Story Board: మావోయిస్టులకు కొంతకాలంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజల కోసం మొదలైన ఉద్యమం.. చివరకు మావోయిస్టులు వర్సెస్ పోలీసులుగా మారింది. ఈ పోరు ఐదు దశాబ్దాల పాటు రాజీలేని విధంగా సాగింది. గతంలో ఓసారి పోలీసులది పైచేయి అయితే.. మరోసారి మావోయిస్టులది పైచేయి ఉండేది. ప్రతీకార దాడులు కూడా జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పోరాటం ఏకపక్షమైపోయింది. ఎక్కడ చూసినా మావోయిస్టుల ఎన్‌కౌంటర్లే తప్ప.. పోలీసుల మరణాలు కనిపించడం లేదు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిన ఉద్యమం.. శరవేగంగా బలహీనపడుతూ.. క్లైమాక్స్ దశకు వచ్చేసింది. ఇంకా సూటిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు డీల్ చేసినన్నాళ్లూ నిలదొక్కుకున్న మావోయిస్టు ఉద్యమం.. కేంద్రం సీరియస్‌గా దృష్టి పెట్టాక కోలుకోలేకపోయింది. మొదట్లో రాష్ట్ర పోలీసులే మావోయిస్టులపై పోరాడేవారు. వారికి కేంద్ర బలగాలు సహకరించేవి. కానీ రెడ్ కారిడార్ ప్రకటన తర్వాత కేంద్రం వ్యూహం మార్చింది. కేంద్ర బలగాలే ముందుండి మావోయిస్టులతో పోరాడుతుంటే.. రాష్ట్ర పోలీసులు వారికి సహకారం అందిస్తున్నారు. యుద్ధక్షేత్రంలోకి కేంద్ర బలగాల రాకతో.. అత్యాధునిక సాంకేతికత కూడా రంగప్రవేశం చేసింది. మరోవైపు ఆధునిక ఆయుధాలకే దూరమైన మావోయిస్టులు.. సాంకేతికతకు కౌంటర్ ఇవ్వలేక ఎన్‌కౌంటర్ కావడమో.. పారిపోవడమో చేస్తున్నారు. ఈ దుస్థితిని చూసే అగ్రనేతలనుకున్న వారు కూడా ఉద్యమానికి భవిష్యత్తు లేదనే భావనతో భారీ సంఖ్యలో క్యాడర్ ను తీసుకుని మరీ లొంగిపోతున్నారు.
ఈ ఏడాది మే నుంచే మావోయిస్టులకు వరుసగా బలమైన ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ అలియాస్ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ కావడం.. మావోయిస్టులకు పెద్ద షాక్.. ఆ వెంటనే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తుపాకులు వదిలేసి.. చర్చలకు వెళ్లడం మంచిదని లేఖ విడుదల చేశారు. దానికి మావోయిస్టులు సుముఖత చూపకపోవడంతో.. ఆయన మహారాష్ట్రలో ప్రభుత్వానికి లొంగిపోయారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే మరో అగ్రనేత ఆశన్న కూడా క్యాడర్‌తో సహా లొంగిపోయారు. ఈ పరిణామాలతో మావోయిస్టుల నైతికస్థైర్యం సడలినా.. హిడ్మా ఉన్నాడు కదా అనే ఆఖరి ఆశ గట్టిగా కనిపించింది.
హిడ్మా మీద మావోయిస్టులు గంపెడాశలు పెట్టుకోవటానికి చాలా కారణాలున్నాయి. బస్తర్ ప్రాంతంలో పుట్టిన గిరిజనుడైన హిడ్మాకు.. స్థానిక ఆదివాసీ గూడేల్లో మంచి పట్టుంది. దండకారణ్యం హిడ్మాకు కొట్టిన పిండి. ఇప్పటివరకు అక్కడ జరిగిన 14 ఎన్‌కౌంటర్లు, 50కి పైగా ఆపరేషన్ల నుంచి హిడ్మా తృటిలో తప్పించుకున్నాడు. అప్పటిదాకా బలగాలపై పోరాడుతూ.. ఉన్నట్టుండి క్షణాల్లో మాయమయ్యేవాడు. దాదాపు 300 మందిని చంపిన హిడ్మా.. భద్రతా దళాలకు సింహస్వప్నంగా నిలిచాడు. అందుకే ఎక్కడ హిడ్మా ఉంటే.. అక్కడ బలగాలుండవని మావోయిస్టులు బలంగా నమ్ముతారు. చివరకు కేంద్ర కమిటీ సభ్యులు కూడా మొన్నటిదాకా హిడ్మా రక్షణలోనే ఉన్నారు. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నా.. హిడ్మా సజీవంగా ఉంటే.. మళ్లీ క్యాడర్ ను సమీకరించగలరనే నమ్మకంతో అగ్రనేతలున్నారు. కానీ దండకారణ్యంలో తిరుగులేని హిడ్మా.. నిర్బంధం పెరగడంతో.. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లోకి వెళ్లి.. అక్కడ తొలి దెబ్బలోనే హతమయ్యాడు. హిడ్మా ఎన్‌కౌంటర్ అయిన తీరు స్థానబలాన్ని కోల్పోయిన మొసలిని గుర్తుకుతెచ్చిందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.
2026 మార్చి 31 నాటికి మావోయిస్టుల్ని ఏరేస్తామని ప్రకటించిన కేందం ఆలోపే లక్ష్యాన్ని సాధించేందుకు ఉరకలు వేస్తోంది. ఒకవైపు అధినాయకులు లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లు జరుగుతుంటే, ఇక తమ పోరాటం ఎందుకు , ఎవరికోసమన్న అంతర్మథనం కేడర్ లో వినిపిస్తోంది. గత ఐదేళ్లలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, వైద్య సేవలతో ఆదివాసీలకు దగ్గరవుతూ వచ్చిన బలగాలు.. వారి ద్వారా మావోల సమాచారం తెలుసుకున్నాయి. టైమ్ చూసి అటాక్ చేయడం మొదలు పెట్టాయి. ఈ ఏడాది జనవరి నుంచి మరింత దూకుడు పెంచాయి బలగాలు. మావోయిస్టుల గుప్పెట్లోని ప్రాంతాలన్నింటిని ఒక్కొక్కటిగా బలగాలు చేజిక్కించుకోవడం స్టార్ట్ చేశాయి. 2024 ప్రారంభం నుంచి వరుస ఎన్‌కౌంటర్లతో ఛత్తీస్‌గఢ్ అడవులు దద్దరిల్లుతున్నాయి.వరుస పెట్టి మావోయిస్టు అగ్రనేతలు చనిపోతుండడం ఆ సంస్థకు దెబ్బ మీద దెబ్బగా చెప్పాలి. మావోయిస్టులపై పోలీసుల ద్విముఖ వ్యూహం ఫలిస్తోంది. ఓ వైపు ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్ కౌంటర్లు.. మరో వైపు లొంగుబాట్లను ప్రోత్సహిస్తుండంతో మావోయిస్టు పార్టీ భారీగా నష్టపోతోంది.
స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్డీ, సీ-60, ఎస్‌వోజీ బలగాలతో 20 వేల మంది పోలీసులు, జవాన్లు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, భారీ వెహికల్స్ సహాయంతో ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దేశంలో 2014 లో 126 జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు విస్తరించి ఉండగా.. 2024 నాటికి 38 జిల్లాలకు తగ్గిపోయింది. అదికాస్తా ఈ ఏడాదిన్నర వ్యవధిలో చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుకుమా, జార్ఖండ్‌లోని వెస్ట్‌సింగ్‌భూమ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలకు పరిమితమైంది. మావోయిస్టులకు పెట్టని కోట అయిన దండకారణ్యం ఇప్పుడు మావోయిస్టు ఫ్రీజోన్‌గా మారింది. ఒకప్పుడు మావోయిస్టులకు బలమైన స్థావరాలుగా ఉన్న అబూజ్‌మడ్ అడవులు, బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతం, కర్రెగుట్టలు.. ఇలా ఒక్కో ప్రాంతాన్ని భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. చివరకు మావోయిస్టులు షెల్టర్ జోన్‌ల కోసం అన్వేషిస్తూ.. ఏవోబీ మీదుగా ఏపీలోని మైదాన ప్రాంతాలకు వచ్చారు. అంతకుముందే తెలంగాణ పోలీసుల కూంబింగ్ ముమ్మరం కావడంతో.. రాష్ట్రంలోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. మొదట ఏపీ పోలీసుల్ని తక్కువ అంచనా వేసిన మావోయిస్టులు.. ఇప్పుడు ఒకేసారి భిన్నప్రాంతాల్లో పలువుర్ని అదుపులోకి తీసుకోవడంతో.. ఉద్దేశపూర్వకంగా ట్రాప్‌లో పడేలా చేశారని భావిస్తున్నారు.
దీనికి తోడు మావోయిస్టు అగ్రనేతల్లో నెలకొన్న సైద్దాంతిక విభేదాలతో మావోయిస్టు పార్టీ క్యాడర్ సతమతమవుతోంది. ఆయుధాలు వీడి జనంతో కలిసి పోరుబాట పట్టాలని కొందరు.. ఆయుధాలు వీడేది లేదు.. సాయుధ పోరాటమే తమ ఊపిరి అని మరికొందరు మావోయిస్టులు బహిరంగంగా లేఖలు రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ పరిస్థితులను పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై అణచివేతను తీవ్రతరం చేయడంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా దండకారణ్యానికి మకాం మార్చారు. ఇక్కడ నార్త్ బస్తర్, మాడ్, గడ్జిరౌలి, సౌత్ బస్తర్, పీఎల్జీఏకమిటీలదే కీలకపాత్ర. ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్ల సంగతి పక్కనపెడితే.. మిగిలిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్లారెడ్డి ఎక్కడున్నారనేది సస్పెన్స్‌గా మారింది. పోలీసుల అదుపులో ఉన్నారని, లేరని భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మావోయిస్టు సుప్రీం గణపతి ఆచూకీపైనా భిన్నకథనాలు వస్తున్నాయి. అయితే ఎవరేమనుకున్నా.. మావోయిస్టులు ఓటమి తప్పని యుద్ధం చేస్తున్నారని అందరూ ఫిక్సైపోతున్నారు.