Story Board: భారత్ కు ఘనమైన సంస్కృతి, గర్వపడే ఆధ్యాత్మిక వారసత్వం ఉన్నాయని మహా కుంభమేళాతో మరోసారి రుజువైంది. మహా కుంభమేళాకు ఉత్సాహంగా పోటెత్తిన భక్తులు.. మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో మరోసారి విశ్వవ్యాప్తంగా భారత్ పేరు మార్మోగిపోయింది. అసలు ఆధ్యాత్మిక క్రతువు ఎలా జరగాలో మహాకుంభమేళా నిరూపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో ప్రతి ఘట్టం రికార్డులు సృష్టించి.. మహా కుంభమేళా వైభవాన్ని చాటిచెప్పింది. పెద్ద సంఖ్యలో వీఐపీలు త్రివేణిసంగమంలో స్నానానికి తరలిరావడం.. భక్తుల్లో మరింత ఉత్సాహం పెంచింది. ఇన్ని కోట్ల మంది జనం.. అంతా బహిరంగ ప్రదేశంలో జరిగే వేడుక.. ఎవరూ నియంత్రించకుండానే.. భక్తులు స్వచ్ఛందంగా పాల్గొన్న మహా ఉత్సవం.. ప్రపంచాన్ని అబ్బురపరిచింది. నాగసాధువులు, అఘోరాలు, అఖాడాల రాకతో త్రివేణి సంగమానికి కొత్త కళ వచ్చింది. పుణ్యస్నానాలకు సమాంతరంగా పూజలు, యాగాలు, హోమాలు, ఆధ్యాత్మిక వాతావరణానికి కొత్త శోభ నిచ్చాయి. భారత్ లో కుంభమేళాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారో.. ప్రపంచమంతా కళ్లారా చూసింది. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభవానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.
మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 26న మహాశివరాత్రితో ఈ మహా క్రతువు ముగియనుంది. మహా కుంభమేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు ఉన్నాయి. ఇప్పటికే ఐదు పూర్తయ్యాయి. . ఇవి వరుసగా పుష్య పౌర్ణమి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమిరోజు వైభంగా జరిగాయి. చివరి రాజ స్నానం కుంభమేళా చివరి రోజైన మహా శివరాత్రి రోజు జరగనుంది. 45రోజుల పాటు ఘనంగా జరిగే మహాకుంభమేళాలో షాహీ స్నాన్‌లకు విశిష్టమైన స్థానం ఉంది. వీటినే అమృత స్నానాలని కూడా అంటారు. కుంభ మేళా సమయంలో సాధువులు, అఘోరాలు, భక్తులు త్రివేణీ సంగమ ప్రాంతంలో ఆరో, చివరి రాజ స్నానం చేస్తారు.
హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివ భక్తులు ఈ పండుగను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. మహా శివరాత్రి పర్వదినం రోజు శివ భక్తులు పరమేశ్వరుని ఆరాధిస్తారు. యేడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుందంటారు. ఇంతటి పరమ పవిత్రమైన మహా శివరాత్రి రోజు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో అమృత స్నానం చేయడం అరుదైన అవకాశం అంటున్నారు పండితులు.
ఇప్పటికే దేశంలో సనాతన ధర్మాన్ని పాటించే 110 కోట్ల హిందువుల్లో సగం మంది మూడు నదుల సంగమంలో స్నానాలు చేశారని, ఈ సంఖ్య మహాకుంభ్ ముగిసే ఈనెల 26వ తేదీ నాటికి 65 కోట్లు దాటుతుందని యూపీ సర్కారు చెబుతోంది. దేశంలోని దాదాపు 140 కోట్లు ఉన్న మొత్తం జనాభా పరంగా చూస్తే.. ఇప్పటి వరకు 38 శాతానికి పైగా ప్రజలు పుణ్యస్నానాలు చేశారని తెలిపింది. కాగా, మహాకుంభమేళా ప్రారంభానికి ముందు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని యోగి సర్కార్ అంచనా వేసింది. అయితే ఆ సంఖ్య ఈ నెల 14వ తేదీకే 50 కోట్లు దాటిందని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో అత్యధికంగా మౌని అమావాస్య రోజున దాదాపు 8 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేయడం కొత్త రికార్డు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అతిపెద్ద ఆధాత్మిక ఉత్సవం ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా. మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. తిరిగి ఇలాంటి ఉత్సవం రావాలంటే మరో 144 సంవత్సరాలు వేచి చూడాల్సిందే. దేశ విదేశాల నుంచి భక్తులు నదీ స్నానం చేయడానికి తరలి రావడం ఈ ఉత్సవానికి మరింత శోభను తెచ్చింది. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పవిత్ర మహాకుంభమేళా ఈ సంవత్సరం జనవరి 13 న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ కుంభమేళా ప్రధానంగా జరుగుతుంది.
ఇప్పటికే ఈ కుంభమేళాలో 60 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలను ఆచరించారు. డైరీలు, క్యాలెండర్లు, జనపనార సంచులు, స్టేషనరీ వంటి మహాకుంభ్ సంబంధిత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో మహాకుంభ్ స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది. పక్కా బ్రాండింగ్ కారణంగా అమ్మకాలు భారీగా పెరిగాయి. మహాకుంభ్ ప్రారంభానికి ముందు 40 కోట్ల మంది ప్రజలు వస్తారని, సుమారు రూ.2 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ, దేశవ్యాప్తంగా అపూర్వమైన ఉత్సాహం కారణంగా, ఫిబ్రవరి 26 నాటికి దాదాపు 65 కోట్ల మంది మహా కుంభ మేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఇది రూ .3 లక్షల కోట్లకు పైగా భారీ వ్యాపార టర్నోవర్ కు దారితీసే అవకాశం ఉంది. మహా కుంభ మేళాతో జరిగే బిజినెస్ ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించింది. కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించింది. ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాల రంగం; రవాణా, లాజిస్టిక్స్; మతపరమైన వస్త్రాలు; పూజా సామగ్రి, హస్తకళలు, వస్త్రాలు, దుస్తులు, ఇతర వినియోగ వస్తువులు; ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సేవలు; మీడియా, ప్రకటనలు, వినోదం; పౌర సేవలు; టెలికాం, మొబైల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికత, సిసిటివి కెమెరాలు, సహా అనేక వ్యాపార రంగాలు పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలను చూశాయి.
కాగా, మహాకుంభ్ ఆర్థిక ప్రయోజనాలు ప్రయాగ్ రాజ్ కు మాత్రమే పరిమితం కాదనే అభిప్రాయాలున్నాయి. ప్రయాగ్ రాజ్ కు 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలు కూడా గణనీయమైన వ్యాపార వృద్ధిని చవిచూశాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయని చెబుతున్నారు. అదనంగా, అయోధ్య, వారణాసి, ఇతర సమీప మతపరమైన ప్రదేశాలలో యాత్రికుల సందర్శనలు పెరిగాయి. ఇది ఈ ప్రాంతాల్లో భారీ ఆర్థిక కార్యకలాపాలను మరింత పెంచింది. కాగా మహా కుంభ మేళా సందర్భంగా.. ప్రయాగ్ రాజ్ మౌలిక సదుపాయాలైన ఫ్లైఓవర్లు, రోడ్లు, అండర్ పాస్ ల అభివృద్ధికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.7500 కోట్లు ఖర్చు చేసింది.