్చు. ఈ సాంకేతికతలు వనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి, నీటిపారుదల, పంటల రక్షణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడతాయి. ఏఐ ఆధారిత ముందస్తు విశ్లేషణల సాయంతో మార్కెట్ పోకడలను తెలుసుకొని, నష్టాలను తగ్గించుకోవచ్చు. నేల స్వభావం, పంట రకాలు, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను ఏఐ సాంకేతికత సూచిస్తుంది. వాటిద్వారా పర్యావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు పంటల ఉత్పాదకతను పెంచుకోవచ్చు. ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లు, మొబైల్ యాప్‌లతో ఉత్తమ వ్యవసాయ విధానాలను అన్నదాతలకు తెలియజెప్పవచ్చు. సహజవనరుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో ఏఐ, డేటా అనలిటిక్స్ కీలకపాత్ర పోషిస్తాయి. ఉపగ్రహ చిత్రాలు, భౌగోళిక సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా అటవీ నిర్మూలన, నేల క్షీణత, నీటి కాలుష్యాన్ని పర్యవేక్షించవచ్చు. పర్యావరణ వ్యవస్థలను, జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి ఇవి తోడ్పడతాయి.
ప్రపంచ జనాభా 2050 నాటికి వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. పెరిగే జనాభాకు అనుగుణంగా పంట దిగుబడులను సాధించాలి. ఆహార కొరతను అధిగమించడానికి ఉత్పాదకతను పెంచడమే పరిష్కారం. ఈ విషయంలో ప్రపంచంలోని చాలా దేశాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం వల్ల విత్తనాలు విత్తడానికి సరైన సమయాన్ని నిర్ణయించడం రైతులకు సవాలుగా మారింది. కృత్రిమ మేధ సహాయంతో కర్షకులు వాతావరణ పరిస్థితులను విశ్లేషించవచ్చు.
మన దేశంలో వ్యవసాయంలో ఏఐ, డేటా ఆధారిత అనువర్తనాలను విస్తృతంగా ఉపయోగించడానికి ప్రభుత్వ ఏజెన్సీలు, పరిశోధనా సంస్థలు, వ్యవసాయ సంఘాల సమష్టి కృషి అవసరం. ఇండియాలో ఎక్కువమంది చిన్న, సన్నకారు రైతులే. తమకున్న చిన్న కమతాల్లో ఆధునిక పరికరాలను వినియోగించడం వారికి సమస్యగా మారింది. భవిష్యత్తులో సాగు మొత్తం ఏఐ కేంద్రంగానే జరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా వ్యవస్థలను సమాయత్తం చేయడం ప్రభుత్వాల కర్తవ్యం.