టెస్టులు, వన్డేలతో మెల్లగా సాగుతున్న క్రికెట్ లో ఐపీఎల్ సునామీలా వచ్చింది..ఆటను బిజినెస్‌గా మార్చటం ఎలాగో చూపింది..
వేల కోట్ల రెవెన్యూ జెనరేట్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.ఒక్క మాటలో చెప్పాలంటే, ఐపీఎల్ ఓ ట్రెండ్ సెట్టర్.
అందుకే ఇప్పుడు ఐపీఎల్ ప్రసారహక్కుల వేలం సంచలనంగా మారింది..బీసీసీఐ ఖజానాలోకి వేల కోట్లు వచ్చిపడ్డాయంటే, ఐపీఎల్ ఎంత సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
ఐపీఎల్ అంటే నిన్నటిదాకా పరుగుల వర్షం. సిక్సుల సునామీ.. ధనాదన్ మ్యాచ్ లు, ఉత్కంఠరేపే పోరు. ఇప్పుడు ఐపీఎల్ అంటే కాసుల వరద కూడా. క్యాష్ రిచ్ లీగ్ గా ఐపీఎల్ కి గుర్తింపు వచ్చి చాలా కాలమైంది. ఆ పేరును కంటిన్యూ చేస్తూ సరికొత్త రికార్డులతో ముందుకు సాగుతోంది ఐపీఎల్. మీడియా హక్కుల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించింది. ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రాబోయే ఐదేళ్ల కాలానికి బీసీసీఐ రూ. 48,390 కోట్ల ఆదాయాన్ని పొందనుంది. టీవీ ప్రసారాలు, డిజిటల్ హక్కుల ద్వారా రానున్న భారీ మొత్తంతో బీసీసీఐ.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రీడా లీగ్ గా అవతరించింది.
రాబోయే ఐదు సీజన్లకు గాను 410 మ్యాచులను నిర్వహించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఒక్కో మ్యాచ్ విలువ రూ. 118 కోట్లు. ఇక మ్యాచ్ లో ఒక బౌలర్ వేసే ఓవర్ విలువ రూ. 2.95 కోట్లుగా ఉంది. అంటే, ఓవర్ లో ఒక్కో బంతి విలువ ఏకంగా రూ. 49 లక్షలన్నమాటే.. ఈ లెక్కలు చూస్తే, రాబోయే సీజన్లలో ఐపీఎల్ ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2017-2022 కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కులు రూ. 16,347.50 కోట్లుగా ఉంటే, 2023-27 కాలానికి అవి దాదాపు మూడింతలయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా అతధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆటల్లో మొదటి స్థానంలో ఫుట్ బాల్ ఉంటే రెండో స్థానంలో క్రికెట్ ఉంది. కానీ ఇంకొన్ని రోజులు అయితే అది రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫుట్ బాల్ సెకండ్ ప్లేస్ లోకి వెళ్లేలా కనిపిస్తోంది. అయితే ఫుట్ బాల్ లో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ అనేది ఎంత పాపులరో క్రికెట్ లో మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా అంతే పాపులర్. కానీ ఇప్పుడు ఈపీఎల్ కంటే మన ఐపీఎల్ బెస్ట్ అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలోని నేషనల్ ఫుట్ బాల్ లీగ్ ను అత్యంత ఖరీదైన క్రీడా ఆస్తిగా పరిగణిస్తున్నారు. NFLలో ఒక్కో మ్యాచ్ విలువకు 133 కోట్లుగా ఉంది. ఐపీఎల్ లీగ్ మీడియా హక్కుల విలువ రూ.48వేల 390 కోట్లు పలికిందంటే, ఐపీఎల్-16 నుంచి ప్రతి మ్యాచ్ విలువ రూ. 118 కోట్లుగా ఉండనుంది. దీంతో ఐపీఎల్ ప్రపంచంలోనే రెండో ఖరీదైన గేమ్‌గా మారింది. అతి త్వరలోనే NFLను అధిగమించి.. వరల్డ్ కాస్ట్లీ గేమ్ క్రికెట్ అవతరించబోతోందనే చెప్పాలి. వరల్డ్ ఫేమస్ అయిన ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ ఇవన్ని ఐపీఎల్ ఆదాయం ముందు దిగదుడుపే. మీడియా ప్రసార హక్కుల కోసం దిగ్గజ సంస్థలు దాదాపు 50 వేల కోట్లు పెడుతున్నాయంటే, భారత్‌లో క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని, అభిమానాన్ని తెలియజేస్తుంది.
ఒకప్పుడు తనలాంటి ఆటగాళ్లు కేవలం కొన్ని వందల రూపాయలతో సరిపెట్టుకుంటే.. ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమా అని ఆటగాళ్లు కోట్లు సంపాదించగలుగుతున్నారని సౌరభ గంగూలీ అంటున్నాడు. భారత్‌లో ఐపీఎల్ అభిమానుల్లోంచి పుట్టింది. దీనిని అభిమానులు, ప్రజలే నడిపిస్తున్నారని అంటున్నాడు.
2008లో ప్రారంభమైన ఐపీఎల్.. అంచెలంచెలుగా ఎదిగింది. వందల కోట్ల నుంచి బిజినెస్ వేల కోట్లకు ఎదిగింది. ఇది రానున్న రోజుల్లో లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిందేమి లేదు. ఐపీఎల్ నుంచి మరింత ఇన్‌కమ్ రాబట్టేందుకు కొత్త ప్రణాళికలు రచిస్తోంది బీసీసీఐ. ఇప్పటికే రెండు జట్లను అదనంగా లీగ్‌లో చేర్చగా.. రానున్న రోజుల్లో ఐపీఎల్‌ను మరింత విస్తరించాలనే ఆలోచన చేస్తోంది. ఆ రెండు ఫ్రాంచైజీల ద్వారా దాదాపు 12 వేల కోట్ల రూపాయలు ఆర్జించింది.రాబోయే ఐదేళ్ల కాలంలో 2025 నుంచి ప్రతి ఐపీఎల్ సీజన్‌లో 94 మ్యాచ్‌లు జరిగే అవకాశం కనిపిస్తోంది. అంతేగాక ఒకే ఏడాదిలో రెండు ఐపీఎల్ సీజన్లను నిర్వహించాలని కూడా డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా అది జరుగుతుందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.
ప్రాంఛైజీ హక్కులు, మీడియా ప్రసార హక్కులతో పాటు టైటిల్ స్పాన్సర్‌గా ఉండే కంపెనీల నుంచి బోర్డుకు ఆదాయం వెల్లువలా వచ్చి పడుతోంది. వివిధ మార్గాల్లో బోర్డు గల్లా పెట్టె నిండిపోతోంది. గతంలో తక్కువగా ఉన్న టైటిల్ స్పాన్సర్ షిప్ ధర.. ఇప్పుడు ఏకంగా పదింతలు పెరిగింది. గత కొన్నాళ్లుగా టైటిల్ స్పాన్సర్ షిప్‌గా ఉన్న వివో స్థానంలో.. ఇప్పుడు టాటా గ్రూప్ వ్యవహరిస్తోంది. ఇందు కోసం బీసీసీఐకి ఆ సంస్థ వందల కోట్లు ముట్టజెప్పింది. ఇది కూడా రెండేళ్ల కాలానికే. ముగిసే సమయం కూడా దగ్గర పడుతుండడంతో.. మళ్లీ టైటిల్ స్పాన్సర్‌షిప్ రేసులోకి వచ్చేందుకు పలు సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి వచ్చే ఆదాయం చూస్తే.. ఎవరైనా ఔరా అనాల్సిందే. ప్రస్తుతం దేశంలో ఉన్న చిన్న రాష్ట్రాల కంటే.. బీసీసీఐకి వచ్చే ఆదాయమే ఎక్కువ అంటే ఆశ్చర్యపడాల్సిందే. కానీ ఇది నిజం.
2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రారంభం అయినప్పుడు రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. విమర్శలు చేసిన వారు కూడా ఉన్నారు. 15 ఏళ్లు తిరిగేసరికి.. ఎవరూ అందుకోలేని స్థాయికి ఐపీఎల్ చేరుకుంది. అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలాంటి దేశాలు కూడా ఒక్కసారి.. ఐపీఎల్ వైపు తిరిగి చూసేలా చేస్తున్నాయ్. అన్ని రకాల మీడియా ప్రసార హక్కులు కలిపి 48వేల కోట్లు దాటిందంటే, ఐపీఎల్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
2008లో ఐపీఎల్ ప్రారంభం అయినప్పుడు పదేళ్ల కాలానికి రూ. 8వేల 200 కోట్లకు చెల్లించి సోనీ పిక్చర్స్ ప్రసార హక్కులను దక్కించుకుంది. 2015లో ఐపీఎల్ గ్లోబల్ డిజిటల్ రైట్స్‌ను మూడేళ్ల కాలానికి గానూ 302.2 కోట్లకు నోవి డిజిటల్ సొంతం చేసుకుంది. 2017 సెప్టెంబర్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో సోనీ పిక్చర్స్‌ను వెనక్కి నెట్టి స్టార్ ఇండియా ఐపీఎల్ ప్రసార హక్కులను ఏకంగా 16వేల 347 కోట్లకు దక్కించుకుంది. ఇదే సంస్థ ఇప్పుడు కేవలం టీవీ రైట్స్‌కు మాత్రమే 23వేల 575 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ప్రసార హక్కుల ద్వారా మొత్తం 50వేల కోట్లు వస్తాయన్న బీసీసీఐ అంచనాలు దాదాపు నిజం అయ్యాయి. ఇప్పటికే గల్లాపెట్టె గలగలతో.. రిచ్‌గా కనిపిస్తున్న బీసీసీఐ ఖజానా.. ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అవుతోంది.
2023 ఐపీఎల్ సీజన్‌లో 74 మ్యాచ్‌లు జరుగుతాయ్. 2025లో ఆ నంబర్ 84కు పెరుగుతుంది. 2027లో 94 మ్యాచ్‌లు జరుగుతాయ్. ప్రతీ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగుతుండడం.. ఐపీఎల్ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో మల్టీనేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా యాడ్స్ ఇవ్వడానికి పరిగెత్తుకు వస్తున్నాయి. అవే బ్రాడ్‌కాస్టర్లకు ఫుల్ భరోసా ఇస్తున్నాయి. ఎంతకైనా తగ్గేదేలే అంటూ ప్రసార హక్కుల కోసం బిడ్స్ వేసేలా చేశాయి.
ఐపీఎల్ క్రీడా ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. వేల కోట్ల ఆదాయంతో బీసీసీఐ దూసుకుపోతోంది. క్రికెట్ ప్రపంచంలోనే కాస్ట్లీ గేమ్‌గా మారబోతోంది. IPL విషయంలో బీసీసీఐ జాక్ పాట్ కొట్టేసిందనే చెప్పాలి. ఐపీఎల్ ని మొదలు పెట్టే సమయంలో ఈ రేంజ్ లో క్లిక్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఐపీఎల్ మీడియా రైట్స్ ను సొంతం చేసుకునేందుకు చానెల్స్ ఓ రేంజ్ లో పోటీ పడ్డాయి. దాంతో మీడియా రైట్స్ ధర ఆకాశానికి తాకింది. అయితే, గతంలో లాగా ఐపీఎల్ మీడియా రైట్స్ ను ఒకే ప్యాకేజీ కింద బీసీసీఐ విక్రయించలేదు. ఈసారి మీడియా రైట్స్ ను నాలుగు విభాగాలుగా విభజించింది. దీంతో కాసుల వర్షం కురిసింది.
మీడియా రైట్స్ ని గ్రూప్ ఎ, బి, సి, డిలుగా విభజించింది. ఎ విభాగంలో టీవీ రైట్స్ ను మాత్రమే ఉంచిన బీసీసీఐ.. గ్రూప్ బిలో డిజిటల్ రైట్స్ ను సిలో ఎక్స్ క్లూజివ్ రైట్స్ ను, గ్రూప్ డిలో ఉపఖండం ఆవల మ్యాచ్ లను ప్రసారం చేసే రైట్స్ ను ఉంచింది. టీవీ రైట్స్ కోసం సోనీ గ్రూప్, డిస్నీ స్టార్ పోటీపడితే, చివరకు డిస్నీ స్టార్ రూ. 23, 575 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక డిజిటల్ రైట్స్ ను రిలయన్స్ కు చెందిన వయాకమ్ 20 వేల 500 కోట్లకు సొంతం చేసుకున్నాయి.
1928లో ఏర్పడిన బీసీసీఐ, చాలా కాలం నిధుల లేమితోనే ఉంది. 1983లో వాల్డ్ కప్ గెలిచినపుడు కూడా భారత క్రికెట్ లో పెద్దగా డబ్బు లేదు. ఆ తర్వాత కాలంలో పెరిగిన క్రేజ్ తో ఓ పదేళ్ల తర్వాత లాభాల బాటపట్టింది. 1992 వరకు కూడా మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేసేంత శక్తి కూడా బీసీసీకి లేదు. అప్పట్లో మ్యాచ్‌ను టెలికాస్ట్ చేయడానికి బీసీసీఐనే రివర్స్‌లో దూదర్శన్‌కు మ్యాచ్‌కు రూ. 5 లక్షలు ఇచ్చేదంటే నమ్మగలరా? 1996 వరల్డ్‌కప్ హక్కులను కూడా ఇండియా దక్కించుకోవడంతో ఇక బోర్డు వెనుదిరిగి చూడలేదు. ఇప్పుడు బీసీసీఐ టోర్నీల ప్రసారానికి అంతర్జాతీయ చానళ్లు పోటీ పడుతున్నాయి. వేలం వేసి వేలకోట్లు తీసుకుని హక్కులు ఇస్తోంది బీసీసీఐ.
ఇక 2007లో బోర్డు తీసుకున్న నిర్ణయం క్రికెట్‌నే శాసించే స్థాయికి చేర్చింది. ఆ ఏడాదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ అనే బంగారు బాతుని ఆవిష్కరించింది. ఫ్రాంఛైజీలు, ఆటగాళ్ల వేలం, క్రికెట్‌లోకి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్ల ఎంట్రీతో క్రికెట్ అభిమానులకు ఓ కొత్త అనుభూతిని పంచింది. ఈ ఐపీఎల్ వల్లే ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం చేతులు మారింది.
ఇప్పుడు ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ వేల కోట్లకు చేరింది. ఈ మనీ పవర్‌తో క్రికెట్‌ను బీసీసీఐ శాసించడం మొదలుపెట్టింది. ఇప్పుడో సాధారణ క్రికెటర్ కూడా కోట్లు సంపాదిస్తున్నాడంటే దానికి కారణం ఐపీఎల్. ఒకప్పుడు మ్యాచ్‌ల టెలికాస్ట్ కోసం డీడీకి ఎదురు చెల్లించిన బీసీసీఐ.. ఇప్పుడీ స్థాయికి చేరడం నిజంగా ఓ అద్భుతమే. కరోనా కాలంలో ఆదాయం తగ్గినప్పటికీ, బీసీసీఐ బలంగానే ఉంది. 18వేల కోట్ల నెట్ వర్త్ తో ప్రపంచంలోనే రిచెక్ట్ క్రికెట్ ఆర్గనైజేషన్ గా నిలిచింది.
ఐపీఎల్ ఆట మాత్రమే కాదు ఆదాయం కూడా ఆ రేంజ్‌లో ఉంటోంది. అందుకే ఐపీఎల్‌లో భాగం అయ్యేందుకు.. ఐపీఎల్‌తో భాగం అయ్యేందుకు అన్ని సంస్థలు పోటీ పడుతున్నాయి. ఆ పోటీ ఏ రేంజ్‌లో ఉంటుందో.. మీడియా ప్రసార హక్కుల వేలంతో మళ్లీ ప్రూవ్ అయింది.
స్పాన్సర్‌షిప్, బ్రాండ్ వ్యాల్యూ, వేలంపాట, ప్రసార హక్కులు.. ఇలా ప్రతీదాంట్లో ఐపీఎల్‌కు కోట్లు వచ్చి చేరుతున్నాయ్. క్రికెట్‌ను ఐపీఎల్ ఏ రేంజ్‌లో కూర్చోబెట్టిందంటే.. క్రికెట్ అంటే..పిచ్చివాళ్లు ఆడే అంటూ గేలి చేసి ఎగతాళి చేసిన అమెరికా కూడా ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వైపు మొగ్గుచూపుతోంది. ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి రాబోతోన్న అమౌంట్ చూసి ప్రతీ ఒక్కరు అవాక్కవుతున్నారు .
టీవీ హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు 57కోట్ల 50 లక్షలు చెల్లిస్తే, డిజిటల్ హక్కులు కూడా రూ. 50కోట్లు పలకటం ఆశ్చర్యపరిచే అంశం. వయాకామ్,డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమేజాన్, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు… ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అయితే వయాకామ్, అమేజాన్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు, ఐపీఎల్ మీడియా బిడ్డింగ్ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐకి నిరాశ తప్పదేమో అనుకున్నారంతా. అయితే స్టార్ స్పోర్స్, సోనీ నెట్‌వర్క్ కలిసి బిడ్డింగ్ పెంచుతూ పోయాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ-బిడ్డింగ్ లో చెలరేగిన నేపథ్యంలో వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లో మ్యాచ్ ల సంఖ్యను పెంచనున్నారు. ఐపీఎల్ లో ఓ సీజన్ నిడివి రెండున్నర నెలలు ఉండేలా ఐసీసీ షెడ్యూల్ లో మార్పులు చేయనున్నట్టు సమాచారం. ఆ లెక్కన ఓ ఐపీఎల్ సీజన్ లో 94 మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది.
బీసీసీకే కాదు… ఐపీఎల్ జట్లను కొన్న ఫ్రాంచైజీలకు కూడా కాసుల వర్షం కురుస్తోంది. ఒక్కో జట్టు ఆదాయం తెలిస్తే షాకవ్వాల్సిందే. టీంల ప్రకటనలు, స్థానిక ఆదాయాలను జోడిస్తే, గత కొన్నేళ్లలో IPLలోని ప్రతి జట్టు సంవత్సరానికి 300 కోట్లు సంపాదించింది. అయితే ఈ ఆదాయంలో ఎక్కువ భాగం ఆటగాళ్లకే వెచ్చించాల్సి వస్తోంది. ఐపీఎల్ జట్లు ప్రతి ఏడాది వీటిలో దాదాపు 90 కోట్లను ఆటగాళ్ల ఫీజుల కోసం ఖర్చు చేస్తాయి. ఆటగాళ్ల విమానాలు, హోటల్ బసతో సహా ఆపరేషన్ ఖర్చుల కోసం జట్లు ప్రతి ఏడాది 35 నుంచి 50 కోట్లు వెచ్చిస్తాయి. అంటే.. ఈ రెండు ఖర్చులను కలిపి టీమ్‌లు ఏటా 130 నుంచి 140 కోట్లు ఖర్చు చేస్తున్నాయన్నమాట. అలాగే ప్రతి మ్యాచ్ నిర్వహణకు జట్లు.. ఆయా రాష్ట్ర అసోసియేషన్‌కు 50 లక్షలు- అంటే ప్రతి సీజన్‌లో 7 మ్యాచ్‌లకు 3 కోట్ల 50 లక్షలు చెల్లించాలి. ఇది కాకుండా, జట్లు తమ మొత్తం సంపాదనలో 20 శాతం బీసీసీఐకి ఇవ్వాలి. ఇది జట్ల ఆదాయాల ప్రకారం దాదాపు 25 నుంచి 30 కోట్ల వరకు రావొచ్చు. ఇప్పుడు ఐపీఎల్ టీములు ప్రతి ఏటా 300 కోట్లు సంపాదిస్తే.. దాదాపు 160 నుంచి 165 కోట్ల వ్యయాన్ని తీసివేస్తే, ఆ జట్లకు ఏటా 130 నుంచి 140 కోట్ల ప్రాఫిట్ వస్తుంది. ఇక ఐపీఎల్ ప్రైజ్ మనీ కూడా టాప్-4 జట్లకు సంపాదనకు సాధనంగా మారింది. .
సమ్మర్ అంటే మండే ఎండలే కాదు.. ఐపీఎల్ కూడా. అసలీ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా అన్న అనుమానం నుంచి.. ఇలాంటి కాన్సెప్ట్ కనిపెట్టిన వాళ్లకు సలాం అనే రేంజ్‌కు పరిస్థితి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ.. పట్టిందల్లా బంగారమే. విసిరిన ప్రతిబంతీ కాసులు కురిపిస్తోంది. అందుకే, ఇప్పుడు క్రికెట్ అంటే బిజినెస్ అనేలా మారింది. ఆఖరికి కరోనా కూడా ఐపీఎల్ క్రేజ్‌ను ఆపలేకపోయింది. అంతలా భారత్‌లో పాతుకుపోయింది క్రికెట్. జెంటిల్మెన్ గేమ్‌గా మారిన క్రికెట్… ఐపీఎల్ రాకతో ఉన్నత శిఖరాలకు చేరింది.
కాలానికి తగ్గట్టుగా మారడం కూడా క్రికెట్‌కు అతిపెద్ద అడ్వాంటేజ్ అయింది. టెస్ట్‌క్రికెట్‌పై జనానికి బోరు కొట్టగానే వన్డేలు వచ్చేశాయి.. వన్డేలు కూడా ఇంతేనా అనుకునే టైంలో టీ-20 క్రికెట్ వచ్చింది. ఇక టీ-20 క్రికెట్ మజాను మరింత పెంచుతూ ఐపీఎల్ రంగప్రవేశం చేసింది. ఈ ధనా ధన్ బాదుడుతో అభిమానుల్లో క్రికెట్‌పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఫోర్లు, సిక్సర్లతో రంజుగా సాగే పొట్టి క్రికెట్ అసలైన కిక్ ఇచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు క్రికెట్‌లో వచ్చిన కొత్తదనం.. పటిష్టమైన ఫ్యాన్‌బేస్‌ను ఏర్పాటుచేసింది. ఎంత సూపర్‌స్టార్ సినిమా అయినా.. దేశంలో వందకోట్ల మంది చూస్తారని గట్టిగా చెప్పలేం కానీ.. క్రికెట్ మ్యాచ్ మాత్రం వంద కోట్ల మంది చూడడం గ్యారెంటీ అనేంతగా క్రికెట్ ఎదిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో దాని క్రేజ్ అమాంతం పెరిగింది.
కండ్లు చెదిరే మెరుపు ఇన్నింగ్స్.. అబ్బురపరిచే బౌలింగ్ ప్రదర్శనలు.. వారెవ్వా అనిపించే ఫీల్డింగ్ విన్యాసాలతో ఐపీఎల్ ఓ కలర్‌ఫుల్ ఈవెంట్‌గా మారిపోయింది. బ్యాట్స్‌మెన్లు సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతుంటే… మైదానంలో ఉన్న ప్రేక్షకుడికి వచ్చే ఆ కిక్కేవేరు. ఇప్పుడు క్రికెట్ బిజినెస్ సూపర్‌హిట్ అయ్యింది. ఇండియాలో ఈ రోజు క్రికెట్ ఒక ఆట కాదు.. అతిపెద్ద బిజినెస్. ఒకప్పుడు క్రికెట్ అంటే వైట్ అండ్ వైట్ డ్రెస్ మాత్రమే. నేడు జెంటిల్మెన్ గ్రేమ్.. ఇప్పుడది జెంటిల్మెన్ బిజినెస్‌గా మారింది.
సినిమాలు, ఓటీటీలు ఇవన్నీ ఐపీఎల్ ముందు బలాదూర్. భారత్‌లో క్రికెట్ మోజు ఏ మాత్రం తగ్గకపోగా.. ఐపీఎల్ టోర్నీతో అది మరింత పెరిగింది. గత రెండేళ్లు కరోనా వచ్చి అన్ని రంగాలను కుదేలు చేసింది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. కానీ ఐపీఎల్‌ను అడ్డుకట్ట వేయలేకపోయింది. భారత్‌లో నిర్వహించడానికి బదులుగా యూఏఈకి షిఫ్ట్ చేసి విజయవంతగా టోర్నీని నిర్వహించి సక్సెస్ అయ్యింది బీసీసీఐ. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించకపోయినా.. క్రికెట్ బిజినెస్ ఏ మాత్రం తగ్గలేదు. టీవీల్లో కోట్లాది మంది ప్రజలు వీక్షించి ఆనదించారు. అంతే కాదు సినిమాలు, OTTలు ఇలా ఏదైనా కలర్‌ఫుల్ క్రికెట్ ముందు తెలిపోయాయి. మహమ్మారితో సినిమా చతికిలపడ్డ.. ఐపీఎల్ మాత్రం కనీవిని ఎరగని లాభాలతో దూసుకుపోయింది.
ఒకప్పుడు ఇంటర్నేషన్ క్రికెటర్స్ స్వదేశానికి తప్పితే.. ఇతర దేశాలు నిర్వహించే లీగ్స్‌లో ఆడేవారు కాదు. కానీ ఐపీఎల్ వచ్చాక పూర్తిగా ట్రెండ్ మారిపోయింది. ఐపీఎల్ ఓ ట్రెండ్ సెట్ చేసింది. విదేశీ జట్లకు చెందిన ఆటగాళ్లంతా ఒక్కసారి ఐపీఎల్‌లో ఆడితే చాలు అన్న పరిస్థితికొచ్చింది. ఏకంగా ఐపీఎల్ కోసం ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను కాదని.. తమ క్రికెట్ బోర్డుతో ఆటగాళ్లు గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని బట్టే తెలుస్తుంది ప్రపంచంలో ఐపీఎల్‌కు ఎంత ఆదరణ ఉందనేది. ఐపీఎల్ దెబ్బకు అన్ని బోర్డులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. బీసీసీఐకి ఎదురు చెప్పలేక.. చేసేదేమి లేక ఆయా దేశాల బోర్డులే ఐపీఎల్ కోసం తమ షెడ్యూల్‌ను మార్చుకుని పరిస్థతి ఏర్పడింది. ఇక జీవితాంతం తమ బోర్డు తరపున వందల మ్యాచులు ఆడినా రాని ఆదాయం, గుర్తింపు.. ఐపీఎల్‌తో వస్తుంది. ప్రతి ఆక్షన్‌లో ఒక్కో ఆటగాడు కోట్లు కొల్లగొట్టారు. ఎన్నడూ చూడని ఆదాయాన్ని వెనకేసుకుంటున్నారు. అంతే కాదు క్రికెట్ నుంచి రిటైర్ అయినా.. కోచ్ రూపంలో ఐపీఎల్‌లో సేవలు అందిస్తూ డబ్బు దండిగా పోగేసుకుంటున్నారు మాజీ ఆటగాళ్లు.
ఫ్రాంచైజీల నుంచి ఆటగాళ్లకు దక్కిన మనీతో పాటు ప్రైజ్ మనీ అదనం. మ్యాచుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు ఇచ్చే అవార్డులతో ఐపీఎల్ ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. ఐసీసీ నిర్వహించే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రమే ఇస్తారు. కానీ ఐపీఎల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్, సూపర్ సిక్సర్ ఇలా ఎడెనిమిది అవార్డులు ఆటగాళ్లకు అందిస్తున్నారు స్పాన్సర్లు. ఎవరు అవునన్నా కాదన్నా.. ఐపీఎల్ అనేది ఓ సక్సెస్ ఫార్ములా.
దాదాపు రెండేళ్ల తరువాత ఫ్యాన్స్‌తో క్రికెట్ స్టేడియాలు ఫుల్‌గా దర్శనమిస్తున్నాయి. 100 శాతం కెపాసిటీకి అనుమతించడంతో… స్టేడియానికి అభిమానులు పోటెత్తుతున్నారు. ఎక్కడ మ్యాచ్ పెట్టినా టికెట్లు గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. టికెట్ల అమ్మకాల ద్వారా కూడా బీసీసీఐకి భారీ ఆదాయం వస్తోంది. ప్రత్యక్షంగా ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్ ప్రేమికులు కూడా ఉవ్విళ్లూరుతుంటారు. గతంలోనూ.. ఇప్పుడు విదేశాల్లో ఐపీఎల్ మాదిరిగానే టోర్నీలు నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ అట్టర్ ప్లాప్ అయ్యాయి. కానీ ఇండియన్ ప్రీయర్ లీగ్ మాత్రం సూపర్ హిట్.. కాద్ బ్లాక్ బస్టరే అయ్యింది. రానున్న రోజుల్లో క్రికెట్‌కు ఇంకా ఆదరణ పెరుగుతుదే తప్పా.. తగ్గే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. వచ్చే ఏడాదిలో జెంటిల్మెన్ గేమ్ అన్ని ఆటలను శాసించబోతోంది. వరల్డ్‌లోనే అత్యంత క్యాష్ రీచ్ లీగ్‌గా ఐపీఎల్ అవతరించబోతోంది.
అయితే, ఐపీఎల్ ఆటగాళ్ల ధోరణిని పూర్తిగా మార్చేసిందనే వాదనలు కూడా ఉన్నాయి. సిక్సులు బాదే ఆటగాళ్లకే ప్రాధాన్యం పెరగటం కనిపిస్తోంది. మరోపక్క ఆటగాళ్లు కూడా కోట్లు కురిపించే ఐపీఎల్ కి ప్రాధాన్యత ఇచ్చి, ఇతర ఫార్మాట్ లను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. క్రికెట్ ని పూర్తిస్తాయి ఎంటర్ టెయిన్ మెంట్ గా మార్చేసి ఆటను మార్చేసిందని కూడా కొందరి వాదన. ఇది ఫ్యూచర్ లో మరెన్ని మార్పులు తెస్తుందో అనే అనుమానాలు కూడా ఉన్నాయి.