Story Board: కొద్దిరోజుల క్రితం మోహన్ భగవత్ 75 ఏళ్లకు రిటైర్మెంట్ పై చేసిన వ్యాఖ్యల గురించి పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అంతకంటే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎందుకంటే సమీప భవిష్యత్తుపై భరోసా లేని రాజకీయం నడుస్తున్న ఈరోజుల్లో ఏకంగా 2047 దాకా మోడీనే దేశానికి ప్రధానిగా ఉంటారన్న రాజ్‌నాథ్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ఈ అంశంపై ప్రాక్టికల్ పాజిబులిటీ గురించి ఎలాగో అభిప్రాయాలు వస్తున్నాయి. అప్పటిదాకా ఉండేదెవరు, ఊడేదెవరూ అనే కామెంట్లు ముందే వచ్చాయి. ఇంకా అప్పటిదాకా బీజేపీనే గెలుస్తూ ఉంటుందా అనేది మరో అభిప్రాయం. ఈ మాత్రం రాజ్‌నాథ్ సింగ్ కు తెలియదనుకోలేదం. కానీ ఆయన వ్యాఖ్యల్లో ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలంటున్నారు విశ్లేషకులు. బీజేపీలో మోడీకి ఎలాంటి స్థానం ఉందో చెప్పడమే రాజ్‌నాథ్ ప్రధాన ఉద్దేశం. కనీసం మరో పదేళ్ల దాకా బీజేపీలో నాయకత్వం గురించిన చర్చకు ఆస్కారం లేదన్నట్టుగా రాజ్‌నాథ్ సంకేతాలిచ్చారు. ఇదే విషయాన్ని గతంలో ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ కూడా పరోక్షంగా చెప్పారు. మోడీని ఉద్దేశించి తాను రిటైర్మెంట్ వ్యాఖ్యలు చేయలేదని వివరణ కూడా ఇచ్చారు. అప్పుడు మోహన్ భగవత్, ఇప్పుడు రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే.. పార్టీ పరంగా, ఆరెస్సెస్ పరంగా మోడీకి రిటైర్మెంట్ నుంచి మినహాయింపు వచ్చేసిందని చెప్పుకోవచ్చు.
1980 నుంచి తనకు మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజ్‌నాథ్ గుర్తుచేసుకున్నారు. ప్రజలతో సులభంగా కలిసిపోయే అరుదైన సామర్థ్యం మోదీ సొంతమని ప్రశంసించారు. ఎంతటి సంక్లిష్ట సమస్యలనైనా సులువుగా పరిష్కరించగలరని, క్లిష్టమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని కొనియాడారు. అంతర్జాతీయ సమస్యలపై కూడా ప్రపంచ దేశాల నాయకులు మోదీ సలహాలు తీసుకుంటారని తెలిపారు. ఇందరు ప్రపంచ నాయకుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న మరో ప్రధానిని తాను చూడలేదని అన్నారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, ‘ఆపరేషన్ సిందూర్’కు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం మోదీ వ్యవహార శైలికి నిదర్శనమని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే సమయంలో సీనియర్ నేత ఎల్.కె. అద్వానీని అగౌరవపరచలేదని, ఆనాడు దేశ ప్రజలే మోదీ నాయకత్వాన్ని కోరుకున్నారని ఆయన పేర్కొన్నారు.
నిజానికి రాజ్‌నాథ్ వ్యాఖ్యలు అనుకోకుండా చేసినవి కాదనే వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే కొద్దిరోజుల ముందే.. 2047 గురించి, వికసిత్ భారత్ లక్ష్యం గురించి స్వయంగా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా టీవీ సలాం ఇండియా షోలో ఆయన మాట్లాడారు. దేవుడు తననో ప్రత్యేక కార్యం మీద పంపాడని తనకు అనిపిస్తోందన్నారు. దేవుడు తనకు దారిచూపించడమే కాకుండా శక్తినిచ్చాడని, 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యం నెరవేర్చే వరకు దేవుడు తనను పైకి పిలవడని విశ్వాసం ఉందని చెప్పారు. ఈ భూమ్మీద ఇంకా తాను ఎక్కాల్సిన మెట్లేవీ లేవన్నారు. ప్రస్తుతం 74 ఏళ్ల వయసున్న మోదీ ఈ వ్యాఖ్యల ద్వారా మరో రెండు దశాబ్దాలు దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. 400 సీట్ల నినాదం బీజేపీది కాదని, జనం నుంచి వచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చూస్తే.. దీనికి కొనసాగింపుగానే ఇప్పుడు రాజ్‌నాథ్ మాట్లాడారనుకోవటానికి అవకాశం కనిపిస్తోంది.
ఇక్కడ మోడీ నాయకత్వానికి కేవలం బీజేపీ, ఆరెస్సెస్ నుంచే కాదు దేశ ప్రజల నుంచి కూడా పెద్దగా అభ్యంతరాల్లేవంటే అతిశయోక్తి కాదు. అందుకు కావాల్సినట్టుగా గత పదకొండేళ్లుగా మోడీ రంగం సిద్ధం చేసుకున్నారు. అత్యంత సాధారణ జీవితం నుంచి.. దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన ఘనత నరేంద్ర మోడీ సొంతం. మోడీ.. ఎన్నో విషయాల్లో తన ప్రత్యేకత చూపించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదు. కానీ చాలా కొద్ది మంది నేతలు మాత్రమే తమ మాట ప్రజలే వినేలా చేయగలరు. స్వతంత్ర భారత చరిత్రలో అలాంటి నేతలు అతికొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో మోడీ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతగా ఆయన దేశప్రజలతో కనెక్ట్ అయ్యారు.
ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షల మధ్య దేశ ప్రజలు 2014లో మోడీకి తొలిసారిగా ప్రధాని అవకాశం ఇచ్చారు. మోడీ వేవ్ ఏ రేంజ్ లో ఉందంటే.. ఆయన ధాటికి ఎన్నో రాజకీయ వటవృక్షాలు కూలిపోయాయి. బీజేపీకి ఏమాత్రం పట్టులేని ప్రాంతాల్లో కూడా మోడీ గాలి వీచింది. అంతకుముందు పన్నెండేళ్ల పాటు గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయం చేసిన మోడీ.. అదే ఒరవడిని ఢిల్లీ వచ్చాకా కొనసాగించారు. రాజకీయ జీవితంలో ఓటమన్నదే ఎరుగని తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. మోడీ తెచ్చిన ఊపుతో దేశంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ జెండా రెపరెపలాడింది. దశాబ్దాలుగా బీజేపీకి ప్రాతినిధ్యమే లేని రాష్ట్రాల్లో కూడా అధికార పీఠం దక్కడంతో.. బీజేపీలో నమో జపం కూడా ఎక్కువైపోయింది.
ప్రధానిగా పరిపాలనపై కూడా మోడీ తనదైన ముద్ర వేశారు. అవినీతికి తావిచ్చేది లేదని అధికార బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కార్యదర్శులకు స్పష్టం చేశారు. అన్నట్టుగానే చాలావరకు కేంద్ర పథకాల్లో నిధులు వృథాను అరికట్టారనే పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో రాష్ట్రాలను లెక్కలడిగి ముఖ్యమంత్రుల్ని చిన్నబుచ్చారనే విమర్శలూ ఎదుర్కున్నారు. పైకి టీమిండియా అని చెబుతూ.. పెద్దన్న పాత్రే పోషిస్తున్నారని బీజేపీయేతర సీఎంలు మోడీ గురించి ఎన్ని విమర్శలు చేసినా.. ప్రజలు మాత్రం నమ్మలేదు. మోడీ నిజాయతీపరుడు, ఆయన ఏం చేసినా పేదల మంచి కోసమే చేస్తారని గట్టిగా విశ్వసించారు.
రాజకీయంగా కూడా మోడీ గణనీయమైన విజయాలు సాధించారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్థానిక బీజేపీ నేతల్ని కాకుండా.. మోడీని చూసే కాషాయ పార్టీని గెలిపించారు. మోడీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా, అసలు ఆ స్థాయి వ్యక్తులెవరూ లేరని ప్రత్యర్థులు గుర్తుచేసినా.. ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. సీఎంగా ఎవరున్నా.. తానే ఢిల్లీ నుంచి అన్నీ మానిటర్ చేస్తానన్న మోడీ మాటపై నమ్మకం ఉంచారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో చాలా కాలం తర్వాత బీజేపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 400 సీట్లతో అధికార పీఠం అధిష్ఠించింది. యూపీ సీఎంగా ఎవర్ని కూర్చోబెడతారా అని ఆసక్తిగా ఎదురుచూసిన విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తూ.. యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు మోడీ. అప్పటిదాకా యూపీలో చక్రం తిప్పిన ఎస్పీ, బీఎస్పీ పార్టీల్ని పూర్తిగా బలహీనపడేలా చేయడంలో మోడీ గాలి బాగా ఉపయోగపడింది.
కేంద్రంలో అధికారం వచ్చినప్పట్నుంచీ హరియాణా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, గోవా లాంటి పలు రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. చివరకు కశ్మీర్లో కూడా పీడీపీతో పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మోడీ చరిత్ర సృష్టించారనే చెప్పాలి. ఈ విజయాలన్నీ ఒక ఎత్తైతే.. త్రిపురలో దశాబ్దాల కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దె దించడం, ఈశాన్య భారతంపై తిరుగులేని పట్టు సాధించడం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక ఒడిషాలో బలమైన నవీన్ పట్నాయక్ ను గద్దె దించి.. అక్కడ బీజేపీ గెలవటం.. ఇటీవలే జరిగిన పరిణామం. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్లకు, మోడీ పేరు కారణంగా మరో పది శాతం ఓట్లు జత కలుస్తున్నాయని అన్ని పార్టీలూ ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉంది. ఆ రేంజ్ లో దేశ ప్రజలందరి నమ్మకాన్ని చూరగొన్నారు మోడీ.
హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేసినా, అప్పటిదాకా ఉన్న పన్నులన్నీ రద్దు చేసి.. ఒకే దేశం ఒకే జీఎస్టీ అన్నా.. ప్రజలందరూ మోడీ నిర్ణయాలు స్వాగతించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా చేతిలో డబ్బుల్లేక.. సొంత డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి కూడా ప్రజలు గంటల కొద్దీ క్యూలో నిలబడ్డారు. వంద మందికి పైగా ఇలా క్యూలైన్లలో ప్రాణాలు విడిచారనే విమర్శలొచ్చినా.. మెజార్టీ ప్రజలు నోట్లరద్దుతో నల్లధనం రద్దవుతుందని బలంగా నమ్మారు. మోడీ ఏం చేసినా ప్రజల మంచికే చేస్తారని విశ్వసించారు. జీఎస్టీ కారణంగా రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతుందని రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెట్టినా.. చాలా మంది ప్రజలు మాత్రం పన్నుల భారం తప్పుతుందని సంతోషించారు. మోడీ వచ్చాక ప్రాంతీయవాదం బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జాతీయ వాదం పెరగడం మొదలైంది. అంతకుముందు కేంద్రం ఏం చేసినా రాష్ట్ర కోణంలో ఆలోచించిన ప్రజలు కూడా.. మోడీ ప్రధాని అయ్యాక మాత్రం మొదట జాతీయ కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకున్నారు. ఇది కచ్చితంగా మోడీ సాధించిన ఘనతే అని చెప్పక తప్పదు. అలాగని మోడీ దారి ప్రతిసారీ రహదారే కాదు. కొన్నిసార్లు అడుగు వెనక్కివేయాల్సిన పరిస్థితులూ లేకపోలేదు. అప్పుడూ కూడా ఎక్కడ తగ్గేవాడో తెలిసినవాడే నాయకుడని మోడీ దేశ ప్రజల ముందు నిరూపించుకున్నారు. ఇంతటి బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి.. ధైర్యంగా 2047దాకా ప్రధాని పదవికి ఖాళీ లేదని రాజ్‌నాథ్ ధైర్యంగా చెప్పగలిగారు.